బడ్జెట్ లో ప్రజారోగ్యానికి పెద్దపీట

  • 11.23 శాతం అదనంగా కేటాయింపులు
  • వైద్య, ఆరోగ్య రంగానికి రూ.15,384.26 కోట్లు
  • కోటిన్నర కుటుంబాల పాలిట సంజీవని
  • ఆరోగ్యశ్రీకి రూ.2300 కోట్లు కేటాయింపు
  • గిరిజన మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి రూ.170 కోట్లు

ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో వైద్య ఆరోగ్య శాఖకు భారీగా కేటాయింపులు చేసింది. 2021–22తో పోలిస్తే 11.23 శాతం అదనంగా నిధులు కేటాయించింది. గత బడ్జెట్‌లో రూ.13,830.43 కోట్లు కేటాయించగా ఈసారి రూ.15,384.26 కోట్లకు పెంచింది. దాదాపు కోటిన్నర కుటుంబాలను ఆదుకుంటున్న అపర సంజీవని లాంటి డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకానికి రూ.2 వేల కోట్లు, వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరాకు రూ.300 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఆరోగ్యశ్రీ, ఆసరా కోసం రూ.541.06 కోట్లు అదనంగా కేటాయించడం గమనార్హం.

నాడు–నేడుతో ఆస్పత్రులు బలోపేతం 
నాడు–నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల ముఖచిత్రం మారిపోయింది. కొత్త భవనాల నిర్మాణం, మరమ్మతుల కోసం రూ.1,603 కోట్లు, వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల అప్‌గ్రేడ్‌ కోసం రూ.350 కోట్లు కేటాయించారు. మౌలిక వసతుల కల్పనకు రూ.500 కోట్లు ప్రభుత్వం వెచ్చించనుంది. 

కరోనాకు ఉచిత వైద్యం 
కరోనా బాధితులు వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అండగా నిలిచింది. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా దేశంలో తొలిసారిగా అర్హతతో సంబంధం లేకుండా అందరికీ ఉచిత వైద్యం అందించింది. ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా 2,09,765 మందికి చికిత్స కోసం రూ.732.16 కోట్లు ఖర్చు చేసింది.   

తొలగిన చీకట్లు.. 
రాష్ట్రంలో 5.6 కోట్ల మందికి ఉచితంగా సమగ్ర, నాణ్యమైన కంటి సంరక్షణ సేవలు అందించేందుకు  ప్రభుత్వం వైఎస్సార్‌ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించింది. రెండు దశల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. మూడో దశలో 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 16,64,919 మందికి కంటి పరీక్షలు నిర్వహించి సమస్యలున్న 8.50 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేయడంతో పాటు 1.55 లక్షల మందికి శస్త్ర చికిత్సలు చేశారు.

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/ap-budget-health-allocation-increased-11-percentage-details-inside