పేద బిడ్డలకు పట్టం

  • కేవలం అక్షరాస్యతే కాదు.. 100% గ్రాడ్యుయేట్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం జగన్‌
  • పేద విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌
  • పేదరికం నుంచి గట్టెక్కించేది ఉన్నత చదువులే
  • వైఎస్సార్‌ ఫీజుల పథకాన్ని తెస్తే ఆ తరువాత నేతలు నీరుగార్చారు
  • ఫీజులు చెల్లించకుంటే కాలేజీకి రావద్దని, పరీక్షలు రాయనివ్వబోమని అడ్డుకున్న ఘటనలూ చూశాం
  • ఈ అవమానాలను తట్టుకోలేక, ఫీజులు కట్టలేక నెల్లూరు జిల్లాలో విద్యార్థి ఆత్మహత్య ఘటనను నా పాదయాత్రలో చూశా
  • ఇలాంటి దుస్థితి ఎవరికీ రాకూడదనే వంద శాతం ఫీజులను చెల్లిస్తున్నాం
  • ప్రముఖ ప్రైవేట్‌ వర్శిటీల్లోనూ కన్వీనర్‌ కోటాలో సీట్లిచ్చేలా చట్ట సవరణ చేశాం
  • 9,87,965 మంది తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన నగదు జమ చేసిన సీఎం జగన్‌
  • 11.03 లక్షల మంది విద్యార్థులకు రూ.686 కోట్ల మేర ప్రయోజనం

తల్లులందరికీ ఒక మనవి… మంచి ఉద్దేశంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టాం. మీ ఖాతాల్లో జమ చేసిన పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బు లను వారం పది రోజుల్లోగా కళాశా లకు వెళ్లి చెల్లించాల్సిన బాధ్యత మీమీద ఉంది. ఒకవేళ మీరు కాలేజీ లకు చెల్లించకపోతే తదుపరి విడ తలో ఆ ఫీజుల డబ్బులను మీ ఖాతా లకు కాకుండా నేరుగా కళాశాలలకే ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
– సీఎం వైఎస్‌ జగన్‌

కేవలం అక్షరాస్యత మాత్రమే కాకుండా పేద పిల్లలను వందకు వంద శాతం గ్రాడ్యుయేట్లుగా తీర్చిదిద్దాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ఈ ఆశయంతోనే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా అందిస్తున్నామని తెలిపారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేలా వైఎస్సార్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తీసుకొస్తే ఆ తర్వాత వచ్చిన నాయకులు ఈ పథకాన్ని దెబ్బతీస్తూ వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు చెల్లించకుంటే కాలేజీకి రావద్దని, పరీక్షలు కూడా రాయనివ్వబోమని అడ్డుకున్న ఘటనలను కూడా గతంలో చూశామని గుర్తు చేశారు.

ఈ అవమానాలను తట్టుకోలేక, ఫీజులు కట్టలేక నెల్లూరు జిల్లాలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతాన్ని తన పాదయాత్ర సమయంలో చూశానని, అది ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. అలాంటి పరిస్థితి ఎవరికీ రాకుండా చూడాలని, చదువుకునేందుకు పేదరికం అడ్డు కాకుండా అండగా నిలవాలని అప్పుడే నిర్ణయించుకున్నానని తెలిపారు. అందుకే కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుతున్నా అందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నామని వివరించారు. ఈ ఏడాది జగనన్న విద్యా దీవెన మూడో విడత కింద 11.03 లక్షల మంది విద్యార్ధులకు ప్రయోజనం చేకూరుస్తూ 9,87,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.686 కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులను ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ..

కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నగదు జమ చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

తలరాతను మార్చే పెద్ద చదువులు 
పేదరికం తొలగిపోయి తలరాతలు మారాలంటే ఇంజనీర్లు, డాక్టర్లు లాంటి పెద్ద చదువులు చదివిన వారి సంఖ్య బాగా పెరగాలి. గత సర్కారు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు చెల్లించకుండా బకాయిలు పెట్టింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బకాయిలు రూ.1,778 కోట్లతో కలిపి రూ.6,259 కోట్లు ఫీజుల కింద చెల్లించాం. దీనివల్ల దాదాపు 21,48,477 మంది విద్యార్ధులకు మేలు జరిగింది. 

ఇంజనీరింగ్, మెడిసిన్‌కూ రీయింబర్స్‌మెంట్‌
దేశంలో ఎక్కడా లేనివిధంగా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌.. ఇలా కోర్సులేవైనా పేద విద్యార్ధులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నాం. పీజీ కోర్సులకు కూడా ప్రభుత్వ కాలేజీలలో చదివే వారికి అమలు చేస్తున్నాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులను ప్రతి మూడు నెలలకొకసారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. వారే కాలేజీలకు వెళ్లి స్వయంగా వసతులను పరిశీలించి కాలేజీలకు ఫీజులు చెల్లించే బాధ్యతను అప్పగించాం.

