పంటకు వైద్యం హోమియో సేద్యం!

‘మనుషులకు రాక, మానులకు వస్తాయా రోగాలు…?’ అంటుంటారు మన పెద్దలు. మొక్కలు, చెట్లకు కూడా వింత రోగాలు వస్తున్న కాలం ఇది. మరి, మనుషులకు వాడే మందుల్నే వాటికి ఎందుకు వాడకూడదు? అనే ఆలోచన వచ్చింది ‘జిట్టా బాలిరెడ్డి’కి!. ఎందుకంటే మొక్కలంటే మనుషులంత ప్రాణం పెట్టే మనిషి ఆయన. అందుకే వచ్చిందా ఆలోచన. యాదాద్రి భువనగిరి జిల్లా, రామక్రిష్టాపురంలోని ‘అమేయ కృషి వికాస కేంద్రం’లోని పంటపొలాన్నే ప్రయోగశాలగా మార్చి… మనుషులకిచ్చే హోమియో మందులనే మొక్కలకు ఇస్తూ.. రసాయనాల్లేని పంటను పండిస్తున్నాడు..

అది.. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి సమీపాన గల హైదరాబాద్‌- వరంగల్‌ జాతీయ రహదారి… దానికి దగ్గర్లో ఉంటుంది రామకృష్ణాపురం శివారులోని ‘అమేయ కృషి వికాస కేంద్రం’. అమేయ తన ముద్దుల కూతురుకు పెట్టుకున్న ఇష్టమైన పేరు. ఇంట్లోని కూతురే కాదు… పొలంలోని మొక్కలు కూడా తనకు పిల్లలతో సమానం. ఆ పచ్చటి పొలంలో చొక్కాను చెట్టుకు తగిలించి… బనియనుతో మొక్కలకు మందును పిచికారి చేస్తూ కనిపిస్తాడు ఒకాయన. మొక్కల ముఖం దిగులుగా ఉంటే స్పర్శతో ఓదారుస్తాడు. ఆకులు కళకళలాడుతుంటే… పిల్లల బుగ్గలు నిమిరినంత సంతోషపడతాడు. అతనే జిట్టా బాలిరెడ్డి.

ఆ చుట్టుపక్కల వాళ్లంతా ఆయన చేసే ప్రయోగాలను వింతగా చూస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లేమో శాస్త్రవేత్తలా గౌరవిస్తారు. పొద్దున్నే పొలం వెళ్లే బాలిరెడ్డి… మొక్కల నాడి పట్టి చూస్తాడు. కొన్ని నేలకు తల వాల్చినట్లు, మరికొన్ని నీరసంతో ఆకులు ముడుచుకుపోయినట్లు కంట పడితే చాలు.. క్యాలెండుల్లా 6, కార్బొవెజ్‌ 30, సైలిసియా 30… ఇలా ఏవో నాలుగు మందులు నీళ్లలో కలిపి పిచికారి చేస్తాడు. వైద్యుడు రోగికి మందుల చీటీలో మందులు రాసిచ్చినట్లు… ఆయనే తన మొక్కలకు తనే మందులిస్తాడు. వారం తిరిగేసరికి- రోగం నుంచి కోలుకున్న రోగిలా… నేలకు వాలిన ఆ మొక్కలు మళ్లీ ప్రాణం లేచొచ్చినట్లు… నిఠారుగా లేచి నిల్చుంటాయి. అదీ బాలిరెడ్డి చేతి మహత్యం.

ఇదొక ప్రత్యామ్నాయం..

ప్రాచీన ఆయుర్వేద శాస్త్రం… వాత, పిత్త, కఫ ఆధారంగా వైద్యాన్ని సూచిస్తుంది. హోమియోపతేమో రోగానికి మందు కాకుండా… రోగ మూలాలకు వైద్యం అందిస్తుంది. ఆధునిక వైద్యశాస్త్రమేమో వైద్య పరీక్షల అనంతరం ఔషధాలను ఇస్తుంది. మనుషులు, పశు పక్ష్యాదులతో పాటు జీవకోటిలో భాగమైన మొక్కలు, చెట్లకు కూడా చీడపీడలు సోకుతుంటాయి. వీటి నివారణకు అత్యంత హానికరమైన క్రిమిసంహారక మందులు వాడుతున్నారిప్పుడు. ఈ రసాయనాలను పీల్చుకుని ఎదిగిన పైరుతో వచ్చే దిగుబడే మనకు ఆహారం అవుతోంది. అందులోని హానికారక రసాయనాలు మనల్ని అనారోగ్యానికి గురిచేస్తున్నాయి. ఆ ప్రభావం నుంచి తప్పించుకునేందుకు పుట్టిందే ప్రకృతి సేద్యం, సేంద్రియసేద్యం.

ఈ ప్రయోగాల్లో భాగంగా మొక్కలు, పైరుకు హోమియో మందులు వాడాలన్న ఆలోచనకు వచ్చాడు బాలిరెడ్డి. తన వ్యవసాయ క్షేత్రంలోనే ఈ ప్రయోగాలన్నీ చేస్తూ వస్తున్నాడాయన. తొలుత పొలంలోని మునగ చెట్టుకు వ్యాధి సోకింది. మనుషులకు సాధారణంగా వాడే హోమియో మందునే ఆ చెట్టుకు వాడాడు. వారం తిరక్కుండానే ఫలితం కనిపించింది. ఖరీదైన రసాయన మందులతో దొరకని పరిష్కారం.. యాభై రూపాయల్లోపు హోమియో మందుతో లభించింది. తొలిసారి నమ్మకం కుదిరింది. ఆ తరువాత ప్రముఖ హోమియో వైద్యుడు డా.సురేందర్‌ రాజును సంప్రదించాడు. ఒక రైతు, ఒక వైద్యుడి మధ్య పరస్పర ఆలోచనల మార్పిడి జరిగింది. మనుషులకు, పశువులకు, పక్షులకు ఇచ్చే మందుల మాదిరిగానే మొక్కలకు మరింత మెరుగైన మందులను సూచించాడు వైద్యుడు. ఆ మందుల వల్ల ఎండిపోయిన మొక్కలు, చెట్ల శ్వాసప్రక్రియ, పత్రహరితం మెరుగుపడి మంచి ఫలితం వచ్చింది.

