ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయిలు

  • రెండేళ్లలో రాష్ట్రంలో ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయి: మంత్రి పెద్దిరెడ్డి
  • ఆర్‌డబ్ల్యూఎస్‌ హ్యాండ్‌ బుక్‌ ఆవిష్కరణ

  రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ భవిష్యత్తులో ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేసే పరిస్థితి ఉండదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయి కనెక్షన్‌ సదుపాయాన్ని కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ కార్యక్రమాలపై మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన  మంగళవారం 13 జిల్లాల అధికారులతో వర్క్‌షాప్‌ జరిగింది. ఈ సందర్భంగా ఆర్‌డబ్ల్యూఎస్‌ టెక్నికల్‌ హ్యాండ్‌ బుక్‌ను మంత్రి  ఆవిష్కరించారు. గత ఏడాది ట్యాంకర్ల ద్వారా నీరు అందించిన ప్రాంతాల్లో ఇప్పటికే మొదలైన తాగునీటి పథకాల పనులను వచ్చే వేసవి కంటే ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 47 శాతం ఇళ్లకు మంచినీటి కుళాయి వసతి ఉందని, రెండేళ్లలో అన్ని ఇళ్లకు కుళాయి వసతి కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. రెండేళ్లలో మిగిలిన అన్ని ఇళ్లకు కుళాయి వసతి లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. ఈ ఏడాది జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా రూ.7,251.72 కోట్ల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినా అధికారులు ప్రణాళికలు రూ పొం దించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

  9 జిల్లాల్లో వాటర్‌ గ్రిడ్‌ పనులు..
  వాటర్‌గ్రిడ్‌ ద్వారా తాగునీటి కల్పనకు తొమ్మిది జిల్లాల్లో ప్రభుత్వం పనులు చేపడుతున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో రూ.700 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ కింద పనులు జరుగుతున్నాయని చెప్పారు. వైఎస్సార్‌ కడప, కర్నూలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, తూర్పు, పశ్చిమ గోదావరి  జిలాల్లో ఈ పనులున్నా యని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,772 కాలనీ లకు నీటి సదుపాయం కల్పించినట్లు చెప్పారు. వర్క్‌షాప్‌లో పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఎన్‌సీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

  Source: http://pressacademy/wp-admin/post.php?post=6261&action=edit