నవంబరు 7 నుంచి పాపికొండల టూర్‌ ప్రారంభం

  • భద్రత ఏర్పాట్ల మధ్య కదలనున్న బోట్లు 

పాపికొండలు అందాలు చూసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రెండేళ్ల విరామం తరువాత నవంబరు 7 నుంచి పర్యాటక బోటులు పాపికొండల విహారానికి బయలుదేరానున్నాయి. దీంతో పర్యాటకుల్లో ఆసక్తి.. ఆనందం నెలకొన్నాయి. శీతాకాలం గోదావరిపై మంచు తెమ్మరల మధ్య పాపికొండల పర్యటన మధురానుభూతినిస్తుందనడంలో సందేహం లేదు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు మధ్య సుమారు 40 కిలో మీటర్ల పొడవుల గోదావరికి ఇరువైపులా పాపికొండలు విస్తరించి ఉన్నాయి.

టూరిజమ్‌ బోట్లపై ప్రయాణించే పర్యాటకులు పాపికొండలు, గోవావరి వెంబడి ఎత్తున కొండలు, పచ్చని వృక్షాలు  ప్రాంతాన్ని  వీక్షించేందుకు ఏటా వేల సంఖ్యలో పర్యాటకులు ఈ ప్రాంతానికి సందర్శిస్తున్నారు. వీఆర్‌పురం మండలం పోచవరం బోట్‌ పాయింట్‌ నుంచి రోజు సుమారు 300 మంది ,సెలవు రోజుల్లో వెయ్యి మందికి పైగా  పర్యాటకులు పాపికొండల సందర్శనకు వచ్చేవారు. 


ఎలా వెళ్తారంటే.. 

► భద్రాచలం రామాలయాన్ని దర్శించుకున్నాక 75 కిలో మీటర్ల దూరంలోని పోచవరం బోట్‌ పాయింట్‌కు రోడ్డు మార్గం గుండా చేరుకుంటారు.  అక్కడి నుంచి గోదావరి నదిలో బోట్‌లో ప్రయాణిస్తారు. 

► తూర్పుగోదావరి జిల్లాలో దేవీపట్నం మండలం పోశమ్మ గండి ఆలయం వద్ద బోట్‌ పాయింట్‌ నుంచి పర్యాటకులు పాపికొండల విహార యాత్రకు బయలుదేరతారు. 

► రాజమమహేంద్రవరం నుంచి కూడా వాహనంలో పురుషోత్తపట్నం మీదుగా పోశమ్మగండికి చేరుకుంటారు. 

భద్రతకు పెద్దపీట 
2019లో జరిగిన కచ్చులూరు సంఘటన నేపథ్యంలో ప్రభుత్వం పటిష్టమైన భద్రత చర్యలు తీసుకుంది.. గోదావరి నీటి మట్టం ఆధారంగా బోటులు గోదావరిపై నడిపేందుకు అనుమతి ఇస్తోందిరు. పోలవరం ప్రాజెక్టు ఎర్త్‌డ్యామ్‌ వద్ద నీటి మట్టం 27 మీటర్లు ఉంటే బోట్లు తిరిగేందుకు అనుమతి లభిస్తుంది. అంతకు మించి నీటి మట్టం పెరిగే బోటులను నిలిపివేస్తారు.  


23 పర్యాటక బోట్లుకు అనుమతి

పాపికొండలు అందాలను చూపించేందుకు ప్రైవేట్‌ బోట్లుతో పాటు, ఏపీ టూరిజం బోట్లు కూడా నడుస్తాయి. కొద్ది రోజులు పాపికొండలు పర్యాటకం నిలిచిపోయిన తరువాత టూరిజం బోట్లు నడిపేందుకు అనుమతి ఇచ్చారు. తాజా నిర్ణయంతో బోట్ల ఫిట్‌నేస్‌ పరిశీలించి టెక్నికల్‌ అధికారులు తొలివిడతగా నిబంధనలకు అనుగుణంగా సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఇలా ఇప్పటికే 23 బోట్లకు అనుమతి లభించింది. పోచమ్మగండి బోట్‌పాయింట్‌ నుంచి 11 బోట్లకు, పోచవరం బోట్‌ పాయింట్‌ నుంచి 12 బోట్లకు అనుమతులు లభించించాయి.

అనేక మందికి ఉపాధి
► పాపికొండల పర్యాటకంతో అనేక మంది ఉపాధి లభిస్తుంది. టికెట్‌ కౌంటర్లలో పనిచేసే వర్కర్లు,లాడ్జీల నిర్వహకులు,మార్గం మధ్యలోని కూనవరం ,వీఆర్‌పురం మండలాల్లోని హోటళ్లు, ఇతర వ్యాపారాలతో ఎక్కువమంది ఉపాధి పొందుతున్నారు.  

► పోచవరం బోట్‌ పాయింట్‌ వద్ద వ్యాపారస్తులతో పాటు బోట్ల యజమానులు, గుమస్తాలు, బోట్ల వర్కర్లు, క్యాటరింగ్‌ సిబ్బంది, ఫొటో గ్రాఫర్లు,  నృత్యకళాకారులకూ ఈ టూర్‌ ఉపాధిగా నిలుస్తోంది. 

► పేరంటాలపల్లిలో వెదురు కళాకృతులు విక్రయించే కొండరెడ్డి గిరిజనులు,కొల్లూరు ఇసుక తెన్నెల్లో బొంగు చికెన్‌ విక్రయించే గిరిజనులతో పాటు ఐస్‌లు విక్రయించే వారు ఇలా సుమారులు ఐదు వేలమందికి పైగా దీనిపై ఆధారపడుతుంటారు.  

పోశమ్మ గండి బోట్‌ పాయింట్‌  
పోశమ్మ గండి బోట్‌ పాయింట్‌ నుంచి టూరిజమ్‌ బోట్లు పాపికొండలు పర్యాటానికి బయలుదేరతాయి. బోట్లుల్లో అన్ని సురక్షిత ఏర్పాట్లు మధ్య పాపికొండకు బోటులను పంపండం జరుగుతుంది. బోట్‌ పాయింట్‌ వద్ద పర్యాటక సిబ్బంది ఉంటారు. 
–వీరనారాయణ, టూరిజం అధికారి, రాజమహేంద్రవరం 

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/papikondalu-boat-trip-resumed-november-7-full-details-here-1408105