పింఛన్‌ రూ.2,500 పెంపు

  • అవ్వాతాతలకు శుభవార్త ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌
  • పెంచిన పెన్షన్‌ జనవరి 1న లబ్ధిదారుల చేతికి
  • డిసెంబరు 21న జగనన్న సంపూర్ణ గృహ హక్కు అమలు
  • ప్రభుత్వ పథకాల్లో మిగిలిపోయిన అర్హులకు 28న ప్రయోజనాలు పంపిణీ
  • అగ్రవర్ణ పేద మహిళలకు జనవరి 9న ‘ఈబీసీ నేస్తం’ 
  • పథకంతో 45–60 ఏళ్ల వయసు వారికి మూడేళ్లలో రూ.45 వేలు
  • జనవరిలోనే మూడో విడత వైఎస్సార్‌ రైతు భరోసా 
  • స్పందనపై ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం నిర్ణయాలు

స్పందన అర్జీల పరిష్కారంలో నాణ్యత కీలకం. ఒకే సమస్యపై తిరిగి రెండోసారి అర్జీ వస్తే గతంలో ఆ దరఖాస్తును పరిశీలించిన వారే మళ్లీ వెరిఫికేషన్‌ చేయకూడదు. ఆ అర్జీని పై అధికారి కచ్చితంగా పరిశీలించాలి. ఈ కీలక అంశాలు నిర్దిష్ట నిర్వహణ ప్రణాళిక (ఎస్‌వోపీ)లో ప్రధానం కావాలి. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రజల పట్ల మానవతా థృక్పథంతో ఉండాలి. స్పందనపై కలెక్టర్లు పూర్తిగా మనసు పెట్టాలి. కార్యక్రమం మరింత మెరుగుపడాలి.
 – సీఎం వైఎస్‌ జగన్‌ 

రాష్ట్రంలో లక్షల మంది అవ్వాతాతల మోముల్లో చిరునవ్వులు విరబూసేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొత్త ఏడాది కానుక ప్రకటించారు. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద పెద్ద వయసువారు ప్రస్తుతం అందుకుంటున్న మొత్తాన్ని మాట ప్రకారం ముఖ్యమంత్రి మరింత పెంచారు. ప్రస్తుతం ప్రతినెలా మొదటి రోజే రూ.2,250 చొప్పున ఇస్తున్న వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకను జనవరి 1వతేదీన రూ.2,500కు పెంచి అవ్వా తాతల చేతిలో పెడతామని తెలిపారు. ‘స్పందన’లో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇచ్చిన హామీ మేరకు పెన్షన్‌ కానుకను పెంచుతున్నామని, ఇది చాలా పెద్ద కార్యక్రమం అని తెలిపారు. ఈ సందర్భంగా డిసెంబర్, జనవరిలో అమలు చేసే పలు పథకాలు, కార్యక్రమాల వివరాలను సీఎం ప్రకటించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన, స్పందన సమస్యల పరిష్కారంపై ఉన్నతాధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఆ వివరాలివీ…

మనస్ఫూర్తిగా ‘స్పందన’
స్పందన కార్యక్రమంలో కలెక్టర్లు మనస్ఫూర్తిగా నిమగ్నం కావాలి. స్పందన అమలు యంత్రాంగాన్ని మరోసారి పరిశీలించాలి. రోజూ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి సచివాలయంలో స్పందన ద్వారా అర్జీలు స్వీకరిస్తున్నాం. దీంతోపాటు వారానికి ఒక రోజు అర్జీలు తీసుకుంటున్నాం. ఒక సచివాలయం స్థాయిలో ప్రతి రోజూ వస్తున్న అర్జీలను ఎలా పరిష్కరిస్తున్నారనే అంశంపై అధికారుల సమీక్ష అవసరం. మండల స్థాయిలో కూడా అధికారులు పరిశీలించాలి. వారంలో ఒకరోజు మండల అధికారులతో కలెక్టర్‌ సమీక్ష చేయాలి. 

మరింత మెరుగ్గా మన లక్ష్యాలు
ఏ ఒక్కరినీ విడిచిపెట్టకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో, పారదర్శక పద్ధతిలో ప్రయోజనాలను అందించడం ఎస్‌డీజీ లక్ష్యాల వెనుక ప్రధాన ఉద్దేశం. నవరత్నాల ద్వారా అందరినీ మ్యాపింగ్‌ చేశాం. ఆశించిన లక్ష్యాలను సాధించాలి. దేశంతో పోలిస్తే మన లక్ష్యాలు మెరుగ్గా ఉండాలి. ఎస్‌డీజీ లక్ష్యాల సాధనపై కలెక్టర్లు దృష్టిపెట్టి పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి జిల్లా ఎస్‌డీజీ లక్ష్యాల సాధనలో ముందుకు సాగాలి.  

ఉగాది నాటికి పూర్తి కావాలి 
సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్‌ క్లినిక్‌ల భవన నిర్మాణాలన్నీ ఉగాది నాటికి పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలి. డిజిటల్‌ లైబ్రరీలు కూడా త్వరలో అందుబాటులోకి రావాలి. నాడు –నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు పునరుజ్జీవం పొందాయి. మరోవైపు విలేజ్‌ క్లినిక్‌లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తున్నాయి. వీటన్నింటి ద్వారా మొత్తం గ్రామాల ముఖచిత్రం మారిపోతోంది. 

డిసెంబర్, జనవరిలో కార్యక్రమాలు ఇవీ.. 
పేదలకు ఎంతో మేలు చేకూర్చే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని డిసెంబర్‌ 21న ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 
► ఈ ఏడాది ఏప్రిల్‌ తర్వాత చేపట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి వివిధ కారణాల వల్ల మిగిలిపోయిన అర్హులకు డిసెంబర్‌ 28న ప్రయోజనాలను అందచేస్తామని తెలిపారు. గతంలో చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు ఇంకా అర్హులెవరైనా మిగిలిపోతే దరఖాస్తు చేసుకునేందుకు సమయం ఇచ్చామని, ఇప్పుడు వారికి ప్రయోజనాలు పంపిణీ చేస్తామన్నారు. సామాజిక తనిఖీ కోసం లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించాలని అధికారులకు సీఎం సూచించారు. 

జనవరి 9న ఈబీసీ నేస్తం… 
అగ్రవర్ణ నిరుపేద మహిళలకు (45 – 60 ఏళ్లు) ఏడాదికి రూ.15 వేలు చొప్పున మూడేళ్లలో రూ.45 వేలు చొప్పున ఆర్థిక సాయం అందచేసే ఈబీసీ నేస్తం పథకాన్ని జనవరి 9వతేదీన ప్రారంభించనున్నారు.
► జనవరిలోనే వైఎస్సార్‌ రైతు భరోసా మూడో విడత చెల్లింపులు చేస్తామని, త్వరలోనే తేదీని ప్రకటిస్తామని సీఎం తెలిపారు. అర్హులందరికీ పథకాలు అందాలి.. అనర్హులకు అందకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు.
► ఈ కార్యక్రమంలో సీఎస్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, గృహ నిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, వ్యవసాయ మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి వై. మధుసూదన్‌రెడ్డి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌ అనురాధ తదితరులు పాల్గొన్నారు.   

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/cm-jagan-new-year-gift-ysr-pension-kanuka-beneficiaries-1419763