మత్స్యకారులకు మొబైల్ యాప్‌

  • యాప్‌ వలలో చేప పడాల్సిందే 
  • మత్స్యకారులకు అందుబాటులో యాప్‌ 
  • జీపీఎస్‌ లేకున్నా చేపల సమాచారం 
  • రేపటి నుంచి సముద్రంలో చేపల వేట 

  కాకినాడ జాలరి పేటకు చెందిన శివయ్య 61 రోజుల విరామం తర్వాత గంగమ్మ తల్లికి పూజ చేసి మంగళవారం చేపల వేటకు బయలుదేరాడు. ఏ వైపు వెళితే చేపలు దొరుకుతాయా అని సందిగ్ధంలో పడ్డాడు. ఒక్కసారి వేటకు వెళితే ఏడెనిమిది రోజుల పని. ఓ మర పడవ, 3 వేల లీటర్ల డీజిల్, వంటావార్పు, ఆరేడుగురు మనుషులు.. ఇదో వ్యవస్థ. ఇంతా చేసి చేపలు దొరక్కపోతే అదో అవస్థ. ఇప్పటివరకు మత్స్యకారులందరిదీ ఇదే పరిస్థితి. ఇలాంటి సందిగ్ధాలకు ఇక తెరపడనుంది. ఇందుకోసం డాక్టర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ నడుం కట్టింది. ఇందుకోసం ఫిషర్‌ ఫ్రెండ్లీ మొబైల్‌ అప్లికేషన్‌ (ఎఫ్‌ఎఫ్‌ఎంఏ)ను తీసుకొచ్చింది. క్వాల్‌కం సంస్థ ఆర్థిక సహకారం, ఇన్‌కాయిస్‌ సంస్థ సాంకేతిక సహకారంతో ఈ యాప్‌ రూపుదిద్దుకుంది. ఇంగ్లిష్ తోపాటు ప్రాంతీయ భాషలైన తెలుగు, తమిళం, ఒడియా, బెంగాలీ, మలయాళం, కన్నడ, మరాఠీ, గుజరాతీ భాషల్లో ఉంటుంది. దీన్ని గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

  ట్యూనాను ఇట్టే పసిగట్టేస్తుంది 
  ఈ యాప్‌తో చేపలు ప్రత్యేకించి ట్యూనా జాతి చేపల సమాచారాన్ని ఇట్టే పసిగట్టేయొచ్చు. మత్స్యకారులు బయలుదేరిన ప్రాంతం నుంచి ఏ వైపు వెళితే చేపలు దొరుకుతాయో సూచిస్తుంది. రోజూ సాయంత్రం 6 గంటల సమయానికి.. ఆ మరుసటి రోజు వరకు ఎక్కడ చేపలు దొరుకుతాయో ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఏ ప్రాంతం, ఏయే రకం చేపలు ఎంత లోతులో దొరుకుతాయో సూచించడంతోపాటు అక్షాంశ, రేఖాంశాల వారీ సమాచారాన్ని తెలియజేస్తుంది. ఈ యాప్‌లో ఉండే జీపీఎస్‌ ఆప్షన్‌ ద్వారా మత్స్యకారులున్న ప్రాంతానికి ఎంత దూరంలో చేపలున్నాయో కూడా తెలుసుకోవచ్చు. ఏదైనా సందేహం వస్తే మత్స్యకారులు యాప్‌లోని ఫీడ్‌ బ్యాక్‌ పేజీ నుంచి ఇన్‌కాయిస్‌కు సమాచారం పంపిస్తే మరింత సమాచారాన్ని ఇస్తుంది. తామున్న ప్రాంతం నుంచి వంద కిలోమీటర్లలోపు సముద్రంలో నీటి ప్రవాహం, వేగం, అలల ఎత్తును ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. 

  మత్స్యకారులకు ఎంతో ఉపయోగం 
  ఈ యాప్‌ మత్స్యకారులకు ఎంతో ఉపయోగపడుతుందని, దీన్ని రూపొందించడానికి తమ సంస్థ సాంకేతిక నిపుణులు అహోరాత్రులు కష్టపడ్డారని డాక్టర్‌ స్వామినాథన్‌ ఫౌండేషన్‌ కన్వీనర్‌ డాక్టర్‌ వీరభద్రం తెలిపారు. ఇప్పటికే సుమారు 50 వేలమంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నట్టు సమాచారం ఉందన్నారు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను ఇందులో పొందుపరుస్తూ అప్‌డేట్‌ చేస్తున్నట్టు ఆయన చెప్పారు.  

  3 రోజుల ముందస్తు సమాచారం 
  సముద్రంలో వేటకు వెళ్లవచ్చో లేదో తెలియజేసే సమాచారాన్నీ తెలుసుకోవచ్చు. 3 రోజుల ముందస్తు సమాచారాన్ని అంకెల రూపంలో, 7 రోజుల సమాచారాన్ని గ్రాఫ్‌ రూపంలో ఎఫ్‌ఎఫ్‌ఎంఏ అందిస్తుంది. సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు మత్స్యకారులు తమ భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యల్ని వివరిస్తుంది. ఏదైనా విపత్తు ఏర్పడినప్పుడు ఎటువంటి రక్షణ సామగ్రి వాడాలో తెలుపుతుంది. సముద్ర జీవుల వల్ల కలిగే ప్రమాదాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను స్థానిక భాషల్లో తెలుసుకోవచ్చు. మత్స్యకారుల వద్ద జీపీఎస్‌ (గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం) పరికరం లేకున్నా ఎఫ్‌ఎఫ్‌ఎంఏలోని జీపీఎస్‌ ఆప్షన్‌ ద్వారా రేవుల అక్షాంశ, రేఖాంశాలను గుర్తించవచ్చు. తాము ఏవైపు వెళ్లాలో నిర్ణయించుకోవచ్చు. ఇందులో ఉండే కంపాస్‌ నుంచి కూడా జీపీఎస్‌ సాయంతో వేటకు అనువైన ప్రాంతాలను ఎంచుకోవచ్చు. చేపలు దొరికే ప్రాంతాల సమాచారాన్ని తెలుసుకోవడానికి జీపీఎస్‌ ఎంతో ఉపయోగపడుతుంది. మత్స్యకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాల సమాచారాన్ని, అధికారుల ఫోన్‌నంబర్ల వివరాలు కూడా ఈ యాప్‌లో ఉన్నాయి.  

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/fishing-sea-tomorrow-1370992