నైపుణ్యాలను పెంచే 30 ప్రత్యేక కళాశాలలు ప్రారంభం

    రాష్ట్రంలోని యువతకు స్థానికంగా ఉండే పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. అందుకు అనుగుణంగా పరిశ్రమల్లో పనిచేయడానికి నైపుణ్యం కలిగిన యువతను తయారు చేయడమే లక్ష్యంగా రాష్ట్రంలో ఒక నైపుణ్య విశ్వవిద్యాలయంతోపాటు, పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక స్కిల్ కాలేజీ చొప్పున 25, 4 త్రిపుల్ ఐటీలు, పులివెందుల జేఎన్టీయూలో కలిపి మొత్తం 30 స్కిల్ కాలేజీలకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి మేకపాటి గౌతం రెడ్డి స్పష్టం చేశారు.  ఇందుకు సంబంధించిన ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ మొత్తం పూర్తయింది. పరిపాలన అనుమతులు కూడా వచ్చాయని. త్వరలోనే ఈ 30 స్కిల్ కాలేజీల నిర్మాణం ప్రారంభం కానున్నాయని గౌతం రెడ్డి అన్నారు.

    ఒక్కో స్కిల్ కాలేజీలో ఎలాంటి కోర్సులు ఉండాలన్న దానిపై పరిశ్రమలశాఖ, నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్తంగా  ‘సమగ్ర పరిశ్రమ సర్వే’ సగానికిపైగా పూర్తయిందన్నారు. రాబోయే రోజుల్లో అవసరాలను, యువత ఆశయాలను గుర్తించి పరిశ్రమలకు కావలసిన నైపుణ్యం అందించేందుకు, తద్వారా ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగు ముందుకు వేస్తుందని మంత్రి మేకపాటి పేర్కొన్నారు. కరోనా సమయంలోనూ యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను ఆన్ లైన్ ద్వారా అందించడం జరిగిందని.. అందుకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్ఎస్డిసి)కి జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు వచ్చిందని ఈ సందర్భంగా మంత్రి గౌతమ్ రెడ్డి గుర్తు చేశారు.