పేదలకు ప్రభుత్వం తీపి కబురు

 • గృహ రుణాలపై వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌.. మంత్రివర్గం కీలక నిర్ణయం
 • ఆంధ్రప్రదేశ్‌ గృహ నిర్మాణ సంస్థ వద్ద 46.61 లక్షల మంది ఇంటి స్థలం తనఖా  
 • 1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకు రూ.9,320 కోట్లు రుణం.. అసలు, వడ్డీ కలిపి రూ.14,609 కోట్లు
 • గ్రామాల్లో రూ.10 వేలు, మునిసిపాలిటీల్లో రూ.15 వేలు, నగరపాలక సంస్థల్లో రూ.20 వేలు చెల్లిస్తే పూర్తి హక్కులు.. డిసెంబర్‌ 15 వరకు ఈ అవకాశం
 • ఇళ్ల లబ్ధిదారులకు పావలా వడ్డీకే రూ.35 వేల రుణం 
 • 1.62 లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం
 • వైఎస్సార్‌ ఆసరా రెండో విడతగా త్వరలో రూ. 6,470 కోట్ల చెల్లింపు
 • పాఠశాలలు, ఆస్పత్రులకు నాడు–నేడు కింద సహాయం చేసిన దాతల పేర్లు 
 • బద్వేలు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు
 • కల్తీ మందులు విక్రయిస్తే కఠినంగా శిక్షంచేలా చట్ట సవరణ
 • సేంద్రియ ఉత్పత్తులు ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ అథారిటీ 
 • ఎస్సీ, ఎస్టీ, బీసీల తరహాలో మైనార్టీలకూ సబ్‌ ప్లాన్‌
 • మంత్రివర్గం నిర్ణయాలను వెల్లడించిన సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని

ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలను ఆంధ్రప్రదేశ్‌ గృహ నిర్మాణ సంస్థ (ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌) వద్ద తనఖా పెట్టి రుణం తీసుకున్న పేద వర్గాల ప్రజలకు భారీ సాంత్వన చేకూర్చుతూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ పథకం ద్వారా వారు ఆ రుణాన్ని చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. తనఖా పెట్టిన ఇంటి స్థలాలను ప్రైవేటు ఆస్తులుగా మారుస్తూ.. వారి పేర్లతోనే రిజిస్ట్రేషన్‌ చేయించాలని నిర్ణయించింది. దీని వల్ల రాష్ట్రంలో 46,61,737 మందికి లబ్ధి చేకూరుతుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది. పలు కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) విలేకరులకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

గృహ రుణం నుంచి పేదలకు విముక్తి 
► రాష్ట్రంలో 1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకు గృహ నిర్మాణ సంస్థ వద్ద స్థలాలను తనఖా పెట్టి.. ఇళ్ల నిర్మాణం కోసం రూ.9,320 కోట్లను పేదలు రుణంగా తీసుకున్నారు. దీనిపై వడ్డీ రూ.5,289 కోట్లకు చేరుకుంది. అసలు, వడ్డీ కలిపి రూ.14,609 కోట్లు అయింది. ఈ రుణాన్ని వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ పథకం కింద చెల్లింపులు చేస్తే, వారికి ఇంటి స్థల పత్రాలను అప్పగించడంతోపాటు వారి పేర్లతోనే రిజిష్ట్రేషన్‌ చేసి ఇస్తారు. తద్వారా వారికి పూర్తి హక్కులు వస్తాయి. 
► గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణాలు పొందిన వారిలో.. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు రూ.10 వేలు, మున్సిపాల్టీలకు చెందిన వారు రూ.15 వేలు, నగర పాలక సంస్థలకు చెందిన వారు రూ.20 వేలను వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద చెల్లిస్తే సరిపోతుంది.
► గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం తీసుకుని నిర్మించుకున్న ఇంటిని ఒకవేళ ఎవరికైనా అమ్మిన పక్షంలో.. ఆ ఇంటిని కొనుగోలు చేసిన వారికి మరెక్కడా ఇంటి స్థలం లేకపోతే.. వారు పేద వారైతే అలాంటి వారికి గ్రామీణ æప్రాంతాలలో రూ.20 వేలు, మున్సిపాల్టీల్లో రూ.30 వేలు, నగర పాలక సంస్థల్లో రూ.40 వేలు ఈ పథకం కింద చెల్లిస్తే సరిపోతుంది. 
► గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం తీసుకోకుండా సొంతంగా ఇల్లు కట్టుకుని ఉంటే, రూ.10 చెల్లిస్తే వారికి ఇంటి స్థలంపై ప్రభుత్వం హక్కులు కల్పిస్తుంది. ఇలాంటి స్థలాన్ని కొనుగోలు చేసిన వారికి మరెక్కడా ఇంటి స్థలం లేకపోతే.. వారు పేద వారైతే గ్రామీణ æప్రాంతాలలో రూ.10 వేలు, మున్సిపాల్టీల్లో రూ.15 వేలు, నగర పాలక సంస్థల్లో రూ.20 వేలను చెల్లించి పూర్తి హక్కులు పొందవచ్చు. 
► వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పథకం కింద చెల్లింపులు చేయడానికి తుది గడువు డిసెంబర్‌ 15. చెల్లింపులు చేసిన వారికి డిసెంబర్‌ 21న ఇంటి స్థలం పత్రాలను అప్పగిండచంతో పాటు వారి పేర్లతోనే రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్‌ చేయించి పూర్తి హక్కులు కల్పిస్తారు.
► వలంటీర్లు.. గ్రామ, వార్డు సచివాలయ, మండల స్థాయి అధికారులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి.. వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పథకం గురించి అవగాహన కల్పిస్తారు. 
మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 
 
