భూ వివాదాలకు ఇక శాశ్వత పరిష్కారం

  • మీ స్థలాల రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే
  • కబ్జాదారుల నుంచి నుంచి కాపాడేందుకే రీసర్వ
  • ‘వైఎస్సార్‌ జగనన్న భూహక్కు, భూ రక్ష’ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి జగన్

కష్టపడి సంపాదించిన డబ్బుతో బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని కొనుక్కొన్న భూమిని ఎవరైనా కాజేస్తే.. ఆ తండ్రి గుండె ఎంత క్షోభకు గురవుతుందో నాకు తెలుసు. సుదీర్ఘ పాదయాత్రలో ఎందరో బాధితులు వారి గోడు నాతో వెళ్లబోసుకున్నారు. ప్రతిఒక్కరికీ తమ భూమి హద్దులు, కొలతలు తెలుసుకునే హక్కు ఉంది. అందుకే రైతులకు, ఇతర స్థల యజమానులకు వారి భూమిపై శాశ్వత హక్కు కల్పించేందుకు వైఎస్సార్‌ జగనన్న భూహక్కు, భూ రక్ష పథకానికి శ్రీకారం చుట్టాం.

‘రాష్ట్రంలో దాదాపు వందేళ్ల కిందట భూముల సర్వే చేశారు. రాజ్యాలు మారాయి. పాలకులు మారారు. చట్టాలు మారాయి. చాలాకాలంగా పల్లె నుంచి పట్టణాల వరకు భూవివాదాలు, గట్టు పంచాయితీలు పెరిగాయి. రైతులు గొడవ పడుతున్నారు. సర్వే కోసం కార్యాలయాల చుట్టూ తిరిగినా సమస్యను పరిష్కరించే నాథుడే లేడు. ఈ వివాదాలు లేకుండా.. భూములపై యజమానులకు భరోసా కల్పించడమే మా ధ్యేయమ’ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తెలిపారు. కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో సోమవారం భూముల రీసర్వే పథకం ప్రారంభించిన సందర్భంగా బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇకపై భూ లావాదేవీలన్నీ గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోనే నిర్వహించుకోవచ్చని, ఈ కార్యక్రమం ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి సాహసం చేసిన దాఖలాలు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా 16 వేల మంది సర్వేయర్లను నియమించి, వారికి శిక్షణ ఇచ్చాం. సర్వే ఆఫ్‌ ఇండియా సహకారంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామ’ని వివరించారు.