ప్రతిభా సేవలకు సత్కారం

  • తెలుగుజాతి మకుటాలకు సత్కారం నా అదృష్టం: సీఎం వైఎస్‌ జగన్‌ 
  • గవర్నర్‌ విశ్వభూషణ్‌తో కలిసి స్ఫూర్తిదాయక వ్యక్తులు, సంస్థలకు 59 ‘వైఎస్సార్‌’ పురస్కారాలు అందజేత
  • మీ ప్రతిభకు, సేవలకు వందనం
  • మన సంస్కృతి, కళలకు పెద్దపీట
  • పారదర్శకంగా అవార్డుల ఎంపిక
  • ఇక ఏటా నవంబర్‌ 1న వైఎస్సార్‌ అవార్డుల ప్రదానం 

‘సామాన్యుల్లా కనిపించే అసామాన్యుల సేవలకు వందనం.. వెలకట్టలేని మీ ప్రతిభకు సలాం చేస్తూ వైఎస్సార్‌ అవార్డులు ప్రకటించాం. ఎందరికో స్ఫూర్తినిస్తున్న మహోన్నత వ్యక్తులు, సంస్థలను పురస్కారాలతో  సత్కరిస్తున్నాం. తెలుగువారికి, రాష్ట్రానికి బ్రాండ్‌ అంబాసిడర్లుగా నిలిచిన సంస్కృతి, కళలకు అవార్డుల్లో పెద్దపీట వేశాం..’
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఇక నుంచి ఏటా నవంబర్‌ 1వ తేదీన వైఎస్సార్‌ అవార్డులను ప్రదానం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్, వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని సోమవారం విజయవాడలో ఘనంగా నిర్వహించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు, దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ , సీఎం వైఎస్‌ జగన్‌ నివాళులు అర్పించారు. అనంతరం 2021 సంవత్సరానికిగాను 29 వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు, 30 వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు కలిపి మొత్తం 59 అవార్డులను గవర్నర్, ముఖ్యమంత్రి ప్రదానం చేశారు. వైఎస్సార్‌ అవార్డులను నెలకొల్పడం వెనుక ఉద్దేశం, ఎంపికలో పాటించిన పారదర్శకత, అవార్డు గ్రహీతల గొప్పతనం గురించి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ వివరించారు. సీఎం జగన్‌ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ..

పద్మ అవార్డుల తరహాలో… 
కేంద్ర ప్రభుత్వం ఏటా వివిధ రంగాలలో సేవలందించిన గొప్పవారిని దేశంలో అత్యున్నత అవార్డులైన భారతరత్న, పద్మశ్రీ, పద్మభూషణ్‌ తదితర అవార్డులతో సత్కరిస్తోంది. మనందరి ప్రభుత్వం కూడా ఇటువంటి కార్యక్రమమే చేపట్టి రాష్ట్రం తరపున అవార్డులు ఇస్తే బాగుంటుందని పలువురు సూచించిన నేపథ్యంలో వైఎస్సార్‌ అవార్డులను నెలకొల్పాం. 

మహామనిషి పేరుతో అత్యున్నత పురస్కారాలు
మహానేత, నాన్న వైఎస్సార్‌ పేరు చెబితే అందరికీ ఎన్నో విషయాలు గుర్తుకొస్తాయి. నిండైన తెలుగుదనం తన పంచెకట్టులో కనిపిస్తుంది. తన ప్రతి అడుగులోనూ వ్యవసాయం మీద మమకారం కనిపిస్తుంది. పల్లెలు, పేదల మీద అభిమానం తనను చూడగానే గోచరిస్తాయి. ప్రతి ఒక్కరి ప్రాణాన్ని నిలబెట్టాలన్న ఆరాటం, అందరినీ పెద్ద చదువులు చదివించాలన్న తపన.. ఇవన్నీ నాన్నను చూడగానే గుర్తొచ్చే విషయాలు. ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ఆ మహామనిషి ఈరోజు మన మధ్య లేకపోయినా.. అంత గొప్పవాడు, మహానుభావుడి పేరుమీద రాష్ట్ర స్ధాయిలో అత్యున్నత పౌర పురస్కారాలను వైఎస్సార్‌ లైఫ్‌టైం అచీవ్‌మెంట్, వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుల పేరుతో ప్రకటించాం. లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డులు ప్రకటించిన వారికి రూ.10 లక్షలు, కాంస్య విగ్రహం, మెమెంటో, యోగ్యతా పత్రం ఇస్తున్నాం. వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు పొందినవారికి రూ.5 లక్షలు, కాంస్య విగ్రహం, మెమెంటో, యోగ్యతా పత్రం ఇస్తున్నాం.

