పల్లెల అభివృధ్ధే లక్ష్యంగా పలు కార్యాలయాల నిర్మాణాలు

  • తూర్పు గోదావరి జిల్లా నరేంద్రపురంలో విలేజ్‌ క్లినిక్‌
  • శాశ్వత భవనాల నిర్మాణంతో పెద్ద ఎత్తున సమకూరిన ఆస్తులు
  • పెద్ద ఊళ్లలో రూ. 2.50 కోట్లతో, చిన్న ఊళ్లలో కోటిన్నరకు పైగా వ్యయంతో అభివృద్ధి పనులు
  • ఇప్పటికే రూ.12,510 కోట్లతో గ్రామాలకు సామాజిక ఆస్తుల కల్పన
  • ఇంతటి అభివృద్ధి ఇదే ప్రథమం అంటున్న గ్రామీణ ప్రజలు  
  • గతంలో ఎమ్మెల్యేల వెంటపడినా మంజూరు కాని పనులు.. ఇప్పుడు ఎవరూ అడగకుండానే చకచకా పూర్తి
  • సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్‌ క్లినిక్‌లు, డిజిటల్‌ లైబ్రరీలు
  • రెండున్నరేళ్లలో గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌కు కొత్త శోభ    

కళ్లెదుటే గ్రామ సచివాలయం.. కళకళలాడుతున్న స్కూలు భవనాలు ఓ వైపు.. రైతుల సేవకు వెలసిన రైతు భరోసా కేంద్రం మరో వైపు.. ఆపద వేళ ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్న హెల్త్‌ క్లినిక్‌ ఇంకో వైపు.. అక్కడి నుంచి నాలుగడుగులు ముందుకేస్తే డిజిటల్‌ లైబ్రరీ భవనం.. ఇంకో నాలుగడుగులు వేస్తే పాల సేకరణ కేంద్రం.. సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం ఇదీ సీఎం వైఎస్‌ జగన్‌ కల. ఈ కలను సాకారం చేసేందుకు ఆయన వేసిన విత్తు మొక్కగా మొలిచి.. వృక్షంగా ఎదుగుతోంది. కళ్లెదుటే ఫలాలూ కనిపిస్తున్నాయి. భవిష్యత్‌లో ఈ ఫలాల విలువ లక్షల కోట్లలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు.

గ్రామాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకున్నన్ని చర్యలు ఇదివరకెన్నడూ ఏ ప్రభుత్వం తీసుకోలేదని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామానికి చెందిన రైతు ప్రగడ రాంబాబు చెబుతున్నారు. 5400 మంది జనాభా గల తమ ఊళ్లో రెండు చొప్పున గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణాలు పూర్తి అయ్యాయని చెప్పారు. గతంలో ఏమ్మెల్యేను అడిగినా, ఏ భవనం మంజూరు చేసే వారు కాదని.. ఇప్పుడు అడగకుండానే రూ.2 కోట్లకు పైగా వ్యయంతో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించారని చెప్పారు. పురుగు మందులు, ఎరువులు అన్నీ ఉన్న ఊళ్లోనే ఇస్తున్నారని.. ఏ సర్టిఫికెట్‌ కావాలన్నా, ఏ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నా సచివాలయానికి వెళితే చాలని చెబుతున్నారు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు ఇంకా చాలానే ఉన్నాయన్నారు. ఈ ప్రభుత్వం పుణ్యమా అని తమ గ్రామం కొత్త శోభను సంతరించుకుందని, గ్రామాలకు పెద్ద ఎత్తున ఆస్తులు సమకూరాయని తెలిపారు. తనకు ఊహ తెలిశాక ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరగడం ఇదే ప్రథమం అని సంతోషం వ్యక్తం చేశారు. ఇలా రాష్ట్రంలో ఏ పల్లెకు వెళ్లి ఎవరిని కదిపినా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో అభివృద్ధి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

