నాణ్యమైన బోధన అందేలా పాఠ్యపుస్తకాల రూపకల్పన

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

విద్యార్థులకు నాణ్యమైన, సరళమైన బోధన అందేలా పాఠ్య పుస్తకాలను రూపొందించాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ సూచించారు. సచివాలయంలో ఎనిమిదో తరగతి పాఠ్య పుస్తకాల రూపకల్పనపై జరిగిన ప్రాథమిక సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర విద్యా రంగంలోని సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా బైలింగువల్‌ లాంగ్వేజ్‌లో రూపొందిస్తున్న పాఠ్యపుస్తకాలు భవిష్యత్తులో పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడేలా ఉండాలని తెలిపారు. అమ్మ ఒడి, నాడు–నేడు ఇంగ్లిష్‌ మీడియం విద్య తదితర పథకాలతో పేదలకు మెరుగైన విద్య అందుతోందన్నారు. సీబీఎస్‌ఈ సిలబస్‌కు తగ్గట్టుగా విద్యార్థులను సంసిద్ధం చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని చెప్పారు. పాఠ్యపుస్తకాల  రూపకల్పనలో భాగస్వాములైన 13 జిల్లాలకు చెందిన దాదాపు 130 మంది రచయితలు, పాఠశాల విద్యా కమిషనర్‌ చిన వీరభద్రుడు, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వెట్రిసెల్వి, ఎస్‌ఈఆర్టీ డైరెక్టర్‌ ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు. 

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/adimulapu-suresh-says-textbooks-ensure-quality-teaching-1405834