మన పాలగుట్టపల్లె సాధించిన అపూర్వ విజయం! Paalaguttapalle village shows the way in sustainable livelihoods

  ఒక్కోసారి ప్రతికూల పరిస్థితులు కూడా అపూర్వ విజయాలకు దోహదం చేస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన పాలగుట్టపల్లె అనే కుగ్రామం అందుకు ఒక మంచి ఉదాహరణ. 2010-2015 సంవత్సరాల మధ్య పాలగుట్టపల్లె గ్రామం దుర్భర కరువు పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది. దీంతో వ్యవసాయం పనులు ఐదేళ్ల పాటు స్తంభించిపోయాయి. గ్రామంలో నివసిస్తున్న 60 కుటుంబాలు తమ పశువులను సైతం అమ్ముకోవవలసి వచ్చింది. వ్యవసాయేతర ఉపాధి మార్గాలను వెతుక్కుంటూ బయటి ప్రాంతాలకు గ్రామస్థులు వలసలు వెళ్లడం ప్రారంభించారు. కొంతమంది  కూలీలయ్యారు. అయితే అదే గ్రామానికి చెందిన అపర్ణా కృష్ణన్ అక్కడి పరిస్థితులను నిశితంగా గమనిస్తూ వచ్చారు. వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన అపర్ణకు పాలగుట్టపల్లె పరిస్థితులు బాగా తెలుసు. వారి కష్టాలకు ఎలాగైనా ఒక పరిష్కారం చూపాలని ఆమె నిర్ణయించుకున్నారు.  వ్యవసాయమే కాకుండా ఈ ప్రాంతంలోని మహిళలకు కుట్టు పనుల్లోనూ కొంత నైపుణ్యం ఉందని ఆమె గమనించారు. అందుకే పర్యావరణానికి అనుకూలంగా ఉండి, స్వచ్ఛమైన పత్తితో తయారయ్యే బట్ట సంచులను తయారు చేయడం మొదలుపెట్టాలని అపర్ణ అక్కడి మహిళలకు సూచించారు.

  అలా 2016లో ఆ మహిళలు సంచులను కుట్టడం ప్రారంభించగా, అపర్ణ వాటిని సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేశారు. నెమ్మదిగా వాటికి ప్రాచుర్యం లభించింది. ఇవాళ దేశంలోనే కాక, యుఎస్ఏ, యు.కె, కెనడా వంటి పలు విదేశాలలో సైతం పాలగుట్టపల్లె సంచులు అమ్ముడవుతున్నాయి. ఇప్పటిదాకా సుమారు 50,000 సంచులు అమ్మకం జరిగి అవి వినియోగదారులకు చేరాయి. పది మంది మహిళలు నడుపుతున్న ఈ చిన్న వ్యాపారం ఎంతో క్లిష్ట సమయంలో గ్రామప్రజలను ఆదుకుంది.

  “గ్రామంలోని పురుషులు కష్టపడి పనిచేస్తారు, కాని వారు తమ పనిని కోల్పోయారు. అన్నం పెట్టే  భూములు కాస్తా బీళ్లుగా మారాయి. మరి వారి కుటుంబాలు ఎలా బ్రతకాలి? అలాంటి పరిస్థితుల్లో మహిళలు చొరవ తీసుకోవడం అనివార్యమైంది” అని అపర్ణ చెబుతారు.

  అన్ని వైపుల నుండి కష్టాలు చుట్టుముట్టిన సమయంలో గ్రామంలోని మహిళలతో అపర్ణ బ్యాగులు తయారు చేయించడం మొదలుపెట్టారు. పాలగుట్టపల్లె బ్యాగ్స్ (Paalaguttapelle Bags) బ్రాండ్ ప్రారంభించడానికి అపర్ణ అక్కడి మహిళలకు పెట్టుబడిగా అందించిన మొత్తం కేవలం 500 రూపాయలు మాత్రమే. మొదట్లో ఆమె తన నెట్‌వర్క్‌లోనివారికి మాత్రమే సంచులను విక్రయించేవారు. అయితే 2017లో ఉత్తర్‌ ప్రదేశ్‌లో జరిగిన వరల్డ్ ఆర్గానిక్ కాంగ్రెస్ (World Organic Congress) కార్యక్రమం కోసం ఒకేసారి 1300 బ్యాగుల ఆర్డర్ వచ్చింది. దీంతో మరి కొంత మంది మహిళలు కూడా సంచుల తయారీలో భాగం పంచుకోవడం మొదలుపెట్టారు. అప్పటి నుండి ఈ మహిళలు మన దేశంతో పాటు విదేశాలలో సైతం వేలాది సంచులను వినియోగదారులకు అందిస్తూ వస్తున్నారు.