కొన్ని ఊళ్లలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణాలు పూర్తి కావడంతో గ్రామాలు కొత్త శోభను సంతరించుకోగా, మరి కొన్ని ఊళ్లలో ఈ భవనాల నిర్మాణాలతో సందడి నెలకొంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాకే తొలి సారిగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయని, జరుగుతున్నాయని జనం చెబుతున్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా గ్రామాల్లో మౌలిక వసతుల కోసం ఇంత పెద్దఎత్తున నిధులు వెచ్చించలేదని ప్రజలు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రభుత్వం తక్కువలో తక్కువ ఒక్కో ఊరికి రూ.కోటికి పైగా వ్యయం చేస్తోందని చెబుతున్నారు. పెద్ద పెద్ద ఊళ్లలో రూ.రెండు కోట్ల నుంచి రెండున్నర కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 

తూర్పు గోదావరి జిల్లా నరేంద్రపురంలో గ్రామ సచివాలయం, ఆర్బీకే

రూ.12,510 కోట్లతో మౌలిక వసతుల కల్పన
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామాల్లోని ప్రజలకు సంక్షేమంతో పాటు అవసరమైన మౌలిక వసతులను ఆయా గ్రామాల్లోనే కల్పించేందుకు పెద్ద పీట వేశారు. గత 29 నెలల పాలనలోనే గ్రామాల్లో స్పష్టమైన అభివృద్ధి కన్పించేలా పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. సింహ భాగం పనులు పూర్తి అయ్యాయి. మిగతా పనులు కొనసాగుతున్నాయి. ఆయా గ్రామ ప్రజల అవసరాలను తీర్చే గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్, బల్క్‌మిల్క్‌ యూనిట్లు, వైఎస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణాలతో పాటు నాడు–నేడు కింద పాఠశాలలను బాగు చేయడం తదితర పనులు చేపట్టారు. రూ.12,510 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టారు. ఇందులో ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో రూ.3,400 కోట్ల వ్యయంతో 15,000 స్కూల్స్‌ రూపు రేఖలు మార్చారు. దీంతో పాటు గ్రామాల్లో అంతర్గత రహదారులు, డ్రైనేజీ నిర్మాణ పనులు, మంచి నీటి వసతి పనులు కొనసాగుతున్నాయి. మండల, జిల్లా, నియోజకవర్గ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల స్థాయిలో జరిగే అభివృద్ధి పనులు వీటికి అదనం. 

గ్రామాల్లో మౌలిక సదుపాయాల పనులు ఇలా..
► రూ.4,199.70 కోట్లతో 10,929 గ్రామ సచివాలయాల నిర్మాణం. ఇందులో ఇప్పటికే 3,273 పూర్తి. మరో 2,683 పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఇంకా 1,840 సచివాలయాలు రెండవ అంతస్తు దశలో ఉన్నాయి.
► రూ.2,303.47 కోట్లతో 10,408 వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) ఏర్పాటు. ఇందులో ఇప్పటికే 1,746 పూర్తి. మరో 2,860 గ్రౌండ్‌ ఫ్లోర్‌ స్లాబుతో పాటు పూర్తి అయ్యే దశలో ఉన్నాయి. ఇంకా 5,803 బేస్‌మెంట్‌ స్థాయి నుంచి గ్రౌండ్‌ ఫ్లోర్‌ దశలో ఉన్నాయి.
► రూ.1,475.50 కోట్లతో 8,585 వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌ ఏర్పాటు. ఇందులో 702 క్లినిక్స్‌ నిర్మాణం పూర్తి. మరో 2,008 గ్రౌండ్‌ ఫ్లోర్‌ ఫినిషింగ్‌ స్థాయిలో ఉన్నాయి. ఇంకా 5,875 బేస్‌మెంట్‌ స్థాయి దాటి గ్రౌండ్‌ ఫ్లోర్‌ దశలో ఉన్నాయి.
► పాడి రైతుల కోసం తొలి దశలో రూ.416.23 కోట్ల వ్యయంతో 2,541 బల్క్‌ మిల్స్‌ యూనిట్ల నిర్మాణం మొదలైంది. వివిధ దశల్లో ఉన్నాయి.
► రూ.724.80 కోట్లతో 4,530 వైఎస్సార్‌ విలేజ్‌ డిజిటల్‌ ల్రైబరీల పనులు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి. 
► నాడు–నాడు తొలి దశలో గ్రామీణ ప్రాంతాల్లోని రూ.3,400 కోట్లతో 15,000 స్కూల్స్‌లో మరమ్మత్తులు, మౌలిక సదుపాయాల కల్పన పూర్తయింది. 

