నాలెడ్జ్‌ హబ్‌లుగా రైతు భరోసా కేంద్రాలు

  • సాగు పాఠాలు నేర్పుతున్న ఆర్‌బీకే చానల్‌ 
  • దేశంలోనే తొలిసారిగా ఏపీలో వినూత్న ప్రయోగం 
  • మూడు నెలల్లోనే 3.50 లక్షలకు చేరిన వీక్షకుల సంఖ్య 
  • యూట్యూబ్‌లోనూ ప్రసారాలు

వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను సాగు విజ్ఞాన కేంద్రాలు (నాలెడ్జ్‌ హబ్‌లు)గా ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. వ్యవసాయ, ఉద్యాన, పట్టు, ఆక్వా, పాడి రంగాల్లో వస్తున్న ఆధునిక సాంకేతిక పోకడలను ఎప్పటికప్పుడు రైతులకు చేరువ చేసేలా వీటిని తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ‘ఆర్‌బీకే చానల్‌’ విశేష ఆదరణ పొందుతోంది. పైలట్‌ ప్రాజెక్టుగా యూట్యూబ్‌తో పాటు ఆర్‌బీకేల్లో డిజిటల్‌ మీడియా ద్వారా ప్రసారం చేస్తున్న ఈ చానల్‌ కార్యక్రమాలు రైతుల్లో సాగు నైపుణ్యాలను పెంపొందించేందుకు దోహదం చేస్తున్నాయి. ఈ చానల్‌ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాలను ఆర్‌బీకేల్లో ఏర్పాటు చేసిన డిజిటల్‌ స్టూడియో (టీవీ)లతో ‘యూ ట్యూబ్‌’ ద్వారా లైవ్‌ టెలికాస్ట్‌ అయ్యేలా ఏర్పాటు చేశారు. ఈ ప్రసారాలన్నీ నేరుగా మొబైల్‌లోనే చూసుకునే వెసులుబాటు కల్పించారు. ఏ రోజు ఏ శాఖకు సంబంధించి ఏ కార్యక్రమాలు ప్రసారమవుతాయో ఆర్‌బీకేలలో పనిచేసే సిబ్బందికి ముందుగానే తెలియజేయడంతోపాటు ఆ చానల్‌ను సబ్‌స్రై్కబ్‌ చేసుకున్న రైతులకు కూడా ఎస్‌ఎంఎస్‌ల ద్వారా తెలియజేస్తున్నారు. చానల్‌ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాలను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తుండటంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు మొబైల్‌ ద్వారా రైతులు వీక్షించే అవకాశం కలిగింది. 

గన్నవరంలో ప్రత్యేకంగా స్టూడియో 
చానల్‌ కోసం గన్నవరంలో ప్రత్యేకంగా స్టూడియో ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి ఆయా శాఖల ఉన్నతాధికారులు తమ సిబ్బందితో ప్రతిరోజు మాట్లాడుతున్నారు. ప్రభుత్వపరంగా తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలను ఈ చానల్‌ ద్వారా క్షేత్రస్థాయి సిబ్బంది వరకు చేరేలా ఏర్పాటు చేశారు. ప్రయోగాత్మకంగా వివిధ శాఖల కార్యకలాపాలు, శాస్త్రవేత్తల సూచనలు, సలహాలకు సంబంధించి ప్రసారమవుతున్న వీడియోలకు రైతుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటికే 3.50 లక్షల వీక్షకులు గల ఈ చానల్‌ను 88,500 మంది సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారు.   

‘రైతు భరోసా పత్రిక’కూ విశేష ఆదరణ 
ఆర్‌బీకేల్లో ఏర్పాటు చేసిన లైబ్రరీలలో వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన వివిధ మేగజైన్స్, పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నారు. ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ పేరిట వ్యవసాయ శాఖ 8 నెలలుగా మాసపత్రికను సైతం తీసుకొస్తోంది. ఈ మాసపత్రిక సైతం విశేష ఆదరణ పొందుతోంది. ఇప్పటికే దీనికి 60 వేల మంది రైతులు చందాదారులుగా చేరారు. వ్యవసాయ, ఉద్యాన, పట్టు, ఆక్వా సాగులో వస్తున్న మార్పులు, పాడి సంరక్షణ కార్యక్రమాలను సామాన్య రైతులకు సైతం అర్థమయ్యే రీతిలో ఈ పత్రికలో విశదీకరిస్తున్నారు

సీఎం చేతుల మీదుగా త్వరలో ప్రారంభం 
పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకొచ్చిన ‘ఆర్‌బీకే చానల్‌’కు రైతుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. రైతులు స్వచ్ఛందంగా సబ్‌స్రై్కబ్‌ చేసుకుంటున్నారు. ఈ చానల్‌ ప్రసారాలను స్వయంగా వీక్షించేందుకు రాష్ట్రంలో ఎంపిక చేసిన ఓ రైతు భరోసా కేంద్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి త్వరలో సందర్శించనున్నారు. ఆయన చేతుల మీదుగా ఈ చానల్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే వ్యవసాయ శాఖ తీసుకొస్తున్న ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ మాసపత్రికకు సైతం విశేష ఆదరణ లభిస్తోంది. 
– హెచ్‌ అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ 

చాలా బాగుంది 
యూట్యూబ్‌ను కాలక్షేపం కోసం చూసేవాళ్లం. నెల క్రితం ఆర్‌బీకే సిబ్బంది చెప్పడంతో ‘ఆర్‌బీకే చానల్‌’ సబ్‌స్రై్కబ్‌ చేసుకున్నా. చాలా బాగుంది. మాకు అవసరమైన వీడియోలను ప్రసారం చేస్తుండటం వల్ల ఎంతో మేలు కలుగుతోంది. వైఎస్సార్‌ ఉచిత బీమా, రైతు భరోసా ఇతర సంక్షేమ పథకాల కోసం ఈ చానల్‌ ద్వారా వ్యవసాయ కమిషనర్‌ చెబుతున్న తీరు ఎంతో బాగుంది.
–గుంటూరు నాగఫణికుమార్, కౌతరం,  కృష్ణా జిల్లా