మాస్కు లేకపోతే రూ.100 కట్టాల్సిందే

    ఈ నెల 14 వరకు కర్ఫ్యూ

    కరోనా నేపథ్యంలో ఎవరైనా మాస్కు లేకుండా బయటకు వస్తే రూ.100 జరిమానా వేస్తారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మాస్కు విధిగా ధరించాలని, ఒకరినుంచి ఒకరికి కరోనా వ్యాపించకుండా ఉండాలంటే ఈ నిబంధన ఖచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్న కర్ఫ్యూను తిరిగి ఈ నెల 14 వరకు పొడిగించారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలు మినహా మిగతా 11 జిల్లాల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.  అంటే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కోవిడ్‌ నిబంధనల మేరకు అన్ని కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు.

    షాపులు, కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు అన్నీ నిర్వహించుకోవచ్చు. ఏవైనా పబ్లిక్‌ ప్లేసుల్లో (మాల్స్‌లో గానీ, సినిమాహాళ్లలో గానీ) సీటు మార్చి సీటు నిర్వహణ చేసుకోవచ్చు. మనిషికి మనిషికీ కనీసం 5 అడుగుల దూరం ఉండాలి. గోదావరి జిల్లాల్లో మాత్రం సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. అంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. ఎవరైనా కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. కోవిడ్‌ నిబంధనలు పాటించే విషయంలో కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు పర్యవేక్షణ చేయాలని  ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  

    Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/coronavirus-who-comes-out-without-mask-will-be-fined-rs-100-1377084