పకడ్బందీగా జగనన్న స్వచ్ఛ సంకల్పం

  • యంత్రాల ద్వారా పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ
  • మురుగు కాల్వల శుభ్రతకు మండలానికో డ్రెయిన్‌ క్లీనింగ్‌ మిషన్‌ 
  • గ్రామానికి ఒకటి చొప్పున హైపవర్‌ టాయిలెట్‌ క్లీనర్‌ కూడా..
  • 10,731 టాయిలెట్‌ క్లీనర్లు కొనుగోలు
  • దోమల నివారణకు ఫాగింగ్‌ యంత్రాలు

  గ్రామాల్లో ప్రజలందరూ స్వచ్ఛమైన వాతావరణంలో జీవనం సాగించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు అడుగులు వేస్తోంది. పల్లెల్లో సంపూర్ణ పారిశుధ్యమే లక్ష్యంగా భారీ ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా.. గ్రామీణ ప్రాంతాలలో మురుగు కాల్వలను శుభ్రం చేయడంతో పాటు ప్రభుత్వ స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, సచివాలయాలు వంటి ప్రభుత్వ కార్యాలయాల్లోని మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు యంత్రాలను కొనుగోలు చేయనుంది. అలాగే, పల్లెల్లో రోడ్లపై మురుగునీటి ప్రవాహం ఓ పెద్ద సమస్య. సైడ్‌ కాల్వలు శుభ్రం చేసేందుకు చాలాచోట్ల కూలీలు ముందుకు రాకపోవడం.. ఒకవేళ వచ్చినా కూలీ రేటు ఎక్కువగా డిమాండ్‌ చేస్తుండడంతో ఈ పని గ్రామ పంచాయతీలకు పెనుభారంగా మారింది. దీంతో ఈ సమస్యకు కూడా రాష్ట్ర ప్రభుత్వం శాశ్వతంగా చెక్‌ పెట్టనుంది.

  ప్రతి మండలంలోని మురుగు కాల్వల్లో పూడిక తీయడంతో పాటు కాల్వల పక్క పెద్దస్థాయిలో పెరిగే పిచ్చి మొక్కలను తొలగించడానికి డివిజన్‌కు ఒకటి చొప్పున బాబ్‌కాట్‌ మిషన్లను గ్రామాలకు అందుబాటులో ఉంచనుంది. దీనికి తోడు.. గ్రామాల్లో సాధారణ మురుగు తొలగించడానికి మండలానికి ఒకటి చొప్పున మెకనైజ్డ్‌ డ్రెయిన్‌ క్లీనింగ్‌ మిషన్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రాక్టరు నడపడం వచ్చినవారు ఈ మిషన్‌ ద్వారా రోజుకు 6–8 కి.మీ. పొడవున మురుగు కాల్వలను శుభ్రంచేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వీటిద్వారా మండల పరిధిలోని ప్రతి గ్రామంలో ఏడాదికి కనీసం రెండు మూడు సార్లు మురుగుకాల్వలన్నింటినీ శుభ్రం చేయించనున్నారు. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 660 మిషన్లను గ్రామీణ ప్రాంతాలలో అందుబాటులో ఉంచనుంది. 

  ప్రతీ పంచాయతీకి టాయిలెట్‌ క్లీనర్‌
  గ్రామంలో ఉండే కమ్యూనిటీ టాయిలెట్లతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ సచివాలయం సహా ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో మరుగుదొడ్లను కూడా ప్రతిరోజూ శుభ్రం చేసేందుకు ప్రతి గ్రామ పంచాయితీకి ఒక హైపవర్‌ టాయిలెట్‌ క్లీనర్‌ మిషన్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు అందజేయనుంది. బ్యాటరీ ద్వారా పనిచేసే ఈ మిషన్‌ను సాధారణ నైపుణ్యం ఉండే ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 13,371 గ్రామ పంచాయితీలకుగాను ప్రస్తుతం 2,640 చోట్ల ఈ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన పంచాయితీల్లోనూ వీటిని ఏర్పాటుచేయనున్నారు. ఇందుకోసం పంచాయతీరాజ్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లు ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తున్నాయి.

  ఫాగింగ్‌ మిషన్లతో దోమల నివారణ
  ఇక గ్రామాల్లో దోమల నివారణ కోసం ప్రతి గ్రామ పంచాయతీకి ఒకటి చొప్పున ఫాగింగ్‌ మెషీన్లను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రస్తుతం 2,743 గ్రామాల్లో ఇప్పటికే ఇవి అందుబాటులో ఉండగా, మిగిలిన 10,628 గ్రామాలకు ఒక్కొక్కటి చొప్పున కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/jagananna-swachh-sankalpam-across-andhra-pradesh-1374410