పారదర్శకంగా ఎంపిక
ఈ రోజు గర్వంగా ఇంకో విషయం చెబుతున్నా. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.30 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం దగ్గరనుంచి ప్రతి సంక్షేమ పథకాన్నీ పేదలకు అత్యంత పారదర్శకంగా ఇవ్వగలిగే వ్యవస్ధని తెచ్చాం. ఈ అవార్డుల ఎంపికలో కూడా కులం, మతం, ప్రాంతం చూడలేదు. పార్టీలు, రాజకీయ భావాలను కూడా చూడలేదు. మనిషిని మనిషిగానే చూశాం. విభేదించే భావాలున్నా మనుషుల్లో కూడా మహామనుషులను చూశాం. రాష్ట్ర చరిత్రలోనే అత్యంత పారదర్శకంగా అవార్డులను ఇస్తున్నాం.

ఎందరో మహానుభావులు…
మన తెలుగు సంస్కృతి, కళలు, మానవతామూర్తులకు ఇస్తున్న గొప్ప అవార్డులుగా వీటిని భావిస్తున్నాం. ఎందరెందరికో స్ఫూర్తినిస్తున్న మహోన్నత వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులు ఇస్తున్నాం. తెలుగువారికి, ఆంధ్రప్రదేశ్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌లైన కళలు, సంస్కృతికి ఈ అవార్డుల్లో పెద్దపీట వేశాం. ఒక డప్పు కళాకారుడికి, ఒక తోలుబొమ్మలాటకు, పొందూరు ఖాదీకి, జానపద గీతానికి, బొబ్బిలి వీణకు, రంగస్థల పద్యానికి, థింసా నృత్యానికి, సురభి నాటకానికి, సవర చిత్రకళకు, వీధి నాటకానికి, హరికథకు, బుర్రకథకు, వెంకటగిరి జాంధానీ చీరకు, మనదైన కలంకారీకి, చెక్కమీద చెక్కే శిల్పానికి, నాదస్వరానికీ, మనదైన కూచిపూడికి ఇస్తున్న అవార్డులు ఇవి. వందేళ్ల చరిత్ర ఉన్న ఎంఎస్‌ఎన్‌ ఛారిటీస్, సీపీ బ్రౌన్‌ లైబ్రరీ, వేటపాలెం గ్రంథాలయం, ఆర్డీటీ సంస్థ, సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌.. ఇలాంటి గొప్ప సంస్థలు చేస్తున్న సేవలకు ఇస్తున్న అవార్డులు ఇవి.

పండించే రైతన్నకు మనదైన వ్యవసాయానికి, ఉద్యానవన ఉద్యమానికి, వ్యవసాయ అనుబంధ రంగాల్లో వస్తున్న విప్లవానికి ఇస్తున్న అవార్డులు ఇవి. కలం యోధులైన కవులకు, స్త్రీవాద ఉద్యమానికి, సామాజిక స్పృహను మేల్కొల్పడంలో మేరుపర్వత సమానులైన రచయితలకు, విశ్లేషక పాత్రికేయులకు ఇస్తున్న అవార్డులు ఇవి. కోవిడ్‌ సమయంలో అయినవారే దగ్గరకు రాని పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో అన్నీ తామై వారాలు, నెలలు పాటు కుటుంబాలకు దూరమై ప్రాణాలకు తెగించి అసామాన్యమైన సేవలందించిన మానవతామూర్తులకు ఈ అవార్డులు ఇస్తున్నాం. మీ అందరి కుటుంబ సభ్యుడిగా, మీవాడిగా తెలుగుజాతి మాణిక్యాలను, మకుటాలను, మహానుభావుల్ని ఈ రకంగా సత్కరించడాన్ని దేవుడు నాకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నా.

విశిష్ట సేవలు.. ప్రతిభకు గుర్తింపు 
– గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌
వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులు, సంస్థల సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ అవార్డులను ప్రదానం చేయడం సంతోషదాయకమని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి రైతులు, పేదల కోసం విశేషంగా కృషి చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఆ మహానేత మహోన్నత వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ ఆయన పేరిట ఏటా అవార్డులను అందించాలన్న నిర్ణయం సామాజిక, కళ, సాంస్కృతిక రంగాలకు ప్రోత్సాహానిస్తుందని చెప్పారు. సామాజిక, సేవా, సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేస్తూ కూడా ఎలాంటి గుర్తింపునకు నోచుకోనివారిని ఎంపిక చేసి అవార్డులు ప్రదానం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఓ మంచి ఒరవడిని సృష్టించిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్దేశించిన అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ అవార్డులకు ఎంపిక చేయడం ముదావహమన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణంతో ఏర్పడ్డ రాష్ట్ర అవతవరణ దినోత్సవం రోజు ఏటా వైఎస్సార్‌ అవార్డులను ఇవ్వడం సముచిత నిర్ణయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

