మన్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అరుదైన శస్త్ర చికిత్సలు

  • రెండు కీలక శస్త్రచికిత్సలు నిర్వహించిన పాడేరు జిల్లా ఆస్పత్రి
  • హెర్నియా ఆపరేషన్, వెరికోస్‌ వెయిన్స్‌ ట్రెండెలెన్‌బర్గ్‌ శస్త్రచికిత్సలు విజయవంతం
  • వైద్యుల పనితీరుపై జిల్లా కలెక్టర్‌ హర్షం

రెండేళ్ల క్రితం వరకు అడవి బిడ్డల ఆరోగ్య పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. చిన్నపాటి జ్వరం వస్తే మన్యం వీడి.. మైదానం వైపు పరుగులు తీసే ఏజెన్సీ ప్రజలకు ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. సాధారణ జ్వరాలకు మాత్రలందించేందుకూ వీల్లేని దుస్థితి నుంచి అరుదైన శస్త్ర చికిత్సలు విజయవంతంగా చేయగలిగే స్థాయికి ఏజెన్సీ ఆస్పత్రులు చేరుకున్నాయి. కాన్పుల కోసం అనకాపల్లి, వైజాగ్‌ వైపు అష్టకష్టాలు పడి గర్భిణుల్ని తీసుకొచ్చేవారు. ఇప్పుడు మన్యంలోని ప్రభుత్వాసుపత్రుల్లో రెండు నెలలుగా కాన్పులు నిర్వహిస్తూ తల్లీబిడ్డల్ని కాపాడుకోగలుగుతున్నారు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. మొట్టమొదటి సారిగా రెండు రోజుల వ్యవధిలో రెండు మేజర్‌ ఆపరేషన్లు పాడేరు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో నిర్వహించి రికార్డు సష్టించారు. కాలిలో సిరలు ఉబ్బి నడవడం కష్టంగా మారి ఆస్పత్రిలో చేరిన ఏజెన్సీకి చెందిన వి.చంద్రకళ (30)కు పాడేరు జిల్లా ఆస్పత్రి వైద్యులు సోమవారం వెరికోస్‌ వెయిన్స్‌ ట్రెండెలెన్‌బర్గ్‌ చికిత్సని విజయవంతంగా పూర్తి చేశారు. అదేవిధంగా హెర్నియా సమస్యతో ఆస్పత్రిలో చేరిన జి.నన్నారావు (48)కు మంగళవారం హెర్నియా రిపేర్‌ శస్త్రచికిత్సను చేశారు. పాడేరు జిల్లా ఆస్పత్రి చరిత్రలో ఈ తరహా ఆపరేషన్లు నిర్వహించడం ఇదే ప్రథమం. ప్రస్తుతం ఇద్దరు రోగులు ఆరోగ్యంగా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. 

కలెక్టర్‌ అభినందన
మేజర్‌ ఆపరేషన్లను మారుమూల మన్యంలో విజయవంతంగా పూర్తి చేసిన వైద్య బందాన్ని జిల్లా కలెక్టర్‌ డా.మల్లికార్జున అభినందించారు. ‘ఏజెన్సీ ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషలిస్టు డాక్టర్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు. దీంతో ఏజెన్సీలోనే మేజర్‌ ఆపరేషన్లను చేసే స్థాయికి వచ్చాం’ అని పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకష్ణ ‘సాక్షి’కి తెలిపారు.

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/paderu-district-hospital-performed-two-key-surgeries-1429869