  “మహిళలు కార్పొరేట్ డిమాండ్‌కు అనుగుణంగా బ్యాగులను కుట్టి ఉత్పత్తి చేస్తారు. వారు భారీ ఆర్డర్లను సైతం స్వీకరిస్తారు. ల్యాప్‌టాప్ స్లీవ్‌లు, స్లింగ్ బ్యాగులు, బ్యాక్‌ప్యాక్‌లు, డ్రాస్ట్రింగ్ బ్యాగులు, టోటె బ్యాగ్‌లతో సహా సుమారు 50 రకాల నాణ్యమైన బట్ట సంచులను వారు తయారు చేస్తారు. అంతేకాదు వారు వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా కూడా సంచులను డిజైన్ చేసి అందించగలరు” అని అపర్ణ వివరించారు.

  ఈ సంచి సమ్‌థింగ్ స్పెషల్

  పాలగుట్టపల్లె సంచులలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్యాగ్ – కూరగాయల సంచి. ఇది ఒక కస్టమర్ చేసిన సూచన మేరకు తయారైంది. “ఆ కస్టమర్ vegetable bagకు రూపకల్పన చేసి పాలగుట్టపల్లె మహిళలకు దాన్నెలా కుట్టాలో వివరించారు. వారు నెమ్మదిగా వాటిని కుట్టడం నేర్చుకున్నారు. ఈ బ్యాగ్‌లో కూరగాయలు అన్నీ కలిసిపోకుండా ఉండటానికి విడి విడిగా మడతలు ఉంటాయి. దీంతో ఇందులో కూరగాయలు వేసుకుని తీసుకువచ్చాక ఇంట్లో వాటిని వేరు చేయాల్సిన ఇబ్బంది ఉండదు. అలా ఇది ఎంతో ప్రాచుర్యం పొందింది. ఎప్పటికప్పుడు కుట్టిన వెంటనే ఈ సంచులు అమ్ముడైపోతూ ఉంటాయని అపర్ణ చెప్పారు.

  ఇక కొంతమంది కస్టమర్లు తమకి కావలసిన పద్ధతిలో ప్రింటెడ్ బ్యాంగులు కావాలని అడుగు తుంటారు. తమకి అవసరమైన డిజైన్ల కోసం సంప్రదిస్తుంటారు. అందుకే ఈ గ్రామ మహిళలు చెన్నై‌ వెళ్లి స్క్రీన్ ప్రింటింగ్‌లో కూడా శిక్షణ పొందారు. అలా కస్టమర్ల అభ్యర్థనల మేరకు వారు సంచులను తయారు చేసి ఇవ్వడానికి వీలైంది. ఇప్పుడు రకరకాల అందమైన డిజైన్లలో పాలగుట్టపల్లె మహిళలు బ్యాగ్స్ తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్‌ సంచుల వాడకానికి ప్రత్యామ్నాయం చూపుతున్నారు.

  ఈ సంచుల తయారీ ఇక్కడి మహిళలకు నెలకి 5,000 రూపాయలకు పైగా సంపాదించి పెడుతోంది. ఇది వారి పిల్లలను బాగా చదివించుకోవడంలో ఎంతో సహాయకారిగా ఉంటోంది.

  నాణ్యతకు, నైపుణ్యానికి గుర్తింపు

  పాలగుట్టపల్లె మహిళల్లో ఒకరైన రూప (31) నాటి కరువు పరిస్థితులు తలుచుకుంటేనే భయం వేస్తుందంటారు. “అప్పుట్లో పరిస్థితి ఎంతో భయంకరంగా ఉండింది. ఒక్క పూట కూడా భోజనానికి కష్టమైన రోజులవి. అలాంటి పరిస్థితుల్లో సంచులు కుట్టడం మాత్రమే నా కుటుంబాన్ని కాపాడింది. దాని వల్లే ఇవాళ మా కుటుంబం నిలబడింది. నాకు వచ్చే ఆదాయంతో పిల్లలను ప్రైవేట్ స్కూలుకు కూడా పంపగలుగుతున్నాను” అని ఆమె చెబుతారు.

