- కన్వీనర్ కోటాలో భర్తీ చేసేలా ప్రభుత్వ చర్యలు
- రాయితీ ఫీజులు కూడా వర్తింపు
- ఈ మేరకు ప్రైవేటు యూనివర్సిటీల చట్టానికి సవరణలు
- ఉత్తర్వులు జారీ
ప్రవేటు వర్సిటీల్లోని 35 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించేలా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఉన్నత విద్య) తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సీట్లను ప్రవేశపరీక్షలో మెరిట్ సాధించిన రాష్ట్ర విద్యార్థులకు రిజర్వేషన్ల ప్రకారం కన్వీనర్ కోటాలో పారదర్శకంగా కేటాయించనున్నారు.
ఫీజులపైనా నియంత్రణ
విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు సంబంధిత రెగ్యులేటరీ అథారిటీ నోటిఫికేషన్ మేరకు ప్రైవేటు వర్సిటీలు ఫీజుల నిర్ణయానికి అకౌంటు పుస్తకాలు, ఇతర పత్రాలను అథారిటీ సమర్పించాలి. ఈ వర్సిటీలు నిర్ణయించిన ఫీజులు న్యాయబద్ధంగా ఉన్నాయా? లేదా? అనే అంశాన్ని పరిశీలించి అథారిటీ నిర్ణయం తీసుకుంటుంది. కోర్సుల వారీగా ఆ వర్సిటీలు నిర్ణయించిన ఫీజులను సమీక్షించి.. అంతిమంగా వాటి వాదనలను కూడా విని ఫీజులను నిర్ణయిస్తుంది. దీని సిఫార్సుల మేరకు ఆ ఫీజులను ప్రభుత్వం నోటిఫై చేస్తుంది.
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే విద్యా సంస్థలపై రూ.15 లక్షలకు మించకుండా పెనాల్టీని విధించే అధికారం అథారిటీకి ఉంటుంది. వర్సిటీలు తప్పనిసరిగా నిర్ణీత ప్రమాణాల్లో నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్), నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) గుర్తింపు కలిగి ఉండాలి. భవిష్యత్తులో రానున్న మూడేళ్లలో వివిధ కోర్సుల నిర్వహణకు రూ.250 కోట్లు పెట్టుబడి పెట్టగలగాలి. అంతర్జాతీయ స్థాయిలో టాప్ 100 యూనివర్సిటీలతో జాయింట్ సర్టిఫికేషన్ డిగ్రీలకు వీలుగా టైఅప్ కలిగి ఉండాలని ప్రైవేటు వర్సిటీల చట్టానికి ప్రభుత్వం సవరణలు చేసింది.
Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/private-universities-35-percent-convenor-quota-seats-poor-merit-students