పిల్లల చదువులు ఎలా సాగుతున్నాయి? బాగా చదువుతున్నారా? లేదా? అనే విషయాలను అవగతం చేసుకోవడంతోపాటు ల్యాబ్స్, ఇతర సదుపాయాలను తల్లులే స్వయంగా పరిశీలిస్తారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే యాజమాన్యాలను ప్రశ్నించగలుగుతారు. దీనివల్ల కాలేజీలకు కూడా జవాబుదారీతనం పెరుగుతుంది. తల్లుల పర్యవేక్షణతో ఈ రెండూ జరుగుతాయి. కాలేజీల్లో సమస్యలుంటే యాజమాన్యాలను ప్రశ్నించడమే కాకుండా 1902 నంబర్‌కు ఫోన్‌ చేసి తెలియచేస్తే ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తుంది.

ప్రైవేట్‌లోనూ కోటా
గతంలో మెరిట్‌ ఉన్నా ఆర్థిక భారం కారణంగా ప్రైవేట్‌ రంగంలోని ప్రముఖ కాలేజీలు, యూనివర్సిటీల్లో పేద విద్యార్థులు అడ్మిషన్లు పొందలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు సమూల మార్పులు తీసుకొచ్చాం. ప్రైవేట్‌ యూనివర్శిటీల్లో మెడికల్, డెంటల్‌లో 50 శాతం సీట్లు, ఇంజనీరింగ్, డిగ్రీ లాంటి ఇతర కోర్సుల్లో 35 శాతం సీట్లను కచ్చితంగా కన్వీనర్‌ కోటా కింద ప్రభుత్వ కోటాలో భర్తీ చేయాలని చట్టంలో సవరణలు చేశాం. ఫలితంగా పేద విద్యార్థులకు అవకాశం లభిస్తోంది. ఈ ఏడాది దాదాపు 2,118 మంది విద్యార్థులకు ఈ అవకాశం దక్కింది. వీరికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తున్నాం. ప్రతిభ ఉన్న అర్హులైన పేద విద్యార్థులకు మేలు జరుగుతోంది.

విద్యా దీవెన, వసతి దీవెనతో మంచి ఫలితాలు
జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇటీవల సర్వే నివేదిక ప్రకారం మన రాష్ట్రంలో ఉన్నత విద్యలో చేరుతున్న 17 – 23 ఏళ్ల వయసు విద్యార్థుల గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో 2020కి 35.2 శాతానికి పెరిగింది. 2018–19తో పోలిస్తే 2019–20లో జాతీయ స్థాయిలో జీఈఆర్‌ రేషియో పెరుగుదల 3.04 శాతం కాగా మన రాష్ట్రంలో 8.6 శాతంగా నమోదైంది. జాతీయ స్థాయిలో జీఈఆర్‌కు సంబంధించి ఎస్సీల్లో 1.7 శాతం, ఎస్టీల్లో 4.5 శాతం, బాలికల్లో 2.28 శాతం పెరుగుదల ఉండగా మన రాష్ట్రంలో మరింత మెరుగైన ఫలితాలున్నాయి. ఎస్సీల్లో 7.5 శాతం, ఎస్టీల్లో 9.5 శాతం, విద్యార్థినుల్లో 11.03 శాతం పెరుగుదల నమోదైంది. జాతీయ స్థాయి సగటు కన్నా మెరుగ్గా ఉన్నప్పటికీ మనం అనుకున్న లక్ష్యాలను చేరాలంటే సుదీర్ఘ ప్రయాణం చేయాలి. అందరి ఆశీస్సులు, దేవుడి దయతో గమ్యాన్ని చేరుకుంటామన్న నమ్మకం ఉంది.

రెండున్నరేళ్లలో రూ.8,526 కోట్లు
పెద్ద చదువులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఒక్కటే సరిపోదని వసతి దీవెన పథకాన్ని కూడా అమలు చేస్తున్నాం. పిల్లల బోర్డింగ్, మెస్‌ ఖర్చులు రూ.20 వేలు చెల్లించలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులున్నారు. వారు అవస్థలు పడకూడదు, అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదనే వసతి దీవెన అమలు చేస్తున్నాం. వసతి దీవెనకు ఇప్పటివరకు రూ.2,267 కోట్లు నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేశాం. పిల్లలకు మేనమామలా.. అక్క చెల్లెమ్మలకు తమ్ముడిగా, అన్నగా మంచి చేస్తున్నాం. విద్యాదీవెన, వసతి దీవెన.. ఈ రెండు పథకాలకు కలిపి ఈ రెండున్నర ఏళ్లలో రూ.8,526 కోట్లకుపైగా ఇచ్చాం.

