నీడ దొరికిన వేళ..

  • పేదోడి ఏళ్ల నాటి సొంతింటి కల సాకారం
  • జగనన్న దూరదృష్టితో అమిరిన గూడు
  • ప్రయోగాత్మకంగా పెదవేగిలో ఆదర్శగృహాలు

పాదయాత్ర సమయంలో ఊరూరా నిరుపేద గూడు గోడు విన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చలించిపోయారు. పేదలు సొంత ఇల్లు కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నట్లు తెలుసుకుని “నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ వారికి అండగా నిలవాలని నిశ్చయించుకున్నారు. అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే అర్హులు ఎంతమంది ఉంటే అందరికీ ఉచితంగా స్థలం ఇవ్వడమే కాక ఇంటిని నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా డిసెంబర్‌ 25వ తేదీ నుంచి రాష్ట్రమంతా అట్టహాసంగా ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభమైంది.

చరిత్రలో ఎన్నడూలేని విధంగా జిల్లాలో 1,70,699 మందికి సొంత ఇంటి కల నెరవేరింది. అంతే కాకుండా ఇంటి పట్టాతో పాటు ఇల్లు నిర్మాణానికి ఒక్కొక్కరికి 1,80,000 రూపాయలు నిధులు ఉచితంగా మంజూరు చేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేరిట మంజూరు పత్రాలు సైతం అందజేస్తున్నారు. ఇళ్ల నిర్మాణ విషయమై లబ్ధిదారులకు మూడు అవకాశాలు ఇచ్చారు. ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వడం, లబ్ధిదారుడే ఇల్లు నిర్మించుకుంటే నిధులు మంజూరు చేయడంతో సగం ధరకే మెటీరియల్‌కు సంబంధించి నిధులు బ్యాంక్‌ ఖాతాకు జమ చేస్తున్నారు. దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి చొరవతో ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు ఆదర్శ గృహాల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే కొందరు లబ్ధిదారులు కొత్త ఇళ్లల్లోకి మకాం మార్చడం విశేషం.