భారీ ఎత్తున గృహాల నిర్మాణం

  • దేశ చరిత్రలోనే ఇంత భారీ ఎత్తున గృహాల నిర్మాణం ఇదే ప్రథమం
  • రూ.28,084 కోట్లతో మొదటి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం
  • వచ్చే ఏడాది జూన్‌ నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యం
  • రెండో దశలో రూ.22,860 కోట్లతో మరో 12.70 లక్షల గృహాల నిర్మాణం
  • 2023 నాటికి ’నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ హామీ పూర్తి
  • తొలి దశలో 8,905.. రెండో దశలో 8,100 వైఎస్సార్‌ జగనన్న కాలనీల నిర్మాణం.. ఏకంగా 17,005 ఊళ్లను నిర్మిస్తున్న ప్రభుత్వం
  • రూ.32,909 కోట్లతో అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పన 
  • ఇళ్ల నిర్మాణం వల్ల 21.70 కోట్ల పని దినాల కల్పన 
  • తాపీ మేస్త్రీలు, రాడ్‌ బెండర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లకు చేతినిండా పని
  • కరోనాతో కుదేలైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు నూతన జవసత్వాలు 

  రాష్ట్రంలో లక్షలాది మంది పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో శరవేగంగా అడుగులు వేస్తోంది. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టింది.  చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్రంలో ఒకేసారి 30.76 లక్షల మంది అక్కచెల్లెమ్మల పేరుతో ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి రికార్డు సృష్టించిన ప్రభుత్వం.. ఇప్పుడు కేవలం రెండు విడతల్లోనే వీరందరికీ పక్కా ఇళ్లు నిర్మించేందుకు పూనుకుంది. ఇందులో భాగంగా నేడు మొదటి దశలో రూ.28,084 కోట్ల వ్యయంతో 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తన క్యాంప్‌ ఆఫీసు నుంచి వర్చువల్‌ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. అన్ని వసతులతో ఇళ్లు మాత్రమే కాకుండా.. తాగునీరు, విద్యుత్, మురుగు నీటి వ్యవస్థ, ఇంటర్నెట్‌ వంటి అధునాతన మౌలిక సదుపాయాలతో సర్వ హంగులతో అందమైన 17,005 వైఎస్సార్‌ జగనన్న కాలనీలను (తొలి దశలో 8,905, రెండో దశలో 8,100) నిర్మిస్తోంది. ప్రపంచ చరిత్రలో అతి తక్కువ సమయంలో ఇంత భారీ ఎత్తున కొత్తగా గ్రామాలకు గ్రామాలే నిర్మిస్తున్న దాఖలాలు లేవని సామాజిక వేత్తలు స్పష్టం చేస్తున్నారు.  

  కృష్ణా జిల్లా కైకలూరులో గురువారం ఇళ్ల నిర్మాణం ప్రారంభించనున్న లే అవుట్‌ 

   2023 జూన్‌ నాటికి పూర్తి  
  ► ఎన్నికల సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించిన మేనిఫెస్టోలో ’నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ అనే హామీని 2023 జూన్‌ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో రెండు దశల్లో పేదల కోసం రూ.50,944 కోట్లతో మొత్తం 28,30,227 పక్కా ఇళ్లను నిర్మించడానికి ప్రణాళిక రూపొందించింది.  
  ► ఇందులో భాగంగా మొదటి దశలో రూ.28,084 కోట్ల వ్యయంతో 15.60 లక్షల గృహాలు, రెండో దశలో రూ.22,860 కోట్లతో 12.70 లక్షల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించింది. మొదటి దశ ఇళ్ల నిర్మాణాన్ని జూన్‌ 2022 నాటికి, రెండో దశ ఇళ్ల నిర్మాణాన్ని జూన్‌ 2023 నాటికి పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.  
  ► మొదటి దశలో 8,905 లేఅవుట్లలో 11.26 లక్షల ఇళ్లను వైఎస్సార్‌ జగనన్న కాలనీలుగా నిర్మించనున్నారు. అలాగే 2,92,984 ఇళ్లను సొంత స్థలాలు కలిగిన లబ్ధిదారులకు, 1,40,465 ఇళ్లను నివేసిత స్థలాలు కలిగిన లబ్ధిదారులకు మంజూరు చేశారు. ఇప్పుడు వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లోని ఇళ్లతోపాటూ ఈ గృహాల నిర్మాణాన్ని కూడా ప్రారంభిస్తున్నారు.  
   
