బడుగు జీవులకు ఆరోగ్య భరోసా

  • బడుగులకు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం  
  • వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీతో వేలాదిమందికి పునర్జన్మ
  • వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన పథకాన్ని మరింత  బలోపేతం చేసిన  సీఎం  జగన్‌మోహన్‌రెడ్డి  
  • కోవిడ్‌ వేళ ఆదుకున్న ఆరోగ్యశ్రీ, 108 సేవలు  
  • ఈ నెల 8న  వైఎస్సార్‌ జయంతి సందర్భంగా ఆయన పాలనను  తలచుకుంటున్న జనం   

  పేదవాడికి సుస్తీ చేస్తే బంగారం, ఇల్లు, భూమి తాకట్టుపెట్టి వైద్యం పొందే రోజుల్లో.. నేనున్నానంటూ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకానికి అంకురార్పణ చేశారు. ఆరోగ్య భరోసా కల్పించారు. పైసా ఖర్చు లేకుండా పేదలకు కార్పొరేట్‌ వైద్యాన్ని చేరువచేశారు. వేలాది మందికి పునర్జన్మ కల్పించారు. ఆయన మరణానంతరం వచ్చిన పాలకులు పథకంపై సవతితల్లి ప్రేమ చూపారు. పేదల్లో వైద్య భయాందోళనలు కలిగించారు. ప్రస్తుత సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి తండ్రి ఆశయాలను కొనసాగిస్తూనే ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేశారు. ఈ నెల 8న నిర్వహించే వైఎస్సార్‌ జయంతిని పురస్కరించుకుని తండ్రీతనయుల ప్రజారోగ్య పాలనను జనం గుర్తుచేసుకుంటున్నారు.

  కార్పొరేట్‌ ఆస్పత్రుల వైపు చూడడానికే పేద, మధ్య తరగతి ప్రజలు భయపడే రోజులవి. ఆరోగ్యం పాడైతే మంచానికే పరిమితమై కాలం చేయాల్సిన దుస్థితి. వీటిని పాదయాత్రలో కళ్లారా చూసిన దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి… ప్రతీ పేదవాడికి కార్పొరేట్‌ వైద్యం ఉచితంగా అందించాలని తలచారు. అధికారంలోకి వచ్చాక 2007లో ఆరోగ్యశ్రీ పథకానికి అంకురార్పణ చేశారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు కార్పొరేట్‌ ఆస్పత్రుల నిర్వాహకులు పేదలకు ఎదురొచ్చి మా ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవాలంటూ స్వాగతం పలికే పరిస్థితులను సృష్టించారు. క్యాన్సర్, కిడ్నీవ్యాధులు, గుండె సంబంధిత రోగులు గుండెమీద చెయ్యివేసుకుని జీవించేలా వైద్య భరోసా కల్పించారు. ఇప్పుడు వైఎస్సార్‌ తనయుడు ప్రస్తుత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేశారు. మరిన్ని జబ్బులను పథకంలో చేర్చి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. వాటితో పాటు ఆరోగ్య ఆసరా పేరిట రోగులు కోలుకునేవరకు ఆర్థిక భృతిని అందజేస్తున్నారు.   

  అపర సంజీవిని 108…  
  ఆరోగ్యశ్రీవలే ఆపదవేళ అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైఎస్సార్‌ 108 సేవలను అందుబాటులోకి తెచ్చారు. ప్రమాదంలో చిక్కుకున్నామని ఫోన్‌ చేసిన 15–20 నిమిషాల్లో కుయ్‌కుయ్‌ అంటూ సంఘటనా స్థలానికి 108 వచ్చి క్షణాల్లో ఆస్పత్రికి చేర్చుతోంది. వాహన సేవలతో చాలా వరకు ప్రమాద మరణాలు తగ్గాయి. జిల్లాలో 108 అంబులెన్సులు 36 ఉన్నాయి. వీటిలో 2 నియోనేటల్‌ అంబులెన్సులు, 24 బేసిక్‌ లైఫ్‌ సపోర్ట్‌ వెహికల్స్‌ ఉన్నాయి. జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం అయ్యాక నవజాత శిశువుల కోసం ప్రత్యేకంగా నియోనేటల్‌ అంబులెన్సులను అందుబాటులోకి తెచ్చారు. 

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/poor-people-benefit-arogyasri-scheme-1376857