బాలల ఆరోగ్యానికి భరోసాగా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి

  • తిరుపతిలో శ్రీ పద్మావతి చిన్న పిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం
  • నేడు సీఎం జగన్‌చే శంకుస్థాపన
  • రూ.300 కోట్లతో 350 పడకలతో అత్యాధునిక ఆస్పత్రి
  • అవయవాల మార్పిడికీ అవకాశం
  • ఆస్పత్రిపైన హెలీప్యాడ్‌ సౌకర్యం
  • 18 నెలల్లో ఆస్పత్రిని అందుబాటులోకి తేవాలని లక్ష్యం  

చిత్తూరు జిల్లా కుప్పం మండలం లక్ష్మీపురానికి చెందిన ఈ చిన్నారి హర్షిత్‌కు రెండేళ్లు. పుట్టకతోనే గుండె సమస్యలున్నాయి. తల్లిదండ్రులు అనేక ఆస్పపత్రుల్లో చూపించారు. గుండెకు ఆపరేషన్‌ చేయాలని, రూ.లక్షల్లో ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. అంత ఖర్చుపెట్టే స్తోమత లేని తల్లిదండ్రులు గతేడాది నవంబర్‌లో తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయానికి వచ్చారు. హర్షిత్‌ గుండెకు వెళ్లే మంచి రక్తం, చెడు రక్తం కలిసిపోతున్నట్టు వైద్యులు గుర్తించారు. ఇక్కడ ఉచితంగా ఆపరేషన్‌ చేసి సమస్యను పరిష్కరించారు.

► అనంతపురం జిల్లా ఎం.ఎన్‌.పి తండాకు చెందిన చిన్నారి బాలచంద్ర నాయక్‌కు మూడేళ్లు. చంద్ర నాయక్‌కు పుట్టుకతోనే గుండె సమస్యలున్నాయి. నిరుపేద కుటుంబం. పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంలో ఉచితంగా గుండె చికిత్సలు చేస్తున్నారని తల్లిదండ్రులు తెలుసుకున్నారు. గత ఏడాది చంద్రనాయక్‌ను ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు ఓపెన్‌ హార్ట్‌ (ఇంట్రా కార్డియాక్‌ రిపేర్‌) సర్జరీ చేశారు.  ప్రస్తుతం చంద్రనాయక్‌ ఆరోగ్యంగా ఉన్నాడు. 

వీళ్లిద్దరే కాదు.. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వేలాది పిల్లల ఆరోగ్యానికి భరోసానిస్తోంది శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం. ఇప్పుడీ ఆస్పత్రి సేవలు విస్తరించనున్నాయి. శ్రీ పద్మావతి చిన్న పిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా రూపాంతరం చెందుతోంది. బాలలకు గుండె సంబంధిత చికిత్సలతో పాటు, అన్ని రకాల సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే దేశంలోనే అతిపెద్ద ఆస్పత్రిగా రూపు దిద్దుకుంటోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలోని అలిపిరి వద్ద దీనిని నిర్మిస్తున్నారు. రూ.300 కోట్లతో 350 పడకలతో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. ఈ ఆస్పత్రికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం శంకుస్థాపన చేయనున్నారు. ఆస్పత్రి కోసం 6 ఎకరాల్లో జీ+6 భవనాన్ని నిర్మిస్తారు. భవన నిర్మాణానికి రూ.240 కోట్లు ఖర్చవుతుందని అంచనా. రూ.60 కోట్లతో అధునాతన వైద్య పరికరాలు, ఇతర వసతులు సమకూరుస్తారు. 18 నెలల్లో భవన నిర్మాణం పూర్తి చేసేలా టీటీడీ ప్రణాళిక రూపొందించింది. 

ఆస్పత్రిపైనే హెలీప్యాడ్‌ 
గుండె, కాలేయం, కిడ్నీలకు సంబంధించిన తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి అవయవాలు ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయాలి. ఇతర ప్రాంతాల నుంచి అవయవాలను ఇక్కడికి తరలించాల్సి వస్తుంది. అవయవాల తరలింపు ఆలస్యం అవకుండా ఆస్పత్రి భవనంపైనే ఎయిర్‌ అంబులెన్స్‌ దిగేలా హెలీప్యాడ్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సౌకర్యం దేశంలో అతి తక్కువ ఆస్పత్రుల్లో మాత్రమే ఉంది. అందుబాటులోకి వచ్చే సేవలు ఈ ఆస్పత్రిలో హెమటో అంకాలజీ, మెడికల్‌ అంకాలజి, సర్జికల్‌ అంకాలజీ, న్యూరాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలాజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ లాంటి 15 రకాల ప్రత్యేక విభాగాల్లో చిన్నారులకు వైద్య సేవలు అందిస్తారు. అత్యంత ఖరీదైన బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్, గుండె, ఇతర అవయవాల మార్పిడి ఉచితంగా చేస్తారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఇలాంటి ఆస్పత్రి దేశంలోనే మొదటిది కాబోతుంది.  

2,020 మందికిపైగా చిన్నారులకు పునర్జన్మ 
గత ఏడాది అక్టోబర్‌ 11న పద్మావతి చిన్న పిల్లల హృదయాలయాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. 70 పడకలతో ఈ ఆస్పత్రిని చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 12 మంది స్పెషలిస్ట్‌ వైద్యులు పనిచేస్తున్నారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకం కింద ఇక్కడ ఇప్పటివరకు 2,020 మందికి పైగా చిన్నారులకు ఓపెన్‌ హార్ట్, కీ హోల్‌ సర్జరీలు చేశారు.  

ఉచితంగా అత్యాధునిక వైద్యం 
పద్మావతి చిన్న పిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ద్వారా నిరుపేద, మధ్య తరగతి పిల్లలకు అత్యాధునిక వైద్యం ఉచితంగా అందుతుంది. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకం కింద ఇక్కడ వైద్య సేవలు అందుతాయి. 15 రకాల సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయి. వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవస్థలు తప్పుతాయి.   
 – డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి, శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం 

పిల్లలకు వైద్య సేవలపై సీఎం ప్రత్యేక దృష్టి 
రాష్ట్ర విభజనకు ముందు పిల్లల కోసం హైదరాబాద్‌లో నీలోఫర్‌ ఆస్పత్రి ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత చిన్న పిల్లల కోసం రాష్ట్రంలో ప్రత్యేకంగా ఆస్పత్రి లేకుండాపోయింది. దీంతో పీడియాట్రిక్‌ సూపర్‌ స్పెషాలిటీ సేవల కోసం ప్రైవేటు ఆస్పత్రులపై ఆధారపడే పరిస్థితి. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక అన్ని రకాల వైద్య సదుపాయాలను పేద కుటుంబాల పిల్లలకు అందుబాటులోకి తీసుకురావడంపై సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేకంగా దృష్టిపెట్టారు.  ఇందులో భాగంగా తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో చిన్న పిల్లల కోసం సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ చొరవతో తిరుపతిలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ప్రారంభమవుతోంది.విజయవాడ, విశాఖపట్నంలలోనూ పిల్లల ఆస్పత్రుల నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. అత్యాధునిక లేబొరేటరీ, ఆపరేషన్‌ థియేటర్లు, ఐసీయూ విభాగాలతో అత్యాధునిక ఆస్పత్రులు నిర్మించాలని భావిస్తోంది. ఇందుకోసం ఒక్కో ఆస్పత్రికి రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.

Source:https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/cm-ys-jagan-launch-childrens-hospital-construction-tirupati-1453794