సీబీఎస్‌ఈ విద్యా విధానంపై టీచర్లకు శిక్షణ

  • నూతన విధానంపై టీచర్లకు నేటినుంచి ఆన్‌లైన్‌ శిక్షణ
  • 90 వేల మంది టీచర్ల భాగస్వామ్యం
  • విద్యార్థుల కోసం సిద్ధమైన పాఠ్య పుస్తకాలు

  రాష్ట్ర విద్యారంగంలో సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం‘మన బడి–నాడు నేడు’ కింద పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. పాఠశాలలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతూ.. సంస్కరణలు సత్ఫలితాలిచ్చేలా కార్యాచరణ దిశగా అడుగులేస్తోంది. పాఠశాల విద్యలో దశల వారీగా సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆ పద్ధతుల్లో బోధన చేసేలా ఉపాధ్యాయులనూ సిద్ధం చేయిస్తోంది.

  ఇందులో భాగంగా విద్యార్థులలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన సామర్థ్యాలను మెరుగుపర్చేలా సీబీఎస్‌ఈ పాఠ్యాంశాల బోధనపై ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు సీబీఎస్‌ఈ బోధన కొనసాగించడంతో పాటు మూల్యాంకన రీతులను అనుసరించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

  సీమ్యాచ్‌ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు
  ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు నిరంతర వృత్తిపరమైన అభివృద్ధిలో భాగంగా ‘స్టేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌’ (సీమ్యాట్‌) ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న దాదాపు 90 వేల మంది టీచర్లను ఈ శిక్షణలో భాగస్వాములను చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ విధానాన్ని అమలు చేయాలని సంకల్పించిన నేపథ్యంలో ఆంగ్ల మాధ్యమంలోనూ బోధన చేసేలా ఉపాధ్యాయులకు తర్ఫీదు ఇస్తారు.

  తద్వారా విద్యార్థులకు ఉత్తమ పరిజ్ఞానం అందించి వారి సామర్థ్యాలను మరింత మెరుగుపర్చాలని సర్కారు నిర్ణయించింది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సీబీఎస్‌ఈ బోధనా విధానం (టీచింగ్‌ మెథడాలజీ), మూల్యాంకన పద్ధతులపై తర్ఫీదు ఇస్తారు. కరోనా నేపథ్యంలో దీక్షా డిజిటల్‌ వేదిక ద్వారా ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. సోమవారం నుంచి జూలై 3వ తేదీ వరకు కొనసాగే శిక్షణ కార్యక్రమంపై ఉపాధ్యాయులకు సూచనలు జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ డీఈవోలకు, సమగ్ర శిక్ష అడిషనల్‌ ప్రాజెక్ట్‌ కో–ఆర్డినేటర్లకు ఆదేశాలు జారీ చేసింది.

  శిక్షణ ముఖ్యోద్దేశాలివీ..
   ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల కోసం 1–6వ తరగతి వరకు పుస్తకాలను ఆంగ్ల, తెలుగు మాధ్యమాల్లో ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. నూతన పాఠ్య పుస్తకాల నేపథ్య పరిజ్ఞానం, కార్యాచరణ ఆధారిత, ప్రయోగాత్మక అభ్యసనాలతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన పాఠ్య పుస్తకాల్లోని పాఠ్యాంశాలను లక్ష్యాలను సాధించేలా సీబీఎస్‌ఈ విధానంలో బోధన చేసేలా ఉపాధ్యాయులను తీర్చిదిద్దనున్నారు.

  అభ్యసన ఫలితాలు సాధించడంపై  కంటెంట్‌ అనాలసిస్‌తోపాటు సృజనాత్మక రీతుల్లో బోధనాభ్యసన విధానాలను అనుసరించేలా తర్ఫీదునిస్తారు. మూల్యాంకన విధానాలు, సాధనాలు, మూల్యాంకన ప్రాసెస్‌లపై శిక్షణ ఇస్తారు. సీబీఎస్‌ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణమైన సామర్థ్యాలతో విద్యార్థులకు బోధన చేసేలా శిక్షణ ఇస్తారు. తెలుగు మాధ్యమంలో బోధన చేస్తున్న ఉపాధ్యాయులకు సీబీఎస్‌ఈ విధానంలో ఆంగ్ల మాధ్యమ బోధనా పద్ధతులపై శిక్షణ ఇస్తారు.

  శిక్షణ ఇలా..
  ► ఉపాధ్యాయులకు ప్రాథమిక స్థాయిలో ఇంగ్లిష్, మేథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్‌ సైన్స్‌ బోధనపై శిక్షణ ఉంటుంది.
  ► దీక్షా ప్లాట్‌ఫారం ద్వారా నిర్వహించే ఈ కోర్సు నిడివి 12 గంటలు. ఆన్‌లైన్‌లో రోజుకు గంట చొప్పున మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు 12 రోజుల పాటు దీనిని నిర్వహిస్తారు.
  ► ఎన్‌సీఈఆర్‌టీ–న్యూఢిల్లీ, రీజనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (ఆర్‌ఐఈ), మైసూర్‌కు చెందిన ప్రొఫెసర్లు, కేంద్రియ విద్యాలయాల బోధనా సిబ్బంది రిసోర్సు పర్సన్లుగా వ్యవహరిస్తున్నారు.

  ఇదీ షెడ్యూల్‌
  ఇంగ్లిష్‌: జూన్‌ 21 నుంచి 24వ తేదీ వరకు, మేథమెటిక్స్‌: జూన్‌ 25 నుంచి 29వ తేదీ వరకు, ఈవీఎస్‌: జూన్‌ 30 నుంచి జూలై 3వ తేదీ వరకు.

  నూతన పాఠ్య పుస్తకాలు రెడీ..
  2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి పంపిణీకి సిద్ధమైన నూతన పాఠ్య పుస్తకాలు సంఖ్య
  తరగతి    పాఠ్య పుస్తకాల సంఖ్య
  1వ తరగతి    29,10,424
  2వ తరగతి    30,96,822
  3వ తరగతి    39,46,165
  4వ తరగతి    39,40,938
  5వ తరగతి    38,68,931
  6వ తరగతి    35,38,818
  7వ తరగతి    36,43,742
  8వ తరగతి    41,19,992
  9వ తరగతి    39,58,521
  10వ తరగతి    37,93,110 

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/cbse-andhra-pradesh-primary-schools-1372701