పనికి రాని వ్యర్థాల నుంచి సంపద సృష్టి

  • తూకి వాకంలోని డ్రై వేస్ట్‌ ప్లాంట్‌ వ్యూ
  • వ్యర్థాల నుంచి సంపద సృష్టి.. కిలో చెత్త నుంచి రూ.2 ఆదాయం 
  • నెలకు రూ.30లక్షలు.. ఏడాదికి రూ.3.6కోట్లు  
  • రూ.8 కోట్ల వ్యయంతో డ్రైవేస్ట్‌ ప్లాంట్‌ నిర్వహణ 

చెత్తే కదా అని నిర్లక్ష్యం చేయలేదు.. ఆ చెత్త నుంచే ఆదాయం గడించడంపై దృష్టిసారించారు. రోజూ వెలువడే వ్యర్థాల ద్వారా సంపద సృష్టిస్తున్నారు. కిలో పొడి చెత్త రూ.2 చొప్పున విక్రయిస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు. చిత్తూరు జిల్లా తిరుపతి మునిసిపల్‌ కార్పొరేషన్‌ గత ఏడాది డిసెంబర్‌ నుంచి డ్రై వేస్ట్‌ ప్లాంట్‌ను తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చింది. దశాబ్దాల నుంచి గత యంత్రాంగం చెత్తను నిర్లక్ష్యం చేసింది. తాజా నిర్ణయంతో పొడిచెత్త బంగారంలా అమ్ముడుపోతోంది. 

చెత్తనిర్వహణలో అగ్రస్థానం 
కేంద్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు స్వచ్ఛమైన జీవనాన్ని కల్పించేందుకు 2016లో స్వచ్ఛభారత్‌ మిషన్‌ను ప్రారంభించింది. 2017 నుంచి నగరాల మధ్య స్వచ్ఛపోటీలను నిర్వహిస్తూ వివిధ అంశాల్లో జాతీయ, రాష్ట్రస్థాయి ర్యాంకులు ప్రకటిస్తూ ప్రోత్సాహకం అందిస్తోంది. స్వచ్ఛతలో టాప్‌–3లో మెరవగా  చెత్తనిర్వహణలో తిరుపతి జాతీయ స్థాయిలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గడిచిన మూడేళ్లుగా సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌లో తిరుపతి తన పరపతిని కొనసాగిస్తూ అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఇక్కడి అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు, పటిష్టమైన నిర్వహణ వ్యవస్థలతో తిరుపతికి జాతీయ స్థాయిలో కీర్తికిరీటాన్ని తెచ్చిపెట్టాయి. 

దశాబ్దాలుగా నిర్లక్ష్యం 
తిరుపతి మున్సిపాలిటీ 1886లో ఏర్పాటైంది. 2007లో మున్సిపల్‌ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్‌ అయ్యింది. పురపాలక సంఘంగా ఏర్పాటై 136 ఏళ్లు పూర్తిచేసుకుంది. గడిచిన దశాబ్దాల నుంచి తిరుపతిలో ఉత్పత్తి అయ్యే చెత్తను పూడ్చిపెట్టడం, కాల్చడం, ఆపై రామాపురం డంపింగ్‌ యార్డుకు తరలించారు. గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నిబంధనల మేరకు స్వచ్ఛభారత్‌ మిషన్‌ చెత్తను పూడ్చిపెట్టడం, తగలపెట్టడాన్ని నిషేధించింది.ఈ క్రమంలో చెత్త నిర్వహణపై అడుగులు పడ్డాయి. తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ సరికొత్తగా ఆలోచించి చెత్త నుంచి సంపదను సృష్టించడంపై దృష్టిసారించింది. 

కిలో 2 రూపాయలు 
తిరుపతి నగరంలో ఉత్పత్తి అయిన చెత్త బంగారంలా అమ్ముడుపోతోంది. ప్రతిరోజూ ఉత్పత్తి అయ్యే చెత్త నుంచి  50 టన్నుల మేర పొడి చెత్త వేరుచేస్తున్నారు. ఈ చెత్తను డ్రైవేస్ట్‌ ప్లాంట్‌కు తరలించి సెగ్రిగేషన్‌ చేస్తున్నారు. ఈచెత్తను కొనుగోలు చేసేందుకు వివిధ సంస్థలు ముందుకు రాగా  బెంగళూరుకు చెందిన ఎంఎం ట్రేడర్స్‌ కిలో చెత్తను రూ.2కు కొనేందుకు ముందుకొచ్చింది. రోజూ 50 టన్నుల చెత్తను మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆ సంస్థకు విక్రయించి తద్వారా రోజుకు లక్ష రూపాయలు, నెలకు రూ.30 లక్షల ఆదాయాన్ని గడిస్తోంది. ఏడాదికి రూ.3.6 కోట్ల ఆదాయాన్ని పొందనుంది. ప్లాంట్‌ నిర్వహణకు ఖర్చుచేసిన రూ. 8 కోట్లను కేవలం రెండు సంవత్సరాల, రెండు నెలల్లోనే ఆర్జించనుంది. ఆపై పూర్తిగా ఆదాయం తెచ్చిపెట్టనుంది.

తొలిసారిగా ఆదాయం  
గడిచిన మూడు నెలలుగా పొడి చెత్త నుంచి రోజూ లక్ష ఆదాయం అందుతోంది. చెత్తను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేస్తున్నాం. దేశంలో ఎక్కడాలేని చెత్తనిర్వహణ ఒక్క తిరుపతిలోనే పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశాం. చెత్తను అనేక రకాలుగా రెడ్యూజ్, రీ యూజ్, రీసైకిల్‌ చేస్తూ తద్వారా రోజూ లక్షల్లో ఆదాయం సమకూరుస్తున్నాం.  
– పీఎస్‌ గిరీష, కమిషనర్, తిరుపతి మునిసిపల్‌ కార్పొరేషన్‌ 

 వందశాతం నిర్వహణ 
టిప్పర్ల ద్వారా తరలించే ఈ చెత్తను కాటా వేసి విక్రయిస్తాం. కొనుగోలు చేసిన ట్రేడర్స్‌ అందులో నుంచి ప్లాస్టిక్, ఐరన్, గాజు,వుడ్,టైర్, స్టోన్‌ వంటి వాటిని వేరుచేసి బయట ప్రాంతాల్లో విక్రయిస్తోంది. కార్పొరేషన్‌కు ప్రతి కిలో చెత్తకు 2రూపాయలు జమ చేస్తోంది. ప్లాంట్‌ నిర్వహణలో 100 మందికి ఉపాధి దొరికింది.  
– ఎ.విజయ్‌కుమార్‌రెడ్డి, ఎన్విరాన్‌మెంట్‌ ఇంజినీర్‌  

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/wealth-creation-wastage-1440506