ఇళ్ల లబ్ధిదారులకు పావలా వడ్డీకే రూ.35 వేల రుణం 
‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్రంలో 31 లక్షల గృహాలను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇందులో తొలి దశ కింద 15,60,227 ఇళ్లను నిర్మిస్తోంది. ఈ ఇళ్ల నిర్మాణానికి రూ.1.80 లక్షల చొప్పున ప్రభుత్వం అందజేస్తోంది. ఆ ఇళ్ల నిర్మాణం కోసం అదనపు ఆర్థిక సహాయం కింద లబ్ధిదారులైన డ్వాక్రా అక్కా చెల్లెమ్మలు అందరికీ 9 శాతం వడ్డీతో బ్యాంకుల నుంచి రూ.35 వేల రుణం ఇప్పిస్తారు. ఇందులో ఆరు శాతం వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుంది. మిగిలిన మూడు శాతం అంటే.. పావలా వడ్డీని మాత్రమే అక్కచెల్లెమ్మలు చెల్లిస్తే సరిపోతుంది. ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం రూపేణా అక్కచెల్లెమ్మలు ఒక్కొక్కరి చేతికి దాదాపు 4 – 5 లక్షల రూపాయల ఆస్తిని ప్రభుత్వం అప్పగించింది. 

వైఎస్సార్‌ ఆసరా రెండో విడత కింద రూ.6470.76 కోట్లు 
► 2019 ఏప్రిల్‌ 11 నాటికి బ్యాంకుల్లో ఉన్న డ్వాక్రా రుణాల మొత్తాన్ని నాలుగు విడతల్లో అందిస్తామంటూ ఎన్నికల్లో సీఎం వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. అప్పటికి రుణంగా ఉన్న రూ.27,168.83 కోట్లను వైఎస్సార్‌ ఆసరా పథకం కింద నాలుగు దఫాలుగా అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వం అందిస్తోంది. 
► ఈ డబ్బును మహిళల సుస్థిర ఆర్థిక ప్రగతికి వినియోగించేలా పలు బహుళ జాతి, పెద్ద కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుని.. ఉపాధి మార్గాలు చూçపుతోంది. ఇప్పటికే ఈ పథకం తొలి విడత కింద 8 లక్షలకు పైగా గ్రూపులకు రూ.6,318 కోట్లను ప్రభుత్వం ఆయా గ్రూపులకు జమ చేసింది.
► రెండో విడతలో రూ.6,470.76 కోట్లను అక్కచెల్లెమ్మలకు అందజేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రెండేళ్లలో ఒక్క వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారానే రూ.12,788 కోట్లకుపైగా ప్రభుత్వం ఖర్చు చేసింది. మొదటి విడతలో సాంకేతిక కారణాల వల్ల ఖాతాల్లో డబ్బులు జమ కాని గ్రూపుల్లోని మహిళలకు రెండు విడతలూ కలిపి ఒకేసారి ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది.
► వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత పథకాలపై మహిళల్లో అవగాహన, చైతన్యం, సాధికారిత దిశగా అడుగులు వేయించే మార్గంలో చేపడుతున్న కార్యక్రమాలను తెలియజేసేందుకు 10 రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించనుంది. 

