పేద పిల్లల అత్యవసర వైద్య సేవలకు 108 అంబులెన్స్‌

  • తూర్పు గోడావరి జిల్జాలో శిశువుల రక్షణకు ప్రవేశపెట్టిన నియోనేటల్‌ అంబులెన్స్‌
  • నవజాత శిశు రక్షణపై సర్కారు శ్రద్ధ.. ప్రత్యేక అంబులెన్స్‌లతో అత్యవసర సేవలు
  • ఆసుపత్రికి తరలిస్తూనే అధునాతన వైద్యం
  • ఏడాదిలోనే 2 వేల మంది పిల్లలకు ఊపిరి నియోనేటల్‌ అంబులెన్స్‌లతోసత్ఫలితాలు

నవజాత శిశువుల ప్రాణరక్షణలో 108 అంబులెన్స్‌ ఆపద్బాంధవిగా నిలుస్తోంది. అత్యవసర వేళ అపర సంజీవనిలా ప్రత్యక్షమవుతోంది. నిలబెడుతోంది. అనార్యోగంతో ఉన్న పసికందును ఆగమేఘాలపై ఆస్పత్రికి చేరుస్తోంది. ప్రాణాపాయం తప్పించి తల్లితండ్రులకు ఆనందాన్ని పంచుతోంది. ఆస్పత్రి పడక నుంచి ఆరోగ్యంతో అమ్మ పొత్తిళ్లకు చేరి హాయిగా నిద్రపోతోంది. సకల వైద్య సౌకర్యాలతో దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన నియోనేటల్‌ అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్టు ఆరోగ్య రథాలు (108 అంబులెన్స్‌) జిల్లాలో సత్ఫలితాలనిస్తున్నాయి. చిన్నారుల మరణాల కట్టడిలో కీలక భూమిక పోషిస్తున్నాయి. మారుమూల పల్లెలకు సైతం దూసుకుపోతున్నాయి. ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లాలో రెండు వేలకు పైబడి శిశువుల ప్రాణాలను ఈ వాహనాల ద్వారా కాపాడగలిగాయి.

జగన్‌ సర్కారు చొరవ 
పసిబిడ్డల ఆరోగ్యరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. పుట్టిన తర్వాత ఏర్పడే అనారోగ్య సమస్యలు ఎక్కువ మంది పసిపిల్లలకు ప్రాణసంకటంగా పరిణమిస్తుంటాయి. సకాలంలో వైద్యమందించకపోతే ప్రాణాలు కోల్పోతారు. ఈ పరిస్థితులకు పరిష్కారం గుర్తిస్తూ నవజాత శిశువుల ప్రాణరక్షణకు ప్రభుత్వం నడుం బిగించింది. అందులో భాగంగా అంబులెన్స్‌లోనే సకల వైద్య సదుపాయాలను కల్పించింది. కార్పొరేట్‌స్థాయి వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తెచి్చంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో దేశంలోనే మొదటి సారిగా అంబులెన్స్‌ వైద్య సేవలు ప్రవేశపెట్టారు. ఇవి సత్పలితాలను ఇస్తున్నాయి.   తూర్పు గోదావరి జిల్లాలో  రెండు నియోనేటల్‌ అంబులెన్స్‌లు సేవలందిస్తున్నాయి.  


నవజాత శిశువులను సంరక్షించేందుకు అన్ని వసతులు 108లోనే ఉంచిన దృశ్యం 

ఆధునాతన సేవలతో.. 
నియోనేటల్‌ అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్టు అంబులెన్స్‌లు కాకినాడ కేంద్రంగా ఒకటి, రంపచోడవరం కేంద్రంగా మరొకటి అందుబాటులో ఉన్నాయి.  బేబీ వార్మర్స్, పీడియాట్రిక్‌ వెంటిలేటర్, ఇంక్యుబేటర్, నిరంతర ఆక్సిజన్‌ సరఫరా వంటి అత్యవసరమైన అన్ని రకాల పరికరాలు వాహనంలో ఉన్నాయి. నియోనేటల్‌ ఇంటెన్సివ్‌కేర్‌ యూనిట్‌ (ఎన్‌ఐసీయూ)లో లభించే అన్ని సదుపాయాలూ ఉండటం ఈ వాహన ప్రత్యేకత. అత్యవసర వైద్య సేవలు అవసరమైతే ఈ అంబులెన్సులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. శిక్షణ పొందిన ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్లు అంబులెన్స్‌లోనే ప్రాథమికంగా చర్యలు చేపడుతున్నారు. 

ఆసుపత్రులతో అనుసంధానం
జిల్లాలో అత్యధిక ప్రసవాలు జరిగే ప్రభుత్వ ఆసుపత్రులు 9 ఉన్నాయి. అత్యవసర వైద్య సేవలకు కాకినాడ జీజీహెచ్, రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రుల్లో స్పెషల్‌ నియోనేటల్‌ ఇంటెన్సీవ్‌కేర్‌యూనిట్లు (ఎస్‌ఎన్‌సీయూ)లు ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 24 గంటలు పని చేసే ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, సామాజిక కేంద్రాల్లో కాన్పు అనంతరం పుట్టిన బిడ్డకు సమస్య వస్తే కాకినాడ లేదా రాజమహేంద్రవరం తరలిస్తున్నారు. దీనివల్ల గతంలో కాలహరణంతో మార్గ మధ్యలో చిన్నారులు మరణిస్తున్న సంఘటనలు కూడా లేకపోలేదు. ఈ క్రమంలో ఎస్‌ఎన్‌సీయూ ఉన్న ఆసుపత్రులు, ఎస్‌ఎన్‌సీయూ లేకుండా కాన్పులు జరిగే ఆసుపత్రులతో 108 అంబులెన్స్‌లు అనుసంధానంగా సేవలందిస్తున్నాయి. వాహనంలోనే కొంత వైద్యం ప్రారంభిస్తూ ఊపిరిపోస్తున్నాయి.

సేవలను వినియోగించుకోవాలి
పేద పిల్లల అత్యవసర వైద్య సేవలకు ప్రభుత్వం కల్పించిన 108 అంబులెన్స్‌ సదుపాయాన్ని అవసరమైన వారు వినియోగించుకోవచ్చు. మెరుగైన వైద్య సేవల కోసం ఆసుపత్రికి తరలించేలోగా అన్ని రకాల అత్యవసర సేవలను అందజేస్తున్నాం. అత్యాధునిక వైద్య పరికరాలు అంబులెన్స్‌లో ఉన్నాయి. పసి బిడ్డల ప్రాణాలు కాపాడటమే ధ్యేయంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ అంబులెన్సులను ప్రవేశపెట్టారు. 
– సిహెచ్‌ అవినాష్‌, 108 జిల్లా మేనేజర్‌ 

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/emergency-services-special-ambulances-newborn-child-1406428