పిల్లల్లో కోవిడ్‌ చికిత్సకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌

    రాష్ట్రంలో 12 ఏళ్లలోపు చిన్న పిల్లలకు కోవిడ్‌–19 సోకితే అనుసరించాల్సిన చికిత్సా విధానం, నియంత్రించడం కోసం ఒక స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది మంది సభ్యులతో ఒక టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్‌ఫోర్స్‌ చైర్మన్‌గా ఏపీఎండీసీ చైర్మన్‌ డాక్టర్‌ బి.చంద్రశేఖర్‌రెడ్డి వ్యవహరించనుండగా, సభ్య కన్వీనర్‌గా ఏపీహెచ్‌ఎస్‌ఎస్‌పీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ ఐఏఎస్‌ వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో సభ్యులుగా డాక్టర్లు ఎం.రాఘవేంద్రరావు, సాయిలక్ష్మి, అరుణ్‌బాబు, సర్దారా సుల్తానా, చంద్రశేఖర్‌రె డ్డి, రఘువంశి చిత్ర ఉన్నారు. చిన్న పిల్లల్లో కోవిడ్‌ లక్షణాలున్నప్పుడు వైద్య విధానాలు, ఇందుకు వైద్య సిబ్బంది, నర్సింగ్, పారా మెడికల్‌ సిబ్బందికి పూర్తిస్థాయి శిక్షణ వంటి ప్రోటోకాల్స్‌ను టాస్క్‌ ఫోర్స్‌ రూపొందిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ శుక్రవారం విడుదల చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు. 

    ప్రైవేటు ఆస్పత్రుల గుర్తింపునకు కమిటీ
    ప్రైవేటు ఆస్పత్రుల గుర్తింపు, నిబంధనల పర్యవేక్షణ కోసం కమిటీని ఏర్పాటు చేసూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీకి ఎక్స్‌అఫిషియో చైర్మ న్‌గా వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ప్రత్యేక ప్రధానకార్యదర్శి/ ముఖ్యకార్యదర్శి/ కార్యదర్శి ఉంటారు. ఆరోగ్య శాఖ కమిషనర్‌ సభ్య కార్యదర్శిగా ఉండే ఈ కమిటిలో న్యాయ, స్త్రీ శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమ శాఖలకు చెందిన డిప్యూటీ కార్యదర్శులతో పాటు వివిధ వైద్య సంఘాలు, సంక్షేమ సంఘాలకు చెందిన 10 మంది నామినేటెడ్‌ సభ్యులు ఉంటారు.  

    Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/special-task-force-treatment-covid-childrens-1367240