విద్య, వైద్య రంగాల్లో నాడు–నేడుకు దాతలకు పిలుపు 
► ఆస్పత్రి, పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమం కింద చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సహాయం అందించిన దాతల పేర్లను ఆయా ఆస్పత్రులు, పాఠశాలలకు పెట్టేందుకు మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది.
► కనెక్ట్‌ టు ఆంధ్రా కార్యక్రమం కింద నాడు – నేడు కోసం నిధులు అందించేందుకు దాతలు ముందుకొచ్చారు. 
► రూ.50 లక్షలు ఇస్తే శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూలుకు, రూ.1 కోటి దానం చేస్తే ఫౌండేషన్‌ స్కూలుకు, రూ.3 కోట్లు ఇస్తే హైస్కూల్‌కు దాతల పేర్లు పెడుతారు.
► కోటి రూపాయలు ఇస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, రూ.5 కోట్లు ఇస్తే సీహెచ్‌సీకి, రూ.10 కోట్లు ఇస్తే ప్రాంతీయ ఆస్పత్రికి దాతల పేర్లు పెడతారు.
► ఒక కాలేజీలోగానీ.. స్కూల్లోగానీ క్లాస్‌రూం, అదనపు క్లాస్‌రూం, హాస్టల్, లైబ్రరీ, గ్రామంలో డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణానికి అయ్యే ఖర్చును నూటికి నూరు శాతం దానం చేస్తే సంబంధిత నిర్మాణాలకు 20 ఏళ్లపాటు దాతల పేర్లు పెడతారు. 

నకిలీ, కల్తీ మందులు విక్రయిస్తే కఠిన చర్యలు 
డ్రగ్స్‌ అండ్‌ కాస్మొటిక్స్‌ 1940 చట్టం సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కల్తీ, నకిలీ మందుల విక్రయాన్ని అడ్డుకునేందుకు ఈ చట్ట సవరణ చేసింది. నకిలీ, కల్తీ మందుల వల్ల రోగులు ప్రాణాలు కోల్పోయినప్పుడు.. ప్రస్తుతం చట్టంలో వాటిని విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం లేదు. ఈ నేపథ్యంలో అలాంటి మందులను విక్రయించిన వారిని కఠినంగా శిక్షించేలా చట్ట సవరణ చేసింది. నకిలీ, కల్తీ మందులు విక్రయిస్తే.. లైసెన్స్‌లను రద్దు చేయడంతో పాటు భారీ ఎత్తున జరిమానా విధిస్తారు.
 
అరకులో ఏకలవ్య పాఠశాల 
► విశాఖపట్నం జిల్లా అరకు మండలం మజ్జివలస గ్రామంలో ఏకలవ్య మోడల్‌ స్కూల్‌ నిర్మాణం కోసం 15 ఎకరాల ప్రభుత్వ భూమిని గిరిజన సంక్షేమ శాఖకు బదలాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
► చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం యాదమర్రి గ్రామంలో 2.56 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్, ఐఓసీఎల్, టెర్మినల్‌ నిర్మాణం కోసం ఎకరా రూ.30 లక్షల చొప్పున కేటాయించేందుకు కేబినెట్‌ అంగీకరించింది.
► వైఎస్సార్‌ జిల్లా రాయచోటి మండలం మాసాపేట గ్రామంలో యోగి వేమన యూనివర్సిటీ పీజీ సెంటర్‌ ఏర్పాటు కోసం 53.45 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.
► గుంటూరు వెస్ట్‌ మండలం అడవి తక్కెళ్లపాడులో షటిల్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ కోసం 2 ఎకరాల కేటాయింపునకు మంత్రివర్గం అంగీకరించింది. 
► గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం ఎడవల్లిలో 223 ఎకరాల భూమి ఏపీఎండీసీకి కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ భూమిని సాగు చేసుకుంటున్న రైతులకు.. ఆ ప్రాంతంలో మార్కెట్‌ ధర ప్రకారం పరిహారం చెల్లించాకే ఆ భూములను ఏపీఎండీసీకి బదలాయించాలని స్పష్టం చేసింది. 
► తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్‌ మున్సిపాలిటీ పరిధిలో 31 సెంట్లను కమ్యూనిటీ హాలు, విద్యా సంస్థ నిర్మాణానికి మైనార్టీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌కు కేటాయించేందుకు మంత్రివర్గం అంగీకరించింది. 
► శ్రీశైలంలో శ్రీశైల జగద్గురు పండితారాధ్య సేవా సమితి ట్రస్ట్‌కు 10 ఎకరాల భూమి 33 ఏళ్ల లీజుకు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గజం రూ.10 చొప్పున లీజును నిర్ణయించింది. 
► ప్రతి మూడేళ్లకు లీజు మొత్తాన్ని 30 శాతం పెంచాలని సూచించింది. పాఠశాలæ, అన్నదాన సత్రం, ఆస్పత్రి నిర్మాణానికి ఆ సంస్థకు ఈ భూమిని కేటాయించింది. 