16 కొత్త మెడికల్‌ కాలేజీలు..
రాష్ట్రంలో ప్రస్తుతం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలుండగా కొత్తగా మరో 16 మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు శరవేగంగా శ్రీకారం చుట్టాం. రెండేళ్లలో ఇవి అందుబాటులోకి వస్తాయి. 

ట్రైబల్‌ వర్సిటీకి త్వరలో శంకుస్థాపన
విజయనగరం జిల్లాల్లో గురజాడ జేఎన్టీయూ, ఒంగోలులో ఆంధ్రకేసరి యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా ప్రతి జిల్లాలో యూనివర్సిటీ ఉంటుంది. కడపలో ఆర్కిటెక్చర్‌ యూనివర్సిటీ, కర్నూలులో క్లస్టర్‌ యూనివర్సిటీ, కురుపాంలో ఇంజనీరింగ్‌ కాలేజీ, పాడేరులో మెడికల్‌ కాలేజీ, సాలూరులో ట్రైబల్‌ యూనివర్సిటీ ఏర్పాటవుతున్నాయి. త్వరలోనే పనులు మొదలవుతాయి. 

డిగ్రీ కాలేజీల్లో నాడు – నేడు
2019 నుంచి రాష్ట్రంలో కొత్తగా పది డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశాం. 154 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో రూ.880 కోట్లతో నాడు – నేడు పనులకు శ్రీకారం చుడుతున్నాం. రెండేళ్లలో పనులు పూర్తవుతాయి.

ఉద్యోగాలు వచ్చేలా కోర్సులు..
డిగ్రీ కాలేజీల్లో ఇంగ్లీషు మీడియం వైపు అడుగులు వేస్తున్నాం. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా బైలింగువల్‌ (ద్వి భాషా) టెక్టŠస్‌బుక్స్‌ ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు అందుబాటులోకి తెస్తున్నాం. ఉద్యోగాలు వచ్చే కోర్సులుగా తీర్చిదిద్దుతున్నాం. ప్రతీ డిగ్రీ విద్యార్ధికి అప్రెంటిషిప్, వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోసం జిల్లాల్లోని పరిశ్రమలతో అనుసంధానం చేస్తున్నాం. 30 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలు, ఒక స్కిల్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం.

మైక్రోసాఫ్ట్‌తో 40 కోర్సుల్లో ఉచిత శిక్షణ
విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిలో భాగంగా మైక్రోసాఫ్ట్‌ స్కిల్స్‌ ప్రాజెక్టు కింద 1.62 లక్షల మంది విద్యార్థులకు ఫ్యూచర్‌ రెడీ స్కిల్‌ సొల్యూషన్స్‌ అంటే 40 రకాల కోర్సుల్లో ఉచితంగా శిక్షణ అందచేసి సర్టిఫికెట్‌ ఇచ్చేలా చర్యలు చేపట్టాం. 40 స్కిల్‌ కోర్సుల్లో డేటా ఎనలైటిక్స్, కృతిమ మేథస్సు (ఏఐ), సైబర్‌ సెక్యూరిటీ, కోడింగ్, లాంగ్వేజ్‌ ప్రోగ్రామింగ్, నెట్‌వర్కింగ్‌ లాంటి 8,600 అంశాలను పొందుపరిచారు. పెద్ద కంపెనీలు, నాస్కామ్‌ లాంటి సంస్ధలను స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలతో అనుసంధానం చేస్తున్నాం. 

హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు..
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ సతీష్‌చంద్ర, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, ఏపీఎస్‌సీహెచ్‌ఈ  ఛైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి జే. శ్యామలరావు, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్‌దండే, మైనార్టీ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్‌ వి.చినవీరభద్రుడు తదితరులు పాల్గొన్నారు.  

తల్లులందరికీ ఒక మనవి… మంచి ఉద్దేశంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టాం. మీ ఖాతాల్లో జమ చేసిన పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులను వారం పది రోజుల్లోగా కళాశాలకు వెళ్లి ఫీజుల కింద చెల్లించాల్సిన బాధ్యత మీమీద ఉంది. ఒకవేళ మీరు కాలేజీలకు చెల్లించకపోతే తదుపరి విడతలో ఆ ఫీజుల డబ్బులను మీ ఖాతాలకు కాకుండా నేరుగా కళాశాలలకే ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
– సీఎం జగన్‌

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/cm-ys-jaganmohan-reddy-releases-jagananna-vidya-deevena-3rd-instalment