  28.30 లక్షల ఇళ్లు కాదు.. 17,005 ఊళ్లు..  

  ► రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదల ఇళ్ల నిర్మాణం కోసం సిద్ధం చేసిన లేఅవుట్లు కొత్తగా 17,005 ఊళ్లను సృష్టిస్తాయన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాటలు నిజమవుతున్నాయి. అవి ఇళ్లు కాదు.. ఊళ్లు.. అనే దృష్టితో అక్కడ అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించారు.  
  ► దాంతో వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణంతోపాటు భారీ ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం తొలి దశలో 8905 వైఎస్సార్‌ జగనన్న కాలనీలు నిర్మిస్తుండగా.. రెండో దశలో 8,100 కాలనీలను నిర్మించనున్నారు. ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.32,909 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.  
  ► రూ.4,128 కోట్లతో తాగునీరు, రూ.22,587 కోట్లతో సిమెంట్‌ రోడ్లు, కాలనీ సైజును బట్టి అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజ్‌.. రూ.4,986 కోట్లతో అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ సౌకర్యం, రూ.627 కోట్లతో ఇంటర్నెట్, ఇతర సౌకర్యాల కోసం రూ.567 కోట్లు వ్యయం చేస్తోంది.  
   
  అందమైన కాలనీలు.. అన్ని వసతులు 
  ► వైఎస్సార్‌ జగనన్న కాలనీలను అన్ని హంగులతో.. అందంగా తీర్చిదిద్దడమే కాకుండా, ప్రతి ఇల్లు అన్ని సదుపాయాలతో ఉండాలన్న సీఎం వైఎస్‌ జగన్‌ ఆకాంక్షకు అనుగుణంగా కాలనీలు రూపు దిద్దుకోబోతున్నాయి.  
  ► ఒకేరకమైన నమూనాతో ప్రతి ఇంటిని 340 చదరపు అడుగులలో ఒక పడక గది, హాలు, వంట గది, స్నానాల గది, వరండాతో నిర్మిస్తున్నారు. ప్రతి ఇంటికి రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్‌ లైట్లు, నాలుగు బల్బులు, ఒక సింటెక్స్‌ ట్యాంకును అందిస్తున్నారు. ఇప్పటికే ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మ్యాపింగ్, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి అయింది. జియో ట్యాగింగ్‌ పనులు చివరి దశలో వున్నాయి.  
  ► 8,798 లేఅవుట్లలో గృహ నిర్మాణానికి అవసరమైన నీటి పథకాలను చేపట్టగా, వాటిల్లో 2,284 లేఅవుట్లలో పనులు పూర్తి చేశారు.  

  రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఊతం  
  ► కోవిడ్‌–19 రెండో దశ కారణంగా రాష్ట్రంలో అర్థిక పరిస్థితి కుదేలైన సమయంలో.. పనులు లేక నిస్తేజంతో ఉన్న వివిధ రంగాలకు చెందిన కార్మికులకు, కూలీలకు గృహ నిర్మాణం ఊతం ఇవ్వబోతోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొదటి దశ ఇళ్ల నిర్మాణం ద్వారా ఉపాధి కూలీలకు 21.70 కోట్ల పని దినాలు లభించబోతున్నాయి.  
  ► పెద్ద ఎత్తున ప్రారంభమవుతున్న ఇళ్ల నిర్మాణ పనులతో తాపీ మేస్ట్రీలు, రాడ్‌ వెండర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రీíÙయన్లు, ఇటుకల తయారీదారులు, సిమెంట్‌ విక్రేతలకు ఉపాధి లభించనుంది.   
   
