పోలవరంలో మరో కీలకఘట్టం పూర్తి

  • పూర్తయిన గ్యాప్‌–3 కాంక్రీట్‌ వాల్‌ నిర్మాణం
  • ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌–3లో కాంక్రీట్‌ డ్యామ్‌ నిర్మాణాన్ని పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • 153.5 మీటర్ల పొడవు, 53.32 మీటర్ల ఎత్తు, 8.50 మీటర్ల వెడల్పుతో నిర్మాణం
  • దాదాపు  23 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వినియోగం
  • స్పిల్‌వేను ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌–1, 2లను అనుసంధానించేందుకు మార్గం సుగమం
  • నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో ఒక్కొక్కటీ పూర్తి చేస్తున్న అధికారులు, మేఘా సంస్థ

గోదావరి వరద ఉధృతితో పోటీ పడుతూ కరోనా ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ ప్రాజెక్టు పనులను రాష్ట్ర ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. పోలవరం పనుల్లో మరో కీలక ఘట్టం పూర్తయింది. ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌(ఈసీఆర్‌ఎఫ్‌) గ్యాప్‌–3లో కాంక్రీట్‌ డ్యామ్‌ నిర్మాణాన్ని ‘మేఘా’ సంస్థ పూర్తి చేసింది. 153.5 మీటర్ల పొడవు, 53.32 మీటర్ల ఎత్తు, 8.50 మీటర్ల వెడల్పుతో ఈ డ్యామ్‌ను నిర్మించారు. దీని నిర్మాణంలో సుమారు 23 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను వినియోగించారు. నిర్మాణం పూర్తయిన కాంక్రీట్‌ డ్యామ్‌కు ప్రభుత్వ సలహాదారు (డిజైన్లు) గిరిధర్‌రెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు, ఎస్‌ఈ నరసింహమూర్తి, మేఘా వైస్‌ ప్రెసిడెంట్‌ రంగరాజన్‌ తదితరులు గురువారం శాస్త్రోక్తంగా పూజలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం రామయ్యపేట వద్ద గోదావరిలో భూభౌగోళిక పరిస్థితుల వల్ల నదికి అడ్డంగా ఇసుక తిన్నెలపై ఈసీఆర్‌ఎఫ్, కుడి గట్టుపై స్పిల్‌ వే(కాంక్రీట్‌ డ్యామ్‌).. ఈసీఆర్‌ఎఫ్‌కు ఎడమ వైపున 960 మెగావాట్ల సామర్థ్యంతో జలవిద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించేలా కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ను ఆమోదించింది. ఆ డిజైన్‌ ప్రకారం స్పిల్‌వేను 1,118.4 మీటర్ల పొడవు, 55 మీటర్ల ఎత్తుతో ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. 194.6 టీఎంసీలను నిల్వ చేసేలా 2,454 మీటర్ల పొడవున ఈసీఆర్‌ఎఫ్‌ను మూడు భాగాలుగా నిర్మించాలి.

ఒక్కో లక్ష్యాన్ని అధిగమిస్తూ…
పోలవరం ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేసేలా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు నిర్దేశించిన లక్ష్యాల్లో ఒక్కొక్కటీ అధిగమిస్తూ శరవేగంగా ప్రాజెక్టును పూర్తి చేసేలా అధికారులు అడుగులు వేస్తున్నారు. ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌–3 పూర్తవడంతో స్పిల్‌వే నుంచి ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌–1, గ్యాప్‌–2లను అనుసంధానం చేయడానికి మార్గం సుగమమైంది. ఇప్పటికే ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేశారు. దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను కొలిక్కి తెస్తూనే ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌–2లో ఇప్పటికే 11,96,500 క్యూబిక్‌ మీటర్ల మేర వైబ్రోకాంపాక్షన్‌ విధానంలో ఇసుక పొరలను పటిష్టం చేసే పనులు పూర్తి చేశారు.
పూజలు నిర్వహిస్తున్న ప్రాజెక్టు సీఈ సుధాకర్‌ బాబు తదితరులు  

వరదలకు కోతకు గురైన ప్రాంతంలో 1,61,310 క్యూబిక్‌ మీటర్ల మేర శాండ్‌ ఫిల్లింగ్‌ (ఖాళీ ప్రదేశాలను ఇసుకతో నింపడం) పనులు పూర్తి చేశారు. ఈసీఆర్‌ఎఫ్‌  గ్యాప్‌–1లో 400 మీటర్ల పొడవున డయాఫ్రమ్‌ వాల్‌(పునాది) పనులు పూర్తి చేశారు. ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌–1 నిర్మాణ ప్రాంతంలో ఇసుక పొరలను పటిష్టం చేసేందుకు స్టోన్‌ కాలమ్స్‌ పూర్తి చేశారు. ఈ పనుల్లో అత్యంత కీలకమైన డీప్‌ సాయిల్‌ మిక్సింగ్‌ వేగంగా జరుగుతోంది. ఈ పనులు పూర్తయిన తర్వాత ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల మధ్య నిల్వ ఉన్న నీటిని తోడేసి ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌–1, గ్యాప్‌–2లలో రాతి మట్టికట్టల నిర్మాణాన్ని చేపట్టి 2022 నాటికి పూర్తి చేస్తామని సీఈ సుధాకర్‌బాబు తెలిపారు.

మట్టికట్ట స్థానంలో కాంక్రీట్‌ డ్యామ్‌
ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌–1లో 564 మీటర్లు, గ్యాప్‌–2లో 1,750 మీటర్ల పొడవున రాతి మట్టికట్ట (ఈసీఆర్‌ఎఫ్‌), గ్యాప్‌–3లో 140 మీటర్ల పొడవున మట్టికట్ట నిర్మించాలి. కానీ సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్‌ ఏబీ పాండ్య నేతృత్వంలో కేంద్రం ఏర్పాటు చేసిన డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌(డీడీఆర్పీ) పోలవరం ప్రాజెక్టు భద్రత దృష్ట్యా గ్యాప్‌–3లో మట్టికట్ట స్థానంలో కాంక్రీట్‌ డ్యామ్‌ను నిర్మించాలని ప్రతిపాదించింది. దాన్ని సీడబ్ల్యూసీ ఆమోదించింది. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్‌ ప్రకారం 140 మీటర్ల పొడవున మట్టికట్ట స్థానంలో 153.5 మీటర్ల పొడవున కాంక్రీట్‌ డ్యామ్‌ను నిర్మించారు. అంటే ఈసీఆర్‌ఎఫ్‌ పొడవు 2,454 మీటర్ల నుంచి 2,467.5 మీటర్లకు పెరిగినట్లు స్పష్టమవుతోంది. 

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/complete-another-key-event-polavaram-project-works-1394501