ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లతో రైతులకు మేలు

    వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు  

    రైతులకు మేలు చేయడానికి రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో మొత్తం రూ.2,600 కోట్ల వ్యయంతో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. కృష్ణా జిల్లా నూజివీడులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లలో ఆధునిక యంత్రాలు ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులోకి తెస్తామన్నారు.

    ఈ యూనిట్ల వల్ల పంటలకు మద్దతు ధర లభిస్తుందన్నారు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటికి అనుబంధంగా కస్టమర్‌ హైరింగ్‌ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. అలాగే ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా గోడౌన్లను సైతం నిర్మిస్తున్నామని చెప్పారు. నాణ్యమైన పరికరాలను రైతులకు తక్కువ ధరకే అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పండ్ల తోటల విస్తీర్ణం పెంచేందుకు రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు.  

    Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/kurasala-kannababu-says-beneficial-farmers-food-processing-units-1374693