రైతుల పంటల కొనుగోలు ధాన్యం భరోసా

  • ధాన్యం కమీషన్‌ సొమ్ముతో నిరి్మంచిన ఠానేల్లంక సంఘ భవనం
  • వ్యవసాయ సహకార సంఘాలకు ఊపిరి పోస్తున్న ధాన్యం కొనుగోళ్లు
  • కమీషన్ల రూపంలో అదనపు ఆర్జన
  • ఏటా కమీషన్‌గా రూ.5 కోట్లు 
  • వైఎస్‌ హయాంలో శ్రీకారం
  • పీఏసీఎస్‌ల తోడ్పాటుతో ఆర్బీకేల్లో కొనుగోళ్లకు సన్నాహాలు

ధాన్యం కొనుగోళ్లతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు( పీఏసీఎస్‌) ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నాయి. రుణాలు సకాంలో చెల్లించక, బినామీల పేరుతో లక్షలు కొల్లగొట్టడం వంటి చర్యలతో బలహీనపడిన సంఘాలు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నాయి. జిల్లాలో సహకార సంఘాలకు ఆర్థిక భారం వెంటాడుతోంది. చంద్రబాబు హయంతలో సహకార స్పూర్తిని దెబ్బతీస్తూ సంఘాలను నిర్వీర్యం చేశారు. టీడీపీ నాయకులు..వారి అనుచరులు ఎక్కడికక్కడ సంఘాల్లో లక్షలు నొక్కేసి ఖజానా గుల్ల చేసేశారు.

వైఎస్‌ చలవతో.. 
సహకార సంఘాలకు మేలు చేయాలనే తలంపుతో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో  ధాన్యం కొనుగోలు బాధ్యతలు అప్పగించారు. ఒక రకంగా సంఘాల నెత్తిన ఆయన పాలు పోశారని సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. రైతులు తాము పండించిన పంటను సంఘాలకు విక్రయించేందుకు ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. నాడు వైఎస్‌ ఏ ఉద్ధేశంతో అయితే వీటికి అనుమతించారో ఆ లక్ష్యం నెరవేరుతూనే ఉంది. ఒకానొక దశలో సంఘాల్లో పనిచేసే సిబ్బందికి కనీసం జీతాలు, విద్యుత్‌ బిల్లులు కూడా చెల్లించలేని దీనావస్థలో ఉండేవి.

ఆ ఇబ్బందులు తొలగి సంఘం సభ్యులకు లాభాలు పంచే స్థాయికి సొసైటీలు చేరుకున్నాయి. వైఎస్‌ ముందుచూపుతో ఇది సాధ్యమైందనడం ఎలాంటి సందేహమూ లేదు.  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు మూస బాణీని మార్చుకున్నాయి. రైతులకు పంట రుణాలు, ఎరువులు విక్రయం, పెట్రోల్‌ బంక్‌ల నిర్వహణ, గోదాముల నిర్మాణం, వాటర్‌ ప్లాంట్ల ఏర్పాటు వంటి చర్యలతో ధాన్యం కొనుగోళ్లు కూడా చేపడుతున్నాయి. రైతుల పండించే వరి, మొక్కజొన్న తదితర పంటలు కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉన్నాయి.ఈ ఉత్పత్తుల కొనుగోలు ద్వారా వచ్చే కమీషన్‌తో సంఘాల్లో మౌలిక వసతులు కలి్పంచడంతో పాటు సభ్యులకు బోనస్‌ ఇచ్చే స్థాయికి చేరుకున్నాయి.

కమీషన్లతో ఆర్జన 
తూర్పు గోదావరి జిల్లాలో సీజన్‌లో ధాన్యం కొనుగోళ్ల ద్వారా సహకార సంఘాలకు రూ.5 కోట్లు కమీషన్‌ రూపంలో ఆర్జిస్తున్నాయి. జిల్లాలో 401 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. వీటి పరిధిలో  సీజన్‌లో కనీసం 375 గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కొనుగోళ్లతో సమకూరిన ఆదాయాలతో జిల్లాలో సగానికి పైగా సంఘాలు ఆరి్థకంగా బలోపేతమవుతున్నాయి. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో సైతం ధాన్యం కొనుగోళ్లుకు సంఘాలు సిద్ధపడుతున్నాయి.ఈ మేరకు సహకార అధికారులు సంఘాలను సమాయత్తం చేస్తున్నారు.ఈ  సారి రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సహకార సంఘాలు తోడ్పాటుతో ఆర్బీకేలలో కొనుగోలు చేయనున్నారు. గతం నుంచి పెండింగ్‌లో ఉన్న కమీషన్లను త్వరలో విడుదల కానున్నాయని సమాచారం. ఇందుకు కసరత్తు జరుగుతోందని పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు.

