మహిళాభివధ్ది ధ్యేయంగా పథకాల అమలు

  • రెండేళ్లలో మహిళలకు రూ.89,234 కోట్ల లబ్ధిని చేకూర్చిన వైఎస్‌ జగన్‌ సర్కార్‌
  • తద్వారా అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారితకు బలమైన పునాదులు
  • అన్నింటా వారికే పెద్దపీట
  • దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా నామినేటెడ్‌ పోస్టుల్లో 50 శాతం మహిళలకే
  • అక్కచెల్లెమ్మలు కేంద్ర బిందువుగానే పథకాల రూపకల్పన, అమలు
  • మహిళల పేరిటే 30.76 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ
  • మద్యనియంత్రణ పటిష్టంగా అమలు.. 33 శాతం షాపుల తగ్గింపు
  • టీడీపీ హయాంలో ఉన్న బెల్టు షాపులు, పర్మిట్‌ రూములు పూర్తిగా ఎత్తివేత
  • మహిళలపై నేరాల నియంత్రణకు దేశంలోనే తొలిసారిగా దిశ బిల్లు, దిశ పోలీస్‌స్టేషన్లు

  యత్ర నార్యంతు పూజ్యతే, రమంతే తత్ర దేవత (ఎక్కడ మహిళలను పూజిస్తారో.. అక్కడ దేవతలు కొలువుంటారు)’ అన్న సూక్తిని అక్షరాలా చేసి చూపించింది.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం. రెండేళ్ల పాలనలో అన్నింటా అక్కచెల్లెమ్మలకే అగ్రాసనం వేసింది. దాదాపు ప్రతి పథకం రూపకల్పన.. అమలు మహిళా అభ్యున్నతే లక్ష్యంగా.. సాధికారితే ధ్యేయంగా.. వారి సంక్షేమంగా పరమావధిగా సాగిందంటే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు ఎంత పెద్దపీట వేసిందో అర్థమవుతోంది. ఈ రెండేళ్లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 21 పథకాల ద్వారా 4.53 కోట్ల మంది మహిళలకు ఏకంగా రూ.89,234 కోట్ల లబ్ధి చేకూరింది. ఇందులో 3.49 కోట్ల మంది అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ.57,052 కోట్ల నగదు బదిలీ జరిగింది. అలాగే నగదేతర బదిలీ పథకాల ద్వారా 1.04 కోట్ల మందికి రూ.32,182.38 కోట్ల లబ్ధి చేకూరింది. ఈ నగదును బ్యాంకులు పాత అప్పులకు జమ చేసుకోనీయకుండా అన్‌ ఇన్‌కంబర్డ్‌ ఖాతాలకు ప్రభుత్వం జమ చేసింది. దేశ, రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున కేవలం రెండేళ్ల వ్యవధిలోనే మహిళల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేయడం ఇదే తొలిసారి. తద్వారా మహిళల ఆర్థిక స్వాతంత్య్రానికి ప్రభుత్వం బలమైన పునాదులు వేసింది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా నవరత్నాల పథకాలను అమలు చేసి చూపింది. అధికారం చేపట్టిన కొద్ది నెలల పాలనలోనే ఇచ్చిన ప్రతి హామీని నూటికి నూరు శాతం అమలు చేసి మహిళా పక్షపాత ప్రభుత్వమని నిరూపించింది. 

  30.76 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు 
  సొంత గూడు లేని కుటుంబాలను గుర్తించి.. మహిళల పేరిటే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇళ్ల స్థలాల పట్టాలను మంజూరు చేసింది. 30.76 లక్షల మంది లబ్ధిదారుల కోసం ఏకంగా 68 వేల ఎకరాలకు పైగా సేకరించింది. ఇందుకు అవసరమైన భూసేకరణ పరిహారం, భూమి అభివృద్ధి కోసం ఏకంగా రూ.27 వేల కోట్ల భారీ వ్యయం చేసింది. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా మహిళలకు 50 శాతం నామినేటెడ్‌ పదవులు ఇచ్చేలా చట్టం చేసింది. మహిళల రక్షణ కోసం దిశ బిల్లును ఆమోదించడమే కాకుండా రాష్ట్రంలో ప్రత్యేకంగా దిశ పోలీస్‌స్టేషన్లకు శ్రీకారం చుట్టింది. హోంమంత్రి పదవిని మహిళకు ఇచ్చి అక్కచెల్లెమ్మలకు రక్షణపరంగా భరోసా కల్పించింది. 