తొమ్మిది సంస్థలకు పురస్కారం
వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహోన్నత వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులను ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతల్లో 9 సంస్థలు ఉండగా వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన వారు 11 మంది ఉన్నారు. కళలు, సంస్కృతి రంగాల నుంచి 20 మంది, సాహిత్యరంగంలో ఏడుగురు, పాత్రికేయ రంగానికి చెందినవారు ఆరుగురు, కోవిడ్‌ సేవలు అందించిన ఆరుగురు ప్రభుత్వ వైద్యాధికారులు/సిబ్బంది అవార్డులకు ఎంపికయ్యారు. మరణించిన ఐదుగురు అవార్డు గ్రహీతల తరపున వారి కుటుంబ సభ్యులు అవార్డులను స్వీకరించారు. అనివార్య కారణాలతో పాత్రికేయ దిగ్గజం ఏబీకే ప్రసాద్‌ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో తరువాత ప్రత్యేకంగా అవార్డు అందించాలని నిర్ణయించారు.

ప్రముఖ రచయిత్రి ఓల్గా తరపున ఆమె కుమార్తె అవార్డు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్, నారాయణస్వామి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కన్నబాబు, ఆదిమూలపు సురేశ్, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎం.శంకర్‌ నారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తానేటి వనిత, జి.జయరాం, ప్రభుత్వ కార్యక్రమాల కన్వీనర్‌ తలశిల రఘురాం, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, ముఖ్యమంత్రి మీడియా సలహాదారు, వైఎస్సార్‌ అవార్డుల కమిటీ కన్వీనర్‌ జీవీడీ కృష్ణమోహన్, తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ప్రశంసలందుకున్న సీఎం జగన్‌ వినమ్రత

వీల్‌ చెయిర్‌లో ఉన్న కత్తి పద్మారావు నిలుచునేందుకు సహాయం చేస్తున్న సీఎం జగన్‌   

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని తరచూ చెప్పే మాటను సీఎం వైఎస్‌ జగన్‌ ఆచరణలో మరోసారి నిరూపించారు. ముఖ్యమంత్రి అనే భేషజం, హోదాను ఏమాత్రం ప్రదర్శించకుండా తన వినమ్రతను చాటుకున్నారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన ‘వైఎస్సార్‌’ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమ వేదికపై సాక్షాత్కరించిన ఆ దృశ్యం అందరి ప్రశంసలు అందుకుంది. ప్రముఖ అభ్యుదయ కవి కత్తి పద్మారావు ఇటీవల అనారోగ్యం బారినపడటంతో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి వీల్‌ చెయిర్‌లో వచ్చారు. సహాయకులు ఆయన్ను వీల్‌ చెయిర్‌లో వేదిక మీదకు తీసుకొస్తున్న దృశ్యాన్ని దూరం నుంచి చూడగానే సీఎం జగన్‌ లేచి ముందుకు వచ్చి సాదరంగా ఆహ్వానించారు. వీల్‌ చెయిర్‌ ఫుట్‌ రెస్ట్‌ మీద ఉన్న కత్తి పద్మారావు కాలును సీఎం జగన్‌ స్వయంగా పట్టుకుని ఫుట్‌ రెస్ట్‌ నుంచి పక్కకు జరిపి నేలపై ఉంచారు. ఆయన చేతులు పట్టుకుని నిల్చునేందుకు ఆసరా అందించారు. వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు ప్రదానం చేసిన తరువాత కత్తి పద్మారావు తిరిగి వీల్‌ చెయిర్‌లో కూర్చునేందుకు సాయం చేశారు. ఆయన కాళ్లను వీల్‌ చెయిర్‌ ఫుట్‌ రెస్ట్‌ మీద ఉంచి సరి చేశారు. కత్తి పద్మారావుపట్ల గౌరవంతో, వాత్సల్యంతో ముఖ్యమంత్రి స్పందించిన తీరు సర్వత్రా ప్రశంసలు అందుకుంది. ఆ వీడియో క్లిప్, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.    

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/cm-ys-jagan-mohan-reddy-ysr-lifetime-achievement-awards-2021-ceremony