పశువుల పేడను ఎరువుగా మార్చడం రైతులకు ఎప్పుడూ ఒక సమస్యగానే ఉంటోంది. నిజానికి పేడ మంచి సేంద్రియ ఎరువు అయినప్పటికీ, దానిని నిల్వచేయడం, ఎరువుగా మార్చడం కష్టం. ” ఈ కారణంగానే చాలా మంది రైతులు పశువుల పెంపకం కూడా మానేశారు” అని ఫార్మ్స్ డెయిరీ (Farms Dairy) మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ సుభాష్ చెబుతారు. కేరళలోని కొచ్చికి చెందిన ప్రదీప్ డెయిరీలో చాలా పశువులు ఉన్నాయి. కనుక తనకు రైతులు ఎదుర్కొనే సమస్యల గురించి బాగా తెలుసు. ఈ దృష్ట్యా ఆవు పేడను ఎరువుగా ఉపయోగించుకోవడానికి ప్రదీప్ ‘చనకా వండి’ (Chanaka Vandi) అనే ఒక మొబైల్ యూనిట్‌ను ప్రారంభించారు. ఇది తడి పేడను వెంటనే ఎండించి, పొడి ఎరువుగా మార్చి ఇస్తుంది.
కాల్ చేస్తే ఈ మొబైల్ యూనిట్ రైతుల వద్దకే వస్తుంది. పేడను సేకరిస్తుంది. “గొయ్యి నుండి పంపింగ్ ప్రారంభమైనప్పుడు, యంత్రం పేడను నిర్జలీకరణం చేస్తుంది. అంటే అందులోని తడిని పూర్తిగా తొలగిస్తుందన్నమాట. దీని కోసం, మేము గంటకు ఒక టన్ను పేడను ప్రాసెస్ చేయగల ఇటాలియన్ యంత్రాన్ని ఉపయోగిస్తున్నాము. ‘చనకా వండి’ కోసం మేము రూ. 20 లక్షలు పెట్టుబడిగా పెట్టాము” అని ప్రదీప్ చెప్పారు. పాడి, వ్యవసాయ రంగాలకు వారధిగా ఉండేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. కేరళలో ప్రభుత్వం వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నందు వల్ల ఈ వ్యాపారం లాభసాటిగానే ఉంటుంది. కనుక రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సహాయం చేయడానికి తాము ఫ్రాంచైజీని ప్రారంభించేందుకు యోచిస్తున్నామని ఆయన చెప్పారు. ఇలా తడిపేడను పొడి ఎరువుగా మార్చే మొబైల్ యూనిట్లు మన దేశంలో రెండు మాత్రమే ఉన్నాయని ఆయన వివరించారు.
పేడను నిల్వ చేసే చోటికి వెళ్లే ‘చనకా వండి’ మొబైల్ యూనిట్ రైతుకు కావలసినట్లుగా పేడను పొడిగా మార్చి పౌడర్ లాగా చేసి ఇస్తాయి. రైతు కనుక అమ్మదలిస్తే ఆ పొడి పేడను తిరిగి వారే కొనుగోలు చేస్తారు. పేడను ఆరబెట్టి పొడి చేసేందుకు కిలోకు రూ. 1 చొప్పున వారు రైతుల నుండి వసూలు చేస్తారు. రైతులు ఆ పొడి ఎరువును అమ్మాలనుకుంటే వారికి కిలోకు 2 రూపాయల చొప్పున చెల్లించి కొంటారు. కాగా, నాలుగు టన్నుల ఎరువు ద్వారా తమకు సుమారు 10,000 రూపాయల దాకా ఆదాయం ఉంటుందని ప్రదీప్ సుభాష్ చెబుతున్నారు.
ఆసక్తిగలవారు మరిన్ని వివరాల కోసం ఈ క్రింది చిరునామాను సంప్రదించవచ్చు.
Farms Dairy
Marottichodu, Edapally Toll,
Cochin – 682024
PHONE: 858 90 04472
EMAIL: farmsdairy@gmail.com
info@farmsdairy.com, pradeep@farmsdairy.com
www.farmsdairy.com
Source: https://www.newindianexpress.com/good-news/2021/apr/22/a-fertile-dung-disposal-solution-for-keralas-farmers-2292981.html
(Image courtesy: Express News Service)