  సున్నా వడ్డీకి బాబు మంగళం.. వైఎస్‌ జగన్‌ సర్కార్‌ చెల్లింపు
  గత టీడీపీ ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళల సున్నా వడ్డీకి కూడా మంగళం పలికింది. అయితే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాత్రం ఇచ్చిన మాట మేరకు సున్నా వడ్డీ నిధులను నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాలకే జమ చేశారు. పొదుపు సంఘాల్లోని 98,00,626 మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.2354.22 కోట్లను వేశారు. పొదుపు సంఘాలను టీడీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తే.. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం వారి ఆర్థిక సాధికారతకు, జీవనోపాధికి నున్నటి బాటలు పరిచింది. 

  45 నుంచి 60 ఏళ్ల మహిళలకు.. ‘చేయూత’
  వైఎస్సార్‌  చేయూత కింద 45 – 60 ఏళ్ల లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఆర్థికంగా అండదండలు అందించడంతోపాటు వారు స్వయం ఉపాధి పొందేందుకు వీలుగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంతేకాకుండా ఈ ఏడాది ఈబీసీ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు)ల్లో 45 – 60 ఏళ్లలోపు మహిళలకు ఆర్థికంగా సాయం అందించాలని నిర్ణయించింది. ఆ నిధులతో వారి స్వయంఉపాధికి పెద్ద కంపెనీలతో అవగాహన ఒప్పందాలను చేసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన నగదుకు తోడు బ్యాంకుల నుంచి మరింత ఆర్థిక సాయం అందించే ఏర్పాటు చేస్తోంది. కిరాణా షాపులు ఏర్పాటు చేసుకోవడం లేదా గేదెలు, ఆవులను కొనుగోలు చేసుకుని వ్యాపారం పెంపొందించుకునేందుకు వీలుగా పెద్ద కంపెనీల ద్వారా సహకారం అందిస్తోంది.

  మద్యనియంత్రణతో అక్కచెల్లెమ్మలకు ఊరట
  మద్యం మహమ్మారి కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తుండటాన్ని గమనించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న 43 వేల బెల్టు షాపులు, 4,380 పర్మిట్‌ రూములను పూర్తిగా ఎత్తేసింది. అంతేకాకుండా మద్యం విక్రయించే వేళలను కూడా తగ్గించేసింది. దీంతో మద్యం విక్రయాలు బాగా తగ్గిపోయాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018–19లో రాష్ట్రంలో 3.80 కోట్ల లిక్కర్‌ కేసుల అమ్మకాలు జరగ్గా.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ సంఖ్య 2019–20లో 2.59 కోట్ల కేసులకు తగ్గింది. అంటే 32 శాతం అమ్మకాలు తగ్గిపోయాయి. 2020–21లో లిక్కర్‌ అమ్మకాలు 1.87 కోట్ల కేసులకే పరిమితమవడం గమనార్హం. అదేవిధంగా బీర్ల అమ్మకాల్లోనూ భారీ క్షీణత నమోదైంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 4,380 మద్యం దుకాణాలు ఉండగా.. ఇప్పుడీ సంఖ్య 2,394కు పరిమితమైంది.

  మహిళా సంఘాలకు బాబు సర్కార్‌ టోకరా.. జగన్‌ సర్కార్‌ ఆసరా
  గత టీడీపీ ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళల పేరిట ఉన్న రూ.14,204 కోట్ల రుణాన్ని మాఫీ చేస్తామని ఎన్నికల (2014) ముందు వాగ్దానం చేసింది. అంతేకాకుండా దాన్ని ఎన్నికల ప్రణాళికలో కూడా చేర్చి ఆ తర్వాత అక్కచెల్లెమ్మలకు ఎగనామం పెట్టింది. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌ తాము అధికారంలోకి వస్తే 2019 ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళల పేరిట ఉన్న అప్పును నాలుగు విడతల్లో తిరిగి అక్కచెల్లెమ్మలకే ఇస్తానని మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చీరాగానే నెలల వ్యవధిలోనే తొలి విడతగా వైఎస్సార్‌ ఆసరా పేరిట 77,75,681 మంది మహిళలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే రూ.6,310.68 కోట్లు జమ చేశారు. అంతేకాకుండా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను మరింత ఆర్థికంగా బలోపేతంచేసేందుకు పలు ప్రముఖ కంపెనీలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలను చేసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన నిధులకు తోడు బ్యాంకుల ద్వారా మరింత ఆర్ధిక సాయం అందిస్తూ వ్యాపారాలను చేసుకోవడానికి ఊతమందిస్తోంది. మహిళలు తయారుచేసే ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించడంలో కంపెనీలు సహకారమందిస్తున్నాయి. అలాగే మహిళలు స్వయంఉపాధి కింద ఏర్పాటు చేసుకునే షాపులకు బ్రాండింగ్‌ కల్పించేందుకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోంది. 

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/cm-jagan-govt-has-made-profit-rs-89234-crore-women-two-years-1369110