పల్లెల్లో ‘104’ పరుగులు

  • ఏడు నెలల్లో 24.83 లక్షల మందికి వైద్య సేవలు
  • 656 వాహనాల్లో 74 రకాల మందులు అందుబాటులో
  • 104 వాహనాలతో ప్రభుత్వాసుపత్రులకు అనుసంధానం

  ఇవి క్రమం తప్పకుండా పల్లెలన్నిటినీ చుట్టి వస్తున్నాయి. చిన్నచిన్న వ్యాధులు మొదలుకుని దీర్ఘకాలిక జబ్బులతో కలిపి మొత్తం 20 రకాల సేవలను గడిచిన ఏడు నెలల్లో 24,83,817 మందికి అందించాయి. మందుల సంఖ్యను కూడా భారీగా పెంచారు. గతంలో పేరుకు 52 రకాల మందులు ఉన్నాయని చెప్పుకున్నా 30 రకాలు కూడా సరిగ్గా అందేవి కావు. కానీ, ఇప్పుడు నాణ్యమైన 74 రకాల మందులను రోగులకు వారివారి ఇంటి వద్దే ఇస్తుండడంతో బాధితులకు 104 సేవలపై మరింత నమ్మకం ఏర్పడింది. ఈ వాహనాలు రోగులకు సేవలందించడమే కాక వారి వివరాలను టెలీమెడిసిన్, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు అనుసంధానంచేసి వారికి భవిష్యత్‌లో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీలకు లింకేజీ చేసి రెఫరల్‌ సిస్టంను మెరుగుపరిచారు. ప్రతి ఒక్కరి వివరాలను ఎలక్ట్రానిక్‌ మెడికల్‌ రికార్డులో పొందుపరుస్తున్నారు. 

  రాష్ట్రంలో ‘104’ సంచార వైద్యశాలలకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక మండలానికొక వాహనాన్ని ఏర్పాటుచేయడంతో వీటిని ఆశ్రయిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మారుమూల, అత్యంత మారుమూల ప్రాంతాల్లో రోజుకు సగటున 11,800 మందికి ఈ ‘104’లు ఔట్‌ పేషెంటు సేవలందిస్తున్నాయి. గతంలో ఈ వాహనాలు 292 మాత్రమే ఉండేవి. అవి కూడా శిథిలావస్థకు చేరినవే. కానీ, రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక మండలానికొకటి చొప్పున 656 వాహనాలు కొత్తగా వచ్చాయి.

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/popularity-104-mobile-clinics-ap-increasing-day-day-1347935