మిడిల్‌ క్లాస్‌కూ ఏపీలో ఆరోగ్య భద్రత

  • నీతి ఆయోగ్‌ నివేదికలో వెల్లడి
  • పేదలు,మధ్య తరగతికి నిశ్చింత
  • వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీలోకి 95శాతం కుటుంబాలు
  • ఏపీలో ఫలిస్తున్న వైద్య ఆరోగ్య రంగ సంస్కరణలు
  • ప్రభుత్వాస్పత్రులను తీర్చిదిద్ది మౌలిక సదుపాయాలు
  • ఒకేసారి పెద్ద ఎత్తున మెడికల్‌ కాలేజీల నిర్మాణం.. గ్రామస్థాయి నుంచి వైద్య రంగం బలోపేతం
  • రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా భారీ ఎత్తున వైద్య సిబ్బంది నియామకాలు

ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ రాష్ట్రంలో 95 శాతం కుటుంబాలకు వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీతో ఉచితంగా వైద్య చికిత్సలను అందిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దేశంలోనే విశిష్ట గుర్తింపు సాధించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక సంస్కరణలతో తీసుకువచ్చిన ‘వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ’ పథకం ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యరక్ష కల్పిస్తోందని కేంద్ర ప్రభుత్వ నివేదికలో వెల్లడైంది. నాడు – నేడు ద్వారా పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రభుత్వాస్పత్రులను తీర్చిదిద్దడంతోపాటు వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌ ద్వారా గ్రామస్థాయి నుంచి రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర చరిత్రలