‘నవరత్నాల’తో స్థిరమైన అభివృద్ధి

  • ప్రకృతి వ్యవసాయంలో ఇతర దేశాలు, రాష్ట్రాలకు ఏపీ ఆదర్శం
  • సీఎం జగన్‌ను అభినందించిన యూఎన్‌ అసిస్టెంట్‌ సెక్రటరీ జనరల్‌ సత్య ఎస్‌ త్రిపాఠి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న ‘నవరత్నా’ల్లోని వైఎస్సార్‌ రైతుభరోసా, చేయూత, ఆసరా వంటి పథకాలు ప్రజల జీవితాల్లో పెనుమార్పులు తీసుకురావడంతో పాటు స్థిరమైన అభివృద్ధిని తీసుకువస్తాయన్న నమ్మకం తనకుందని యునైటెడ్‌ నేషన్స్‌ అసిస్టెంట్‌ సెక్రటరీ జనరల్‌ సత్య ఎస్‌ త్రిపాఠి సీఎం వైఎస్‌ జగన్‌తో అన్నారు. అలాగే, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఇతర దేశాలకు, రాష్ట్రాలకు ఏపీ సర్కార్‌ మార్గదర్శకంగా నిలుస్తోందంటూ త్రిపాఠి కొనియాడారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సత్య ఎస్‌ త్రిపాఠి సోమవారం ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీరిరువురి మధ్య ప్రకృతి వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణపై చర్చ జరిగింది. సీఎం జగన్‌

యునైటెడ్‌ నేషన్స్‌తో కలిసి పనిచేస్తాం
‘ఆంధ్రప్రదేశ్‌లో అన్ని గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. ఆర్బీకేల్లో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల (సీహెచ్‌సి) ద్వారా రైతులకు దీనిపై శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వేస్ట్‌ను కూడా రీసైకిల్‌ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. దీనిపై సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలి. ఏపీ ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించడంతో పాటు యునైటెడ్‌ నేషన్స్‌తో కలిసి పనిచేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

గ్లోబల్‌ ఆర్గనైజేషన్స్‌తో భాగస్వామ్య ఒప్పందాలవల్ల రాష్ట్రానికి మేలు జరగడంతోపాటు ప్రజల జీవితాల్లో మార్పు సాధ్యపడుతుంది. అలాగే, సేంద్రీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించడం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు మరింత మేలు జరుగుతుంది’.. అని సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా కార్బన్‌ న్యూట్రాలిటీ సాధించాల్సిన అవసరంపై ఈ సమావేశంలో చర్చించారు. వేస్ట్‌ టూ వెల్త్‌ అనే అంశంపై త్రిపాఠి మాట్లాడుతూ.. ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి, ఎలక్ట్రానిక్‌ వేస్ట్‌ను ఈ–క్లస్టర్‌ల ద్వారా సేకరించవచ్చని, ఇందుకుగాను అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సత్య ఎస్‌ త్రిపాఠిని సీఎం జగన్‌ శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ టి. విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.