పేదలందరికీ ఇళ్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ళు వైయస్ఆర్ ఇళ్ల పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.2 లక్షల నుంచి 5 లక్షల వరకూ ప్రయోజనం చేకూరుతుంది. ఇల్లులేని పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తారు. ఐదేళ్లలో 25లక్షల పక్కా ఇళ్లు కట్టాలన్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యం. ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోని ఆడవారి పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తారు. అవసరమైతే ఆ ఇంటి మీద పావలా వడ్డీకే బ్యాంకులో రుణం ఇప్పిస్తారు. ప్రతి ఒక్క లబ్ధిదారుడికి 1.5 సెంట్ల ఇంటిస్థలం ఇచ్చి..పైసా ఖర్చులేకుండా పక్క ఇల్లు పొందేలా చేస్తారు. వైయస్సార్ ఇళ్ల పథకం కింద నాలుగు విడతల్లో ఇళ్ల నిర్మాణం చేస్తారు. 2020 నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభమై, ఉగాది నాటికి ఇళ్లస్థలాలు, పట్టాల పంపిణీ కార్యక్రమం అన్ని జిల్లాలో పూర్తవుతుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా 300 చదరపు అడుగుల వరకు గల గృహాలకు సంబంధించి పట్టణ గృహ నిర్మాణ లబ్ధిదారులకు రుణాన్ని మాఫీ చేస్తుంది. 2019-20 బడ్టెలో పేదలందరికీ ఇళ్లకు రూ. 8615 కోట్లు కేటాయించారు.

లభ్ధిదారులకు కావాల్సిన అర్హతలు:

– గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని
 లబ్దిదారులు ఎవరైనా విధిగా దారిద్ర్య రేఖకు
దిగువ వర్గంకు చెంది ఉండవలెను

– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా లబ్దిదారునికి
 సొంత గృహము మరియు ఇంటి స్థలం ఉండకూడదు.

– గతంలో కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు
చేసిన ఏవిధమైన గృహ పధకాలలో లబ్ధిదారు
ప్రయోజనం పొంది ఉండరాదు.

– మొత్తం కుటుంబానికి మాగాణి 3 ఎకరాలు లేదా మెట్ట 10 ఎకరాలు లేదా మాగాణి మరియు
 మెట్ట కలిపి 10 ఎకరాలకు లోపుగా ఉండవలెను.

జాబితాలో పేరు లేనివారు దరఖాస్తు చేసుకొనే విధానము:

– అర్హత కల్గిన దరఖాస్తుదారులు వారి ఆధార్ కార్డు మరియు భూమి యాజమాన్య అడంగల్ కాపీని
 జతచేసిన దరఖాస్తును నేరుగా గ్రామ/వార్డు సచివాలయాలలో గానీ లేదా గ్రామ/వార్డు వాలంటీర్ల
ద్వారా గానీ దరఖాస్తు చేసుకోవచ్చును.