పోలవరం అంచనా వ్యయం రూ.47,725.74 కోట్లు

  • 2017–18 ధరల ప్రకారం విడుదల కానున్న నిధులు
  • ప్రాజెక్టుకు కేంద్ర జల్‌ శక్తి శాఖ ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ ఇవ్వడం లాంఛనమే
  • ప్రభుత్వ వాదనను బలపరుస్తూ సీడబ్ల్యూసీ నివేదిక
  • దాంతో పెట్టుబడి అనుమతి ఇచ్చేందుకు మార్గం సుగమం
  • కేంద్ర జల్‌ శక్తి శాఖ ఫైలును యథాతథంగా ఆమోదించి కేబినెట్‌కు పంపనున్న కేంద్ర ఆర్థిక శాఖ
  • విభజన చట్టం ప్రకారం దాన్ని ఆమోదించనున్న కేంద్ర కేబినెట్‌

పోలవరం జాతీయ ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్ల అంచనా వ్యయానికి కేంద్ర జల్‌ శక్తి శాఖ ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ (పెట్టుబడి అనుమతి) ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన 15 జాతీయ ప్రాజెక్టులకు ఇచ్చిన తరహాలోనే.. పోలవరం ప్రాజెక్టుకూ నీటిపారుదల విభాగం పనులకు నిధులు మంజూరు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను బలపరుస్తూ జల్‌ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌కు.. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సభ్యులు ఎస్కే హల్దార్‌ మంగళవారం నివేదిక ఇచ్చారు.

యూపీ సింగ్‌ అధ్యక్షతన పనిచేసే సీడబ్ల్యూసీ టీఏసీ (సాంకేతిక సలహా మండలి) 2017–18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయానికి ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఇక ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ కమిటీకి కూడా యూపీ సింగ్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం నిధులు ఇచ్చేందుకు అంగీకరిస్తూ ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ ఇవ్వడం ఇక లాంఛనమే. ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ ఇస్తూ కేంద్ర జల్‌ శక్తి శాఖ పంపిన ఫైలును కేంద్ర ఆర్థిక శాఖ యథాత«థంగా ఆమోదించి కేంద్ర కేబినెట్‌కు పంపుతుంది. విభజన చట్టం ప్రకారం ఆ ఫైలును కేంద్ర కేబినెట్‌ ఆమోదిస్తుంది. దాంతో.. 2017–18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు పనులకు కేంద్రం నిధులు విడుదల చేస్తుంది.