అభివృద్ధి కళ్లెదుటే కనిపిస్తోంది
మా ఊళ్లో రూ.40 లక్షలతో గ్రామ సచివాలయ భవనం నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది. రూ.25 లక్షలతో  రైతు భరోసా కేంద్రం నిర్మిస్తున్నారు. రూ.14.95 లక్షలతో విలేజ్‌ క్లినిక్‌ భవనం నిర్మాణంలో ఉంది. విద్యార్థుల కోసం రూ.15 లక్షలతో డిజిటల్‌ లైబ్రరీ నిర్మాణం పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. బల్క్‌ మిల్క్‌ సెంటర్‌ కోసం రూ.17.67 లక్షలు మంజూరు చేసింది. నాడు–నేడు పథకం ద్వారా స్కూల్లో రూ.18 లక్షలతో పనులు చేపట్టారు. పెయింటింగ్, ప్రహరీ గోడ నిర్మాణం, టైల్స్, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, విద్యార్థులు కూర్చునేందుకు బెంచీలు, క్లాసు రూములో లైటింగ్, ఫ్యాన్లు ఏర్పాటు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
సచివాలయం వల్ల మండల కేంద్రానికి వెళ్లే బాధ తప్పింది. గ్రామ స్థాయిలోనే అన్ని రకాల సేవలు అందించేందుకు కోట్ల రూపాయలు వెచ్చించి అవసరమైన భవనాలు నిర్మించడం సంతోషంగా ఉంది.  సంక్షేమంతో పాటు ప్రభుత్వం అభివృద్ధికి బాటలు వేస్తుంది.
– చిటికెల జగదీష్, భీమ బోయిన పాలెం, మాకవరపాలెం మండలం, విశాఖ జిల్లా  

ఊహించలేదు.. కలలా ఉంది
నల్లమల అడవికి సమీపంలోని మా ఊరు మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. 800 జనాభా. పక్కనే ఉన్న కొత్తూరును కలుపుకుని సచివాలయం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అధికారులు మా ఊళ్లోనే మాకు అందుబాటులో ఉంటున్నారు. పనుల కోసం మేము ఏ ఊరికీ పోనవసరం లేదు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ పథకం కావాలన్నా అర్హత ఉంటే చాలు వెంటనే అందిస్తున్నారు. వలంటీర్ల తోడుతో చదువురాని వారు సైతం పథకాలను అందిపుచ్చుకొని అభివృద్ధి చెందుతున్నారు. రూ.40 లక్షలతో సచివాలయం, రూ.21.80 లక్షలతో ఆర్బీకే, 17.50 లక్షలతో హెల్త్‌ క్లినిక్‌ భవనం, రూ.36 లక్షలతో సిమెంట్‌ రోడ్లు, స్కూల్లో అదనపు గదుల కోసం రూ.11 లక్షలు, ఇళ్లకు కుళాయిల కోసం రూ.15 లక్షలు ఖర్చు చేశారు. ఇలా చకచకా అన్నీ కళ్లెదుటే ఏర్పాటై పోతున్నాయి. అంతా కలగా ఉంది. ఇంత త్వరగా ఇంత అభివృద్ధి జరుగుతుందని మేమెవ్వరమూ ఊహించలేదు. 
– షేక్‌ పెద్ద దాదావలి, ఆరవీటికోట, రాచర్ల మండలం, ప్రకాశం జిల్లా

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/cm-ys-jagan-government-taken-steps-development-andhra-pradesh-villages