ఇంటికే రేషన్ బియ్యం డోర్ డెలివరీ

అర్హులందరికీ రేషన్‌ బియ్యం అందించాలన్న ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టడంతో రాష్ట్రంలో లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగింది. పేదలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రేషన్‌ కార్డుల స్థానంలో బియ్యం కార్డులను అమల్లోకి తీసుకొచ్చింది. తినగలిగే నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తే పేదలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని భావించిన ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకుంటోంది. జనవరి నుండి లబ్ధిదారులకు వారి ఇళ్లవద్దే నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తుంది.

అర్హతలు:

కుటుంబ నెలసరి ఆదాయము:

  • గ్రామీణ ప్రాంతాలలో రూ. 10,000/- లోపు పట్టణ ప్రాంతాలలో రూ. 12,000/- లోపు ఉన్నవారు అర్హులు.
  • సంబంధిత కుటుంబమునకు మాగాణి భూమి 3 ఎకరాలు లేదా మెట్టభూమి 10 ఎకరాలు లేదా రెండూ కలిపి 10ఎకరాలు మించకుండా ఉండవలెను.
  • కుటుంబం ప్రస్తుతం నివసిస్తున్న గృహం ( స్వంతం | అద్దె) యొక్క నెలవారీ విద్యుత్తు వినియోగము బిల్లు 300 యూనిట్లు మించరాదు. (గత ఆరు నెలల విద్యుత్తు వినియోగము బిల్లులు సగటు 300 యూనిట్లు లేదా అంతకంటే తక్కువ ఉండవలెను).
  • పట్టణ ప్రాంతాలలో 1000 చదరపు అడుగులు స్థలము అంతకన్నా తక్కువ విస్తీర్ణములో ఇల్లు ఉన్నవారే అర్హులు.
  • కుటుంబ సభ్యులలో ఎవరికి 4 చక్రాల వాహనం కలిగి ఉండరాదు (టాక్సీ, ట్రాక్టర్, ఆటోలకు మినహాయింపు).
  • కుటుంబ సభ్యులలో ఆదాయపన్ను చెల్లింపుదారులు మరియు ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పింఛను దారులు ఉన్నచో బియ్యం కార్డు పొందుటకు అనర్హులు (అన్ని శాఖలలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు మినహాయింపు).

అర్హులై వుండి ఇంకనూ బియ్యం కార్డు పొందనివారు దరఖాస్తు చేసుకొనే విధానము:

  • అర్హత కల్గిన కుటుంబము తమ కుటుంబ సభ్యుల వివరాలతో ఆధార్ కార్డుల నకలు, కుటుంబ ఆదాయ వివరాలను జతచేసిన నిర్ణీత దరఖాస్తును నేరుగా గ్రామ/వార్డు సచివాలయాలలో గానీ లేదా గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా గానీ దరఖాస్తు చేసుకోవచ్చును.
  • అర్హులైన దరఖాస్తుదారునికి YSR (Your Service Request – మీ సేవల అభ్యర్ధన) నెంబర్ ఇవ్వబడుతుంది. ఈ పర్యాదుల కొరకు టోల్ ఫ్రీ నెంబర్ 1902
  • దరఖాస్తు చేసిన 10 పని దినములలో అర్హులైన దరఖాస్తుదారునికి బియ్యం కార్డు కేటాయించబడుతుంది.

లభ్ధిదారులకు కావాల్సిన సలహాలు, సూచనలు మరియు ఫిర్యాదుల కోసం ఉచితంగా కాల్ చేయాల్సిన టోల్-ఫ్రీ నంబర్ 1902