పేదలందరికీ ఇళ్ల పంపిణీ చేయనున్నప్రభుత్వం

-డిసెంబర్ 25 నుండి జనవరి 7 వరకు కొనసాగనున్న కార్యక్రమం
-రాష్ట్ర వ్యాప్తంగా 30.75 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ
-లభ్ధిదారుడికి నచ్చిన రీతిలో నిర్మాణం

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జగన్మోహాన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన  నవరత్నాలలో  పేదలందరికీ ఇళ్లు పథకం ప్రధాన జాబితాలో వుంటుంది. ఈ పధకం ద్వారా  పేదలకు ఇచ్చే ఇళ్ల నిర్మాణాన్ని డిసెంబర్ 25న చేపట్టనున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు  డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యన్నారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. డిసెంబర్‌ 25న ఇళ్ల స్థలాలు పంపిణీ, అదే రోజు ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చేపట్టాలని నిర్ణయించారు. జనవరి 7,2021 వరకూ ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఆయా నియోజక వర్గాల్లో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొంటారు.

రాష్ట్ర వ్యాప్తంగా 30.75 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు అందించనున్నారు. రూ.23,535 కోట్ల విలువైన ఇళ్ల స్థలాలను పంపిణీ చేయనున్నారు.కోర్టు కేసులు కారణంగా ఇళ్ల స్థలాలు ఇవ్వలేని ప్రాంతాల్లో లబ్ధిదారులుగా ఎంపికైన వారికి, కేసులు పరిష్కారం కాగానే పట్టా ఇస్తామంటూ లేఖ ఇవ్వాలని నిర్ణయించారు. వచ్చే మూడేళ్లలో 28.3 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక వేసింది. పట్టాలు ఇచ్చిన ప్రాంతాల్లో డిసెంబర్‌ 25నే 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభించనున్నారు. 175 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 8,914 ఇళ్లు చొప్పున పనులు ప్రారంభించనున్నారు. 8,838 కొత్త లే అవుట్లలో 11.26 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. రెండో దశలో 12.7 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టగా, టిడ్కో ఇళ్లలో 365, 430 చదరపు అడుగుల ఫ్లాట్లపై  ప్రకటించిన తాజా రాయితీల ప్రకారం అదనంగా రూ.482 కోట్ల ఖర్చును ప్రభుత్వం భరించనుంది. 300 చదరపు అడుగుల ఫ్లాట్‌లను కేవలం ఒక రూపాయికే ప్రభుత్వం అందించనుంది.

లభ్ధిదారులకు అనుగుణంగా వారికి నచ్చిన రీతిలో ఇంటి నిర్మాణం చేయాలని, కోర్టు కేసులు వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా అధికారులు నాయస్థానాలకు వివరాలను అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పని చేయాలన్నారు.

లభ్ధిదారులకు నచ్చిన రీతిలో…

– లబ్ధిదారులు ఇళ్లు కట్టించి ఇవ్వమంటే ఇళ్లు కట్టించి ఇస్తారు.
–  మెటీరియల్‌ ఇవ్వండి, లేబర్‌ కాంపొనెంట్‌కు సంబంధించి డబ్బు ఇవ్వండి అంటే అది చేస్తారు.
– డబ్బులు ఇవ్వండి అంటే డబ్బులు ఇస్తాం, ఇళ్లు లబ్ధిదారుడే కట్టుకోవచ్చు.