మచ్చుకు కొన్ని…
ముమ్మిడివరం మండలం ఠాణేలంక పీఏసీఎస్‌ గతేడాది 80 వేల క్వింటాళ్ల కొనుగోలు చేసింది. ప్రభుత్వం ఒక క్వింటాలు ధాన్యం కొనుగోలుకు రూ.31.25 కమీషన్‌గా ఇస్తోంది. 80 వేల క్వింటాళ్ల కొనుగోలుపై ఈ సంఘానికి రూ.24 లక్షలు కమీషన్‌గా ఆదాయం సమకూరింది.
పి.గన్నవరం మండలం నాగల్లంక పీఏసీఎస్‌ 74 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి రూ.23 లక్షలు కమీషన్‌ రూపంలో లాభపడింది.
జిల్లాలో 2019– 2020 ఖరీఫ్‌ సీజన్‌లో 244 కేంద్రాల ద్వారా రూ.2,300 కోట్లు విలువైన ధాన్యం కొనుగోలు చేసి రికార్డు సృష్టించాయి.
ప్రతి సీజన్‌లోను సొసైటీలు రూ.2000 కోట్లు విలువైన ధాన్యం కొనుగోలు చేస్తూ వచ్చాయి.  
కొనుగోలుచేసే ధాన్యంపై క్వింటాల్‌కు ఏ–గ్రేడ్‌ ధాన్యానికి రూ.32, కామన్‌రకం «ధాన్యానికి రూ.31.25 వంతున కమీషనుగా సంఘాలకు ప్రభుత్వం జమ చేస్తుంది. – రెండు నెలల వ్యవధిలోనే ఆదాయం వస్తుండటంతో కొనుగోళ్లపై సంఘాలు ఆసక్తి కనబరుస్తున్నాయి.
కమీషన్‌ త్వరితగతిన అందచేస్తే మరింత కొనుగోళ్లు ఊపందుకుంటాయని సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.

సంఘాల తోడ్పాటుతో కొనుగోలు ఇలా.. 
ఈ సీజన్‌లో ప్రభుత్వం తొలిసారి వినూత్నంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తోంది. సహకార సంఘాల తోడ్పాటుతో ఆర్బీకేల వద్దనే కొనుగోలు చేయనుంది. జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌ ఆదేశాల మేరకు సహకార సంఘాలను అప్రమత్తం చేసేందుకు శనివారం జిల్లా సహకార అధికారి దుర్గాప్రసాద్‌ పీఏసీఎస్‌ అధికారులతో డివిజన్‌ వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. రైతులు నేరుగా పంట పొలాలకు సమీపాన ఉన్న ఆర్బీకేల వద్దనే ధాన్యం అమ్ముకునే వెసలుబాటు కలి్పస్తోంది. జిల్లాలో 900పైనే ఆర్బీకేలను గుర్తించారు.

ధాన్యం లభించే ప్రాంతాన్ని బట్టి ఆర్బీకేలను ఏ,బీ,సీ గ్రూపులుగా విభజించి అవసరాన్ని బట్టి ఉద్యోగులను నియమించనున్నారు. ఏ గ్రూపు(ధాన్యం ఎక్కువగా కొనుగోలు)లో నలుగురు, బీ గ్రూపులో ముగ్గురు, సీ గ్రూపులో ఒకరు వంతున పనిచేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సంఘాల్లోని సుమారు 600 మంది ఉద్యోగులను వినియోగించనున్నారు. వీరితో పాటు ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా 1800 మంది సిబ్బంది ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగస్వామ్యం వహించనున్నారు.

సంఘాలు బలపడుతున్నాయి 
ప్రభుత్వ లక్ష్యం మేరకు సంఘాల తోడ్పాటుతో రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. సంఘం పరిధిలో రెండు, మూడు ఆర్బీకేలు ఉండటంతో తగ్గట్టుగా సిబ్బందిని నియమించుకోవాల్సి ఉంటుంది. కొనుగోలు కమీషన్‌తో సహకార సంఘాలు ఆర్థికంగా బలపడతాయి. కమీషన్‌తో సంఘాలను సహకారశాఖ అధికారులు మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.
–ఇ లక్ష్మీరెడ్డి,  జిల్లా మేనేజర్, పౌరసరఫరా కార్పొరేషన్‌

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/agricultural-cooperative-societies-financial-cushion-grain-purchases-ap