పల్లెపల్లెన 540 సేవలు

  • విజయనగరం జిల్లాలో గ్రామ స్వరాజ్యం 
  • గ్రామానికో సచివాలయం, రైతుభరోసా కేంద్రం 
  • అందుబాటులో ఆరోగ్య కేంద్రాలు 
  • రూ. 465.14 కోట్లతో భవన నిర్మాణాలు 

‘అభివృద్ధే అజెండా.. సంక్షేమమే లక్ష్యం’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ విజయనగరం జిల్లాలో పల్లెల రూపురేఖలు మారుస్తోంది. గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వ సేవలు పొందడానికి మండల, జిల్లా కేంద్రాలకు వెళ్లి సమయంతో పాటు ఆర్థికంగా నష్టపోతున్న విషయాన్ని ప్రజా సంకల్పయాత్రలో గుర్తించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన ఏడాదిన్నరలోనే వారి కష్టాలకు అడ్డుకట్ట వేశారు. అన్ని సేవలను వారి ముంగిటకే తీసుకొచ్చారు.

గాందీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు అంకురార్పణ చేశారు. ఉన్న ఊళ్లోనే ప్రజలకు 540కి పైగా సేవలు అందించేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ‘రైతే రాజు’గా భావిస్తూ సాగుకు సంబంధించి సలహాలు, సేవలు అందించేందుకు, అవసరాలు తీర్చేందుకు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా శాశ్వత భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. అలాగే పల్లె ప్రజలకు వారి గ్రామాల్లోనే 24 గంటలు ప్రాథమిక వైద్యసేవలు అందించేందుకు వైఎస్సార్‌ వెల్‌నెస్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా వాటికి భవనాలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేశారు. వీటన్నింటికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా రూ.465.14 కోట్ల అంచనాతో 1,767 భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీటితో పాటు విద్యకు ప్రాధాన్యతనిస్తూ ‘మనబడి నాడు–నేడు’ పథకంతో పాఠశాలల సుందరీకరణ, మౌలిక సదుపాయాల కల్పన చేపట్టింది.