మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్

    తక్షణమే స్పందించి.. లొకేషన్‌కు చేరుకున్న భవానీపురం పోలీసులు

    విజయవాడ గొల్లపూడిలో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్వర్యంలో దిశ మొబైల్‌ యాప్‌ అవగాహన సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. సీఎం జగన్‌ సమక్షంలోనే వాలంటీర్లు దిశా యాప్‌ లైవ్‌ డెమో చేసి చూపించారు. యాప్‌ నుంచి మెసేజ్‌ వెళ్లిన వెంటనే భవానీపురం పోలీసులు స్పందించి.. నిమిషాల్లోనే లొకేషన్‌కు చేరుకున్నారు. 

    ఈ సందర్భంగా వాలంటీర్లు సీఎం జగన్ నిర్ణయాలతో మహిళలకు నిజమైన స్వేచ్ఛ వచ్చింది అన్నారు. జగనన్న లాంటి ముఖ్యమంత్రిని తాము ఎక్కడా చూడలేదని తెలిపారు. నేరం జరగడానికి ముందే దాన్ని నియంత్రించడం గొప్ప చర్య అన్నారు వాలంటీర్లు. ఇక ఇప్పటికే 17 లక్షల మంది దిశ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకున్నారని, స్మార్ట్ ఫోన్‌ ఉండే ప్రతి మహిళ వద్ద దిశ యాప్ ఉండాలని సీఎం జగన్‌ చెప్పారు.

    ఫోన్‌లో దిశ యాప్‌ ఉంటే ఒక అన్న తోడుగా ఉన్నట్టే, ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్ అని తెలిపారు. పోలీసులు మనకు మంచి చేసే ఆప్తులు, మహిళల భద్రత, రక్షణపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 


    డౌన్‌లోడ్‌ ఇలా
    ► ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఫోన్లలో ప్లే స్టోర్‌, ఆప్‌ స్టోర్‌ నుంచి దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి
    ► యాప్‌ డౌన్‌లోడ్‌ పూర్తైన తర్వాత మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేయగానే ఓటీపీ నంబర్‌ వస్తుంది
    ► ఓటీపీ నంబర్‌ ఎంటర్‌ చేసిన తర్వాత.. పేరు, మొబైల్‌ నంబర్‌, అడ్రస్‌, ప్రత్యామ్నాయ నంబరు, అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన కాంటాక్ట్‌ నంబర్లు తదితర వివరాలు నమోదు చేయాలి. దీంతో రిజి‍స్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతుంది. 
    ► అక్కాచెల్లెమ్మలు ఆపదలో ఉన్నామని భావించిన వెంటనే దిశ యాప్‌లో ఉన్న అత్యవసర సహాయం (SOS) బటన్‌ నొక్కితే వారి ఫోన్‌ నంబరు, చిరునామా, వారున్న లోకేషన్‌తో సహా వారి వాయిస్‌తో పాటు 10 సెకన్ల వీడియో రికార్డ్‌​ చేసి దిశ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కి  పంపేలా దిశ యాప్‌కి రూపకల్పన చేశారు. 
    ► అక్కాచెల్లెమ్మల నుంచి అలెర్ట్‌ రాగానే కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది అప్రమత్తమై సమీప పోలీస్‌ స్టేషన్‌కి సమాచారం చేరవేస్తారు. పోలీసులు తక్షణం అక్కడికి చేరుకుని వారికి రక్షణ కల్పిస్తారు.

    దిశతో ప్రయోజనాలు
    ► యువతులు, మహిళలు ఆపదలో ఉన్నామని భావించినప్పుడు పోలీసులతో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులు, స్నేహితులకు సమాచారం ఇచ్చే వెసులుబాటు
    ► ప్రయాణ సమయంలో రక్షణ, మార్గ నిర్దేశం కోసం ‘ట్రాక్‌ మై ట్రావెల్‌’ ఆప్షన్‌ ఏర్పాటు. ఈ ఆప్షన్‌లో తాము చేరాల్సిన గమ్యస్థానాన్ని నమోదు చేస్తే అనుక్షణం ట్రాకింగ్‌ జరుగుతుంది. ప్రయాణిస్తున్న వాహనం దారి తప్పితే వెంటనే ఆ సమాచారాన్ని దిశ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌తో పాటు బంధు మిత్రులకు చేరవేస్తుంది.
    ► దిశ యాప్‌లో 100, 112 వంటి అత్యవసర నంబర్లతో పాటు సమీపంలోని పోలీస్‌ స్టేషన్లు, ఆస్పత్రులు, మెటర్నిటీ సెంటర్లు, బ్లడ్‌ బ్యాంకులు, ట్రామాకేర్‌ సెంటర్లు, మెడికల్‌ షాపుల వివరాలు కూడా ఉంటాయి.
    ► కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి పుష్‌ బటన్‌ ఆప్షన్‌ ద్వారా పోలీసులు ఏకకాలంలో దిశ యాప్‌ ఉపయోగించే వారందరికి సలహాలు, సూచనలు ఇస్తూ జరగబోయే ప్రమాదాలను నివారిస్తారు 

    ► విపత్కర పరిస్థితుల్లో దిశ యాప్‌ ఓపెన్‌ చేసేందుకు తగిన సమయం లేకపోతే ఫోన్‌ను గట్టిగా అటుఇటూ ఊపితే చాలు .. యాప్‌ ద్వారా పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కి ఆపద సందేశం చేరుతుంది. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఫోన్‌కి కాల్‌ చేసి వివరాలు సేకరిస్తారు. పోలీసుల ఫోన్‌కి ఎవరూ స్పందించకపోతే పోలీస్‌ వెహికల్స్‌లో అమర్చిన మొబైల్‌ డేటా టెర్మినల్‌ సహాయంతో జీపీఎస్‌ ట్రాకింగ్‌ ద్వారా బాధితులు ఉన్న లోకేషన్‌కి పోలీసులు వేగంగా చేరుకునేలా ఏర్పాటు.

    దిశ యాప్‌ లింక్‌https://play.google.com/store/apps/details?id=com.likhatech.disha

    Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/volunteers-conduct-disha-app-live-demo-presence-cm-jagan-1374824