ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు ప్రోత్సాహం

  • నూజివీడులోని గోర్‌మే పాప్‌కార్నిక ప్రాసెసింగ్‌ కంపెనీని పరిశీలిస్తున్న పూనం మాలకొండయ్య
  • నూజివీడులో మ్యాంగో ప్రాసెసింగ్‌ యూనిట్‌
  • వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య 

  రాష్ట్రంలో ఫుడ్‌ప్రాసెసింగ్‌ పరిశ్రమలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య పేర్కొన్నారు. నూజివీడు ఆటోనగర్‌లో ఉన్న గోర్‌మే పాప్‌కార్నిక ప్రాసెసింగ్‌ కంపెనీని బుధవారం ఆమె పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. నూజివీడులో మ్యాంగో ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

  మొక్కజొన్న, మామిడి, మిర్చి, నిమ్మ, అరటి, టమోట, జీడిపప్పు తదితర వాటికి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పినట్లయితే రైతులకు లాభసాటిగా ఉంటుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీని తీసుకొచ్చిందని, దీనిలో భాగంగా ప్రతి రైతుభరోసా కేంద్రం వద్ద ప్రైమరీ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలని భావిస్తుందని తెలిపారు.  వ్యవసాయశాఖ కమిషనర్‌ కార్యాలయం జాయింట్‌ డైరెక్టర్‌ వీడీవీ కృపాదాస్, కృష్ణా జిల్లా వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ టి.మోహన్‌రావు, ఉద్యానవనశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రవికుమార్, నూజివీడు ఏడీఏ కవిత తదితరులు పాల్గొన్నారు.  

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/encouragement-food-processing-industries-andhra-pradesh-1373404