ఖర్చు తక్కువ…

పంటపొలంలో చేసిన ప్రయోగం వైద్యుడి ఆమోదంతో నిర్ధారణ అయ్యింది. అయితే దీనికి ఎంత శాస్త్రీయత ఉందనే విషయం తెలియాల్సి ఉంది. బాలిరెడ్డి తొలుత ఎక్కువగా చీడపీడలు ఆశించే వంకాయ, మిర్చి, కూరగాయలపై హోమియో మందులను వాడాడు. వలిగొండ మండలానికి చెందిన రైతు రవి సాగు చేసిన వంకాయ తోటకు పురుగు పట్టింది. పుచ్చులు లేని వంకాయల్ని పండించేందుకు అధిక మోతాదులో క్రిమిసంహారక మందుల్ని వాడాల్సి ఉంటుంది. దాదాపు ఎకరానికి రూ.20 వేలు ఖర్చు అవుతుంది. సేంద్రియ రైతు బాలిరెడ్డిని రవి సంప్రదించగా హోమియోపతి సలహా ఇచ్చాడు. కేవలం రూ.75 విలువైన హోమియో మందును ఎకరం వంకాయ తోటకు పిచికారి చేశాడు రవి. ఆశించిన ఫలితమే వచ్చింది.

ఖమ్మం జిల్లాకు చెందిన దిలీప్‌ అనే రైతు కూడా తనకున్న పదిహేను ఎకరాల మిర్చితోటకు సోకిన ఆకుముడత తెగులును ఇలాగే నివారించుకున్నాడు. గుంటూరు జిల్లా నర్సారావుపేటకు చెందిన కోదండ రామయ్య కూడా అల్లం, పసుపు పంటలకు సోకిన దుంపకుళ్లు తెగులు నివారణకు హోమియోనే వాడాడు. ‘‘మా తోటలో సుమారు తొంభై శాతం తెగుళ్లకు ఇవే మందుల్ని వాడుతున్నాను. ఖర్చు తక్కువ, దిగుబడి ఎక్కువ లభిస్తోంది. దాంతోపాటు సేంద్రియ ఉత్పత్తులను తింటున్నామన్న సంతృప్తి దొరుకుతోంది..’ అంటున్నాడు జిట్టా బాలిరెడ్డి. ఒకప్పుడు పల్లెను వదిలి నగరానికి వచ్చిన ఆయన మళ్లీ వెనక్కి వెళ్లాడు. కొన్నేళ్ల నుంచి ప్రకృతితో మమేకమై… కొత్త జీవితాన్ని అల్లుకున్నాడు.

ఈ అమ్మాయిని చూశారా? స్కూలు లేకపోతే ఎప్పుడూ తోటలోనే ఉంటుంది. గడగడా లెక్కలు చెప్పినట్లే మొక్కల వివరాలను కూడా చెప్పేస్తుంది. ఏ మొక్క, ఏ చెట్టు, ఏ కాయ, ఏ పైరు… అడగక్కర్లేదు. బుల్లి వ్యవసాయ శాస్త్రవేత్తలా చెప్పేస్తుంది. పాఠ్యపుస్తకాల్లోని పర్యావరణ పాఠాలను పొలంలో చదువుకుంటోంది. తండ్రి నుంచి అబ్బిన సేంద్రియ సేద్యం అడుగుజాడల్లో నడుస్తోంది అమేయ.

పూర్వం ప్రకృతిని అనుసరించి వ్యవసాయం సాగింది. ఏటికేడు ప్రకృతే భూమిని సారవంతం చేసేది. అయితే ఆధునిక వ్యవసాయ పద్ధతులు, రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వల్ల ప్రకృతితో పాటు భూసారం క్షీణించింది. ఆ నేలపై పండిన పంటలు రోగాల బారిన పడ్డాయి. అవి తిన్న మనుషులకు మరిన్ని జబ్బులు సంక్రమిస్తున్నాయి. జీవరాశి కూడా దెబ్బతిన్నది. మళ్లీ మనిషి మేల్కొనక తప్పలేదు. భవిష్యత్తు తరాల కోసం ప్రకృతి సేద్యం చేయాల్సి వస్తోంది. ప్రయోగశాలల్లో కాదు.. ముందుగా పొలాల్లో ఆ మార్పు రావాలి. ప్రాచీనకాలంలోనే వృక్ష, ఆయుర్వేద, వ్యవసాయ శాస్త్రాలు ఉన్నాయి. కొన్నేళ్ల కిందటే వృక్ష సంబంధిత జాతులకు హోమియో వాడిన దాఖలాలు ఉన్నాయి. దీనిపై మరిన్ని ప్రయోగాలు జరగాలి. శాస్త్రీయత అవసరం.

  • జిట్టా బాలిరెడ్డి, అమేయ కృషి వికాస కేంద్రం,

రామక్రిష్టాపురం, యాదాద్రి భువనగిరి జిల్లా

Source: https://www.andhrajyothy.com/telugunews/crop-farmer-agriculture-jitta-bal-reddy-202101170106573