మరో రెండు మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కుల ఏర్పాటు

  • కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు
  • ఇప్పటికే అనంతపురం, విశాఖ జిల్లాల్లో ఏర్పాటుకు ఆమోదం
  • 2024–25కి రాష్ట్రంలో పెరగనున్న సరుకు రవాణా ఆధారంగా మరో రెండు ఎంఎంఎల్‌పీలు
  • కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులకు అనుబంధంగా ఎంఎంఎల్‌పీల అభివృద్ధి
  • కొత్తగా వచ్చే పోర్టులతో 350 మిలియన్‌ టన్నులకు పెరగనున్న సరుకు రవాణా
  • దీని వ్యయం 13శాతం నుంచి 8 శాతానికి తగ్గించాలన్నది లక్ష్యం

రాష్ట్రంలో సరుకు రవాణాను చౌకగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఇప్పటికే రెండు మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కు (ఎంఎంఎల్‌పీ)ల నిర్మాణం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా మరో రెండు పార్కుల నిర్మాణంపై దృష్టిసారించింది. తొలుత విశాఖపట్నం, అనంతపురం వద్ద రెండు భారీ ఎంఎంఎల్‌పీలను నిర్మించే విధంగా కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు తాజాగా.. విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తి వద్ద అభివృద్ధి చేస్తున్న వైఎస్సార్‌ జగనన్న ఎంఐహెచ్, హైదరాబాద్‌–బెంగళూర్‌ పారిశ్రామిక కారిడార్‌లో కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద అభివృద్ధి చేస్తున్న భారీ పారిశ్రామిక పార్కుల వద్ద రెండు భారీ ఎంఎంఎల్‌పీలను నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. పీఎం గతిశక్తి నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా.. నేషనల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం కింద వీటి అభివృద్ధికి ప్రతిపాదనలు పంపినట్లు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక వస్తువు ధరలో 13 శాతంగా ఉన్న సరుకు రవాణా వ్యయం ఎంఎంఎల్‌పీలతో దానిని 8 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

300–350 మి.ట.లకు పెరుగుదల
ఇక రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న నాలుగు పోర్టులు.. రామాయపట్నం, మచిలీపట్నం.. కాకినాడ గేట్‌వే, భావనపాడులతో పాటు విజయవాడ–ఖరగ్‌పూర్‌ మధ్య సరుకు రవాణా కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కారిడార్‌ నిర్మిస్తుండటంతో వీటికి అనుగుణంగా రాష్ట్రంలో మొత్తం నాలుగు ఎంఎంఎల్‌పీలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇవన్నీ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం సుమారు 150 మిలియన్‌ టన్నులుగా ఉన్న రాష్ట్ర సరుకు రవాణా 2024–25 నాటికి 300–350 మిలియన్‌ టన్నులకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. 

రైల్వేలైన్‌తోనూ అనుసంధానం
ఇదే సమయంలో ఓర్వకల్లు పారిశ్రామికవాడను రైల్వేలైన్‌తో అనుసంధానం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రతిపాదనలు పంపింది. ఓర్వకల్లు నుంచి పోర్టులు, ఎయిర్‌పోర్టులు, జాతీయ రహదారులకు తోడు రైల్వే కనెక్టివిటీ కూడా ఉండేలా కర్నూలు రైల్వేస్టేషన్‌ నుంచి బనగానపల్లికి ఓర్వకల్లు మీదుగా రైలు మార్గాన్ని అనుసంధానం చేయడంతో పాటు దూపాడు రైల్వేస్టేషన్‌ వద్ద గూడ్స్‌ యార్డ్‌నూ నిర్మించాల్సిందిగా ప్రతిపాదన వచ్చింది.  

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/two-more-multimodal-logistics-parks-andhra-pradesh-1449571