ప్రణాళిక ప్రకారమే పోలవరం

  • పీపీఏ సీఈవో అయ్యర్‌ సంతృప్తి
  • 2021లో ప్రాజెక్టు పనులపై సమీక్ష
  • సమన్వయంతో హెడ్‌ వర్క్స్, పునరావాసం, భూసేకరణ

సాక్షి, అమరావతి: పోలవరం హెడ్‌వర్క్స్‌ (జలాశయం), పునరావాసం, భూసేకరణ పనులను సమన్వయంతో చేపట్టడం ద్వారా 2021 డిసెంబర్‌ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని జలవనరుల శాఖకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) దిశానిర్దేశం చేసింది. ప్రణాళిక మేరకు పనులు వేగంగా జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేసిన పీపీఏ.. నిర్వాసితులకు పునరావాసం కల్పన పనులను మరింత వేగవంతం చేయాలని సూచించింది. బుధవారం విజయవాడలోని జలవనరులశాఖ క్యాంపు కార్యాలయంలో సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌ అధ్యక్షతన పీపీఏ సమావేశమైంది. రాష్ట్ర జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, ఆర్‌ అండ్‌ ఆర్‌ కమిషనర్‌ బాబురావు నాయుడు, పీపీఏ సభ్య కార్యదర్శి రంగారెడ్డి, పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద్‌ తదితరులు ఇందులో పాల్గొన్నారు. వచ్చే ఏడాదిలో చేపట్టాల్సిన, పూర్తి చేయాల్సిన పనులపై పీపీఏ సమీక్షించింది. స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయని, మే నాటికి స్పిల్‌ వే పూర్తి చేస్తామని ఆదిత్యనాథ్‌ దాస్‌ వివరించారు. కాఫర్‌ డ్యామ్‌ల ఖాళీ ప్రదేశాలను మేలో భర్తీ చేసి ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను 42.5 మీటర్ల ఎత్తు వరకూ పూర్తి చేస్తామని చెప్పారు. జూన్‌లో గోదావరికి వచ్చే వరదను స్పిల్‌వే మీదుగా మళ్లించి కాఫర్‌ డ్యామ్‌ల మధ్య ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌(ఈసీఆర్‌ఎఫ్‌)ను నిర్విఘ్నంగా చేపట్టి 2021 డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తామన్నారు. ఆలోగా కాలువలను అనుసంధానం చేసే కనెక్టివిటీస్‌ పనులు పూర్తి చేస్తామన్నారు. 2022 జూన్‌ నాటికి ఆయకట్టుకు నీళ్లందించే పనులు పూర్తి చేస్తామన్నారు.

పెండింగ్‌ డిజైన్ల ఆమోదంపై దృష్టి…
హెడ్‌ వర్క్స్‌ పనులు ప్రణాళిక మేరకు చేస్తున్నారని పీపీఏ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న డిజైన్‌లను ఫిబ్రవరిలోగా సీడబ్ల్యూసీతో ఆమోదింపజేసుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను 42.5 మీటర్ల ఎత్తుతో పూర్తి చేస్తే ప్రాజెక్టులో 41.15 మీటర్ల కాంటూర్‌ దాకా నీరు నిల్వ ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ కాంటూర్‌ వరకూ ముంపునకు గురయ్యే భూమిని సేకరించడం, నిర్వాసితులకు పునరావాసం కల్పించడాన్ని మేలోగా పూర్తి చేయాలని అప్పుడే కాఫర్‌ డ్యామ్‌లను ఖాళీలను భర్తీ చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలో 17,760 కుటుంబాలకు పునరావాసం కలి్పంచాల్సి ఉందని, ఇందులో 11 వేల ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోందని ఆదిత్యనాథ్‌ దాస్‌ తెలిపారు. మిగతా 6,760 ఇళ్ల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. పునరావాసం పనులను సమన్వయం చేసుకుంటూ కాఫర్‌ డ్యామ్‌ల ఖాళీలను భర్తీ చేసి 2021 డిసెంబర్‌ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి వివరించడంతో పీపీఏ సీఈవో అయ్యర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు.