అమూల్ తో ప్రభుత్వ ఒప్పందం

పాదయాత్రలో చూడని కష్టం లేదు.. తుడవని కన్నీరు లేదు ! ముఖ్యంగా మహిళలు పడుతున్న కష్టాలు జగన్‌ను ఎంతో కదిలించాయి. అందుకే అధికారంలోకి వచ్చిన ప్రతి క్షణం ఆలోచిస్తూ మహిళల కోసం ఎన్నో  పథకాలను తీసుకొస్తున్నారు. ఆర్థికంగా అండగా నిలిచేందుకు.. సాధికారత దిశగా  అడుగులు వేస్తున్నారు. ఒకటా రెండా.. ఇలా ఎన్నో ప్రయత్నాలతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో కీలక మార్పులు జరుగుతున్నాయి. పాడి పరిశ్రమ అభివృద్దికి సంబంధించి అమూల్‌తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మహిళల జీవితాలను మార్చే క్రమంలో ఇదో గొప్ప ముందడుగు అని సీఎం అంటున్నారు. అమూల్‌తో కుదుర్చుకున్న ఒప్పందం రాష్ట్రంలో మహిళా పాడి రైతులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందని.. అలాగే సాధికారతకూ తోడ్పాటునందిస్తుందన్నది సీఎం జగన్ అభిప్రాయం. ఈ ఒప్పందం వల్ల పాడి రైతులకు మంచి ధర దక్కడమే కాకుండా వినియోగదారులకు కూడా సరసమైన ధరలకి, నాణ్యమైన పాల ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి.

రాష్ట్రంలో 10వేల 641 రైతు భరోసా కేంద్రాలు ఉండగా అందులో ఆర్‌బీకేలు ఉన్న ప్రాంతాల్లో 9వేల 899 పాలు ఉత్పత్తి గ్రామాలున్నాయి. వీటితో పాటు 9వేల 899 గ్రామాల్లో ప్రభుత్వం మహిళా కోఆపరేటివ్‌ డెయిరీ సొసైటీలను ఏర్పాటు చేస్తుంది. ఈ కోఆపరేటివ్‌ సొసైటీలను బలోపేతం చేయడానికి, మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం 3వేల కోట్లు ఖర్చు చేస్తుంది. ఆసరా ద్వారా మహిళలకు పశువుల పంపిణీ డ్వాక్రా రుణాలు చెల్లించడమే కాదు… సున్నా వడ్డీకి అప్పులు.. ఇలా రాష్ట్రంలోని ప్రతీ అక్కాచెల్లె తన కాళ్ల మీద తాను నిలబడాలన్న లక్ష్యంతో.. సీఎం జగన్ ఎన్నో పథకాలు తీసుకొస్తున్నారు. ఐనా ప్రతీ మహిళను తన ఇంటి  ఆడపడుచుగా భావించి.. ఇంకేదో సాయం చేయాలన్న తపన మరిన్ని పధకాలను ప్రవేశపెట్టేందుకు వీలు కల్పిస్తోంది. వైయస్ఆర్ చేయూత, ఆసరా మహిళలకు పశువుల యూనిట్ల పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పశువుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అమూల్‌ సంస్థతో ఒప్పందం ద్వారా పాడిరైతులకు మేలు జరుగుతుందని సీఎం జగన్ అభిప్రాయం. పాదయాత్రలో ఎందరో రైతుల కష్టాలను చూశానన్న జగన్.. అధికారంలోకి వచ్చాక సహకార సొసైటీలను బలోపేతం చేస్తామన్న హామీని నెరవేర్చారు. మార్కెట్‌లో పోటీతత్వం వస్తేనే రైతులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.