ప్రభుత్వ సేవల అవగాహన కోసం సిటిజన్, బెనిఫిషరీ ఔట్‌ రీచ్‌

  • శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న కమిషనర్‌ రామారావు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు
  • ప్రజల ఇంటికి ప్రభుత్వ ఉద్యోగులు
  • సచివాలయ ఉద్యోగి, ముగ్గురు వలంటీర్లతో బృందాల ఏర్పాటు 
  • గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందుతున్న సేవలపై ఆరా 
  • ‘సిటిజన్, బెనిఫిషరీ ఔట్‌ రీచ్‌’ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం  
  • ప్రతి నెలా ఆఖరి శుక్ర, శనివారాల్లో కొనసాగింపు 
  • శుక్రవారం 40.55 లక్షల కుటుంబాలను కలిసి ప్రభుత్వ సేవలపై అవగాహన కల్పించిన బృందాలు

ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఊళ్లలోనూ సచివాలయాల బృందాలు ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లి సమస్యలపై వాకబు చేశాయి. ప్రభుత్వ సేవలను మరింతగా ప్రజల ముంగిటకు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి నెలా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్లు, రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు ప్రభుత్వ సేవలు పొందడంలో ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారా.. అని తెలుసుకోవడం కోసం ‘సిటిజన్, బెనిఫిషరీ ఔట్‌ రీచ్‌’ (ప్రభుత్వ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించడం) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్ల ఆధ్వర్వంలో ఏర్పాటు చేసిన బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా 44.55 లక్షల కుటుంబాలను కలిశాయి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వారి సొంత గ్రామంలో అందిస్తున్న సేవల గురించి వివరించాయి. సేవలు పొందడంలో ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నాయి. సాయంత్రం వరకు అందిన సమాచారం మేరకు గ్రామీణ ప్రాంతాల్లో 22.28 లక్షల కుటుంబాలను, పట్టణ ప్రాంతాల్లో 18.27 లక్షల కుటుంబాలను సచివాలయ ఉద్యోగుల బృందాలు కలిసి అభిప్రాయాలు సేకరించాయి. శనివారం కూడా ఈ కార్యక్రమం కొనసాగనుంది.  

ఒక్కో బృందం వంద ఇళ్లకు.. 
ప్రతి నెలా ఆఖరి శుక్ర, శనివారాల్లో అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఒక్కో ప్రభుత్వ ఉద్యోగి, మరో ముగ్గురు వలంటీర్లను ఒక్కో బృందంగా ఏర్పాటు చేశారు. ఈ బృందం గ్రామం/వార్డులోని కనీసం వంద కుటుంబాలను కలిసి వారికి ప్రభుత్వం ద్వారా అందుతున్న సేవల గురించి వివరాలు సేకరిస్తోంది. ఆగస్టు నెలలో కేవలం పట్టణ ప్రాంతాలలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. ఈ నెల నుంచి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి కొనసాగిస్తోంది. ఇక ప్రతి నెలా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందని గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు వెల్లడించారు. 

ఉద్యోగుల ఫోన్‌ నంబర్ల కరపత్రాలు పంపిణీ  
రాష్ట్ర ప్రభుత్వ కాల్‌ సెంటర్‌ ఫోను నంబర్‌తో పాటు సంబంధిత గ్రామ, వార్డు సచివాలయంలో పని చేసే ఉద్యోగుల ఫోన్‌ నంబర్ల వివరాలు, ఆ ప్రాంత వలంటీరు ఫోను నంబరు ముద్రించిన కరపత్రాలను కూడా పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ సేవలకు సంబంధించి ఎలాంటి సమాచారమైన ఆయా నంబర్లకు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చని బృందం సభ్యులు ప్రజలకు వివరిస్తున్నారు. 

‘సిటిజన్, బెనిఫిషరీ ఔట్‌ రీచ్‌’లో ప్రధాన వివరాలు ఇలా..   
►  గ్రామ/వార్డు సచివాలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా?  
► మీ గ్రామ/వార్డు వలంటీర్‌ మీకు తెలుసా? 
► మీ వలంటీర్‌ ఎన్ని రోజులకొకసారి మీ ఇంటికి వస్తున్నారు?  

► మీకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి తెలుసా? (ఈ ప్రశ్న తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి చెబుతారు) 

►సచివాలయంలో ఏయే సేవలు అందిస్తున్నారో మీకు తెలుసా?  

► ‘సచివాలయం’ ద్వారా సేవలు పొందే విషయంలో మీరు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? 

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/citizen-and-beneficiary-outreach-program-govt-services-ap-1398456