  సరసమైన ధరలకే నాణ్యమైన నిర్మాణ సామగ్రి  
  ► ఇళ్ల నిర్మాణానికి వినియోగించే వస్తువుల (మెటిరీయల్‌) ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో పేదల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం.. పేదలపై భారం పడకుండా చర్యలు చేపట్టింది. నాణ్యమైన వస్తువులను మార్కెట్‌ ధరకన్నా తక్కువకే సరఫరా చేసేందుకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించింది. 
  ► లబ్ధిదారుల కోసం సిమెంట్, ఇతర వస్తువులను నిల్వ చేసుకునేందుకు గ్రామ, మండల స్థాయిలో గోదాములను ఏర్పాటు చేసింది. ప్రతి ఇంటి నిర్మాణానికి 20 మెట్రిక్‌ టన్నుల ఇసుకను దగ్గరలోని ఇసుక రీచ్‌ల నుంచి ఉచితంగా అందించనుంది. 
   
  లబ్ధిదారుడికి మూడు ఆప్షన్లు  
  ► గృహ నిర్మాణంలో లబ్ధిదారుడి నిర్ణయానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. మంజూరు చేసిన ఇళ్లను నిర్దిష్ట నమూనాలో నిర్మించుకునే విషయంలో లబ్ధిదారుడు సొంతగా నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు మూడు ఆప్షన్లను లబ్ధిదారుల ముందు ఉంచింది.  
  ఆప్షన్‌ 1 : ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం ఇళ్లు నిర్మించుకోవటానికి అవసరమైన నాణ్యమైన నిర్మాణ సామగ్రిని ప్రభుత్వమే సరఫరా చేసి, లేబర్‌ చార్జీలకు కూడా డబ్బు ఇస్తుంది. లబ్ధిదారులే ఇల్లు నిర్మించుకోవచ్చు. 
  ఆప్షన్‌ 2 : ఇంటి నిర్మాణానికి అవసరమైన నిర్మాణ సామగ్రిని లబ్ధిదారులు తామే తెచ్చుకోవచ్చు. తమకు నచ్చిన చోట కొనుక్కొని ఇల్లు నిర్మించుకోవచ్చు. దశల వారీగా పని పురోగతిని బట్టి ప్రభుత్వం అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో బిల్లుల చెల్లింపులను జమ చేస్తుంది. 
  ఆప్షన్‌  3 : తాము కట్టుకోలేమని చెప్పిన వారికి, ఆ బాధ్యత అంతా ప్రభుత్వమే తీసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. నిర్దేశించిన నమూన ప్రకారం ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సామగ్రిని సరఫరా చేయడంతోపాటు పూర్తి సహయ సహకారాలు అందించి ప్రభుత్వమే కట్టిస్తుంది.  
     

  మొదటి దశ ఇళ్ల నిర్మాణం కోసం 69.70 లక్షల మెట్రిక్‌ టన్నుల సిమెంట్, 7.44 లక్షల మెట్రిక్‌ టన్నుల స్టీల్, 310 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక, 232.50 కోట్ల సిమెంట్‌/ఫాల్‌ జి బ్లాక్స్‌(ఇటుకలు)ను ప్రభుత్వం సేకరిస్తోంది. తద్వారా కోట్లాది రూపాయల టర్నోవర్‌ జరిగి ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. 
   
  ఇళ్ల నిర్మాణ పనుల వల్ల లక్షలాది మంది తాపీ మేస్ట్రీలు, రాడ్‌ వెండర్లు, కార్పెంటర్లు, ఎల్రక్టీషియన్లు, ప్లంబర్లు, కూలీలకు ప్రత్యక్షంగా చేతినిండా పని దొరుకుతుంది. సామగ్రి రవాణా, హోటళ్లు, ఇతరత్రా పరోక్షంగా మరికొన్ని లక్షల మందికి ఉపాధి కలగనుంది.  

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/cm-jagan-will-start-construction-work-houses-ysr-jagananna-colonies-today