నిరంతర విద్యుత్‌తో ఆక్వా రైతుల్లో ఆనందాలు

  • భారీగా తగ్గిన డీజిల్‌ వినియోగం
  • 60,472 సర్వీసులకు అందుతున్న సబ్సిడీ కరెంట్‌
  • యూనిట్‌ కేవలం రూ.1.50కే సరఫరా
  • డీజిల్‌ ఖర్చుతోపాటు తగ్గిన విద్యుత్‌ బిల్లులు
  • ఆక్వా రైతుల్లో ఆనందం

జాలాది శ్రీమన్నారాయణ, జయలక్ష్మి.. ఆక్వా సాగుకోసం 2018–19లో 1,400 లీటర్ల డీజిల్‌ను వినియోగించారు. 2019–20లో అది 540 లీటర్లకు తగ్గింది. 2020–21లో 180 లీటర్లు సరిపోయింది.

పామర్తి బాలకోటేశ్వరరావు ఆక్వా సాగుకోసం 2018–19లో 32 లీటర్ల డీజిల్‌ వినియోగించారు. 2019–20లో 12 లీటర్లకు తగ్గింది. 2020–21లో కేవలం 10 లీటర్లు మాత్రమే వినియోగించారు.

చేప ఎండకుండా ఉండాలంటే మోటారుతో నీటిని తోడి చెరువు నింపాలి. చెరువులో రొయ్య బతికుండాలంటే నిరంతరం విద్యుత్‌ అందుబాటులో ఉండాలి. ఈ రెండిటిలో ఏది జరగకపోయినా ఆక్వా రైతు ఆస్తులు అమ్ముకున్నా తీర్చలేనంత అప్పులపాలవడం ఖాయం. అందుకే ఆక్వా రైతులు ఖర్చెంతైనా పర్లేదనుకుంటూ డీజిల్‌ మోటార్లు వాడుతుంటారు. పెట్రోల్‌తో సమానంగా డీజిల్‌ ధరలు పెరుగుతూనే ఉండటంతో పెట్టుబడులకు భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలో నేనున్నానంటూ ఆదుకున్నారు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చేపలు, రొయ్యల చెరువుల విద్యుత్‌ సర్వీసులకు రూ.3.85 ఉన్న క్రాస్‌ సబ్సిడీని రూ.2.35కు తగ్గించారు. 60,472 సర్వీసులకు సబ్సిడీపై యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50కే అందేలా చేశారు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.720 కోట్ల భారం పడుతోంది. అయినా ప్రభుత్వం ఆక్వా రైతుల సంక్షేమం కోసం ఈ భారాన్ని భరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఆక్వాసాగుకు నిరంతర విద్యుత్‌ను సమకూరుస్తున్నాయి. ఫలితంగా డీజిల్‌ వాడకం కొన్ని ప్రాంతాల్లో సగానికిపైగా, మరికొన్ని ప్రాంతాల్లో దాదాపు పూర్తిగా తగ్గిపోయింది.

ఆర్థికభారం తగ్గింది
నేను ఆలపాడులో రొయ్యలు సాగుచేశాను. గతంలో విద్యుత్‌ కోతలు ఎక్కువగా ఉండటంతో ఎకరానికి రోజుకు 40 లీటర్ల డీజిల్‌ అవసరం ఉండేది. దానికి నెలకు రూ.86,800 ఖర్చుపెట్టాల్సి వచ్చేది. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆక్వా రైతులకు యూనిట్‌ కరెంటును రూ.1.50కి అందించారు. దీంతో ఇప్పుడు ఎకరానికి నెలకు కేవలం విద్యుత్‌ బిల్లు రూ.5,800 వస్తోంది. సబ్సిడీ లేకపోతే ఇదే బిల్లు నెలకు రూ.25 వేలకుపైనే వచ్చేది. విద్యుత్‌ను సబ్సిడీతో నిరంతరం ఇవ్వడం వల్ల నాలాంటి ఆక్వా రైతులందరూ సంతోషంగా ఉన్నారు.
– ముంగర నరసింహారావు, ఆక్వా రైతు, వడ్లకూటితిప్ప, కైకలూరు మండలం

ఆక్వా రైతులకు వరం
దేశంలోనే ఆక్వా ఉత్పత్తుల్లో మన రాష్ట్రం అగ్రగామిగా ఉంది. నేను పెంచికమర్రు గ్రామంలో రొయ్యలు సాగుచేశాను. ఒక పంట సాగుకు నాలుగు నెలలు సమయం పట్టేది. 2019 ప్రారంభంలో నాలుగు నెలలకు ఒక ఎకరం రొయ్యల సాగుకు డీజిల్‌ కోసం రూ.3,47,200 ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఒక్కో ఎకరానికి రోజుకు కనీసం 40 లీటర్ల డీజిల్‌ వినియోగించాలి. ఇప్పుడు విద్యుత్‌ ధర రూ.1.50 చేయడం వల్ల నాలుగు నెలలకు కరెంటు బిల్లు రూ.24 వేలు మాత్రమే వస్తోంది. లక్షల్లో ఖర్చు మిగులుతోంది.
– జయమంగళ కాసులు, రొయ్యల రైతు, పెంచికలమర్రు, కైకలూరు మండలం 

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/happiness-among-aqua-farmers-reduced-electricity-bills-1429399