ప్రతి జగనన్న కాలనీకి నోడల్‌ అధికారి నియామకం

    ఆంధ్రప్రదేశ్‌లో అందరికీ అన్ని సదుపాయాలతో కూడిన ఇల్లు ఉండాలన్నదే సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యమని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. గురువారం ఆయన విశాఖ జిల్లాలో జగనన్న కాలనీల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం నక్కపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మంజూరు ఉత్తర్వులతోపాటు నిధులను, మెటీరియల్‌ను కూడా ఇస్తున్నట్లు వివరించారు.

    జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ బాధ్యతలను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రతి కాలనీకి మండల స్థాయి అధికారిని నోడల్‌ అధికారిగా నియమించాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించారన్నారు. లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చిన లేఅవుట్‌లలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఒక్కో లబ్ధిదారునికి సుమారు రూ.30 వేల విలువైన ఇసుకను  ప్రభుత్వమే ఇస్తుందని చెప్పారు. కార్యక్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తదితరులు పాల్గొన్నారు. 

    Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/appointment-nodal-officer-each-jagananna-colony-1388975