  మరో మహిళ అనిత (37) కూడా ఇదే మాట చెబుతారు. కుట్టు పనులతో ఆమె కుటుంబం ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడింది. తను కుట్టుపనుల్లో తీరిక లేకుండా ఉన్నప్పుడు ఇంటి పనులను తన భర్త చూసుకుంటారని అనిత చెప్పారు. ఇక్కడి సంచులు దేశవిదేశాలకు కూడా చేరుతున్నాయని విన్నప్పుడు గ్రామంలోని మగవారికి కూడా ఎంతో సంతోషం కలుగుతుందనీ, అలా తమ నైపుణ్యానికి మంచి గుర్తింపు వచ్చిందనీ అనిత మెరిసే కళ్లతో చెబుతారు. పని..  జీవనోపాధి కల్పించడం ఒకెత్తయితే, ఆ పనికి ప్రశంసలు కూడా దక్కడం మరొకెత్తు. పాలగుట్టపల్లె మహిళలు తమ నైపుణ్యాలతో ఈ ఘనతను కూడా సాధించారు. అయితే, ఈ మహిళలకు కొన్ని సమస్యలు కూడా లేకపోలేదు. ఈ గ్రామం పట్టణానికి దూరంగా ఉండడంతో కుట్టు మిషిన్లు పాడైనప్పుడు వాటిని మరమ్మతు చేసుకోవాలంటే కొన్ని రోజులు పడుతుంది.

  మార్కెటింగ్ కోసం కూడా ఈ మహిళలకు పెద్దగా సదుపాయాలు లేవు. ఎటువంటి బడ్జెట్ లేకపోవడంతో కేవలం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్ మీడియా పోస్టుల ద్వారా మాత్రమే అపర్ణ సంచుల మార్కెటింగ్ చేస్తుంటారు. “ఈ మహళల వ్యాపారంలో నాకు ఎలాంటి వాటా లేదు. కస్టమర్లతో వ్యవహరించడానికి మహిళలకు భాష ఒక అవరోధం కాబట్టి మార్కెటింగ్‌లో దాన్ని అధిగమించడానికి నేను నా వంతు సహాయం చేస్తుంటాను. చాలా మంది కార్పొరేట్లు ఈ మహిళలు  కుట్టే సంచులను కొనుగోలు చేయడం జరుగుతోంది. కానీ ఇంకా ఎక్కువ మందికి ఉపాధి లభించాలంటే మాకు ఇంకా ఎక్కువ ఆర్డర్లు అవసరం” అని అపర్ణ అన్నారు.

  COVID-19 మహమ్మారి సమయంలో పాలగుట్టపల్లె మహిళలు ఇంట్లో తయారు చేసిన ఊరగాయలతో పాటు 10,000 దాకా ఫేస్ మాస్కులు అమ్మారు. జమిలి దుప్పట్ల (quilts-నడుమ పత్తి పెట్టి కుట్టే దుప్పటి) తయారీ కోసం విదేశాల నుండి వారికిప్పుడు ఒక ఆర్డర్ వచ్చింది. మహిళలు ఈ కొత్త డిమాండ్‌‌కు అనుగుణంగా వాటిని తయారు చేయడంలో తీరిక లేకుండా ఉన్నారు. ఇది వారి అమ్మకాలకు తోడ్పడగలదని అపర్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.

  కరవును ఈ మహిళలు జయించిన తీరు అపూర్వం. జీవనోపాధికి మాత్రమే కాకుండా వారి కుట్టు పని నైపుణ్యం వారికి అంతర్జాతీయ గుర్తింపును కూడా తెచ్చిపెట్టింది. ప్రతిభకు సాన పడితే మన మహిళలు సులువుగా మంచి విజయాలను సాధించగలరని పాలగుట్టపల్లె మరోసారి రుజువు చేసింది.

  -వై.శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్

  పాలగుట్టపల్లె సంచులను ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి!

  Contact:

  Paalaguttapalle Bags

  Phone: +91 93815 98081

  Email: paalaguttapalle@gmail.com

  Facebook:  https://www.facebook.com/Paalaguttapalle

  http://paalaguttapalle.com/