పిల్లల సంరక్షణకు గ్రీన్‌ సిగ్నల్‌ 
ఏపీ ఫాస్టర్‌ కేర్‌ గైడ్‌లైన్స్‌ 2021కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జువైనల్‌ జస్టిస్‌ చట్టం– 2015 కింద మార్గదర్శకాలు రూపొందించారు. తల్లిదండ్రులు శారీరక, మానసిక అనారోగ్యంతో ఉండి, పిల్లల సంరక్షణ చేపట్టలేకపోతే.. ఆ పిల్లలను సంరక్షకులకు అప్పగించే విషయంలో.. సంరక్షకుల సమర్థత, ఉద్దేశం, సామర్థ్యం, పిల్లల సంరక్షణలో వారి అనుభవాన్ని పరిగణలోకి తీసుకునేలా మార్గదర్శకాలను రూపొందించారు.

దేశంలో ప్రథమంగా రాష్ట్రంలోనే మైక్రోసాఫ్ట్‌ శిక్షణ కార్యక్రమం 
విద్యార్థుల నైపుణ్యాలను మెరుగు పరిచేందుకు మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌ కార్యక్రమానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాదాపు రూ.30.79 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 300 కాలేజీలు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాల్లో 40 సర్టిఫికేషన్‌ కోర్సుల్లో 1.62 లక్షల మందికి మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ శిక్షణ ఇవ్వనుంది. ఈ ప్రాజెక్టు వ్యయంలో పది శాతమే రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఈ ప్రాజెక్ట్‌ అమలుకు మానిటరింగ్, ఎవల్యూషన్‌ కమిటీని ఏర్పాటు చేస్తుంది. దేశంలో మైక్రోసాఫ్ట్‌ శిక్షణ కార్యక్రమం చేపట్టడం రాష్ట్రంలోనే ప్రథమం కావడం గమనార్హం.

పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌ విస్తరణకు ఓకే 
రాయలసీమ కరవు నివారణ ప్రణాళికలో భాగంగా హంద్రీ–నీవా సుజల స్రవంతి ఫేజ్‌–2లో పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌ను 79.6 కి.మీ. నుంచి 220.35 కి.మీ వరకు రూ.1,929 కోట్లతో విస్తరించే పనులకు ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనల నుంచి మినహాయింపును ఇచ్చేందుకు మంత్రివర్గం అంగీకరించింది. అత్యంత కరవు పీడిత ప్రాంతాలైన తంబళ్లపల్లి, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో తాగు నీటి కల్పనే లక్ష్యంగా ఈ పనులను ప్రభుత్వం చేపట్టింది.

84 శాతం విస్తీర్ణంలో ఖరీఫ్‌ సాగు 
రాష్ట్రంలో ఖరీఫ్‌ సాగుపై మంత్రివర్గానికి వ్యవసాయ శాఖ అధికారులు వివరాలను అందజేశారు. ఇప్పటి వరకు 84 శాతం విస్తీర్ణంలో సాగైనట్లు వివరించారు. సాధారణ వర్షపాతం 462.7 మి.మీ. కాగా, ఇప్పటి వరకు 504.9 మి.మీ వర్షపాతం నమోదైందని తెలిపారు. 9.1 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్లు వివరించారు. 

పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
► రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల తరహాలోనే మైనార్టీ వర్గాలకూ సబ్‌ ప్లాన్‌ అమలు చేసేందుకు మంత్రివర్గం  చారిత్రక నిర్ణయం తీసుకుంది. 
► వైఎస్సార్‌ జిల్లా కాశినాయన మండలంలో లా అండ్‌ ఆర్డర్‌ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు. ఒక ఎస్సై, ఇద్దరు ఏఎస్సైలు, నలుగురు హెడ్‌ కానిస్టేబుళ్లు, 21 మంది కానిస్టేబుళ్లు, 5 అవుట్‌సోర్సింగ్‌ పోస్టులు, ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇద్దరు డ్రైవర్లు, ఒక స్వీపర్‌ పోస్టు మంజూరు.
► సీఐడీ డిపార్ట్‌మెంట్‌లో అడిషనల్‌ హోంగార్డు పోస్టుల మంజూరు. 
► శ్రీకాకుళం జిల్లాలో ఆముదాలవలస మండలం తొగరాం గ్రామంలో అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కాలేజీ ఏర్పాటు.
► రాష్ట్రంలో ఏపీ స్టేట్‌ ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ అథారిటీ ఏర్పాటుకు ఆమోదం. ఏడాది కాలానికి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ.1.5 కోట్లు అందించనుంది. రాష్ట్రంలో సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ అథారిటీ కృషి చేస్తుంది. దీని వల్ల రాష్ట్రంలో ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ అథారిటీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. గతంలో ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ కోసం దూరాభారంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి.  
► వైఎస్సార్‌ జిల్లా బద్వేలు కేంద్రంగా కొత్తగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు. ఈ డివిజన్‌ పరిధిలోకి పది మండలాలు వస్తాయి. 

వ్యవసాయానికి కేంద్ర సౌర విద్యుత్‌
వ్యవసాయానికి అవసరమైన ఉచిత సోలార్‌ విద్యుత్‌ను సరఫరా చేస్తామంటూ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎస్‌ఈసీఐ) చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి గురువారం ఆమోదం తెలిపింది. ఎన్ని అవాంతరాలు సృష్టించినా..ఎంత మంది అడ్డుకోవాలని ప్రయత్నించినా ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతలను ఆదుకోవడానికి పగటి పూట 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ను 30 ఏళ్ల పాటు ఉచితంగా అందించడానికి వీలుగా 10 వేల మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. టెండర్లు కూడా పిలిచింది. అయితే న్యాయస్థానం ద్వారా కొంత మంది ఈ పథకానికి మోకాలడ్డారు. ఈ నేపథ్యంలో యూనిట్‌ రూ.2.49 చొప్పునే సౌర విద్యుత్‌ అందిస్తామని కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రతిపాదించింది. దేశంలో ఎక్కడి నుంచి సౌర విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్‌కు సరఫరా చేసినా ట్రాన్స్‌మిషన్‌ చార్జీలను పూర్తిగా మాఫీ చేస్తామని తెలిపింది. దీంతో ఈ ప్రాజెక్టును రాష్ట్రం నిర్మించ తలపెట్టిన చోట మిగులుతున్న భూములను ఇతర ప్రజా అవసరాలకు వినియోగించుకునే విషయమై అధ్యయనం చేయాలని కేబినేట్‌ నిర్ణయించింది.  

వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ వల్ల ఎన్నో ప్రయోజనాలు
► ఆస్తులపై పూర్తి హక్కులు దక్కుతాయి… అత్యవసరాల్లో అమ్ముకోవచ్చు. 
► వారసులకు గిఫ్ట్‌ డీడ్‌ కింద ఆస్తులను బదలాయించవచ్చు.
► స్థలాలకు మార్కెట్‌ విలువ పెరుగుతుంది. 
► పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఆరోగ్య పరమైన అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు పొందవచ్చు. 
► రుణం సులువుగా దొరకడంతో కొనుగోలుకు డిమాండ్‌ పెరుగుతుంది. 
► భూముల ధరలు పెరిగిన ప్రాంతాల్లో కబ్జాలకు అడ్డుకట్ట పడుతుంది.  

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/cm-ys-jagan-holds-cabinet-meeting-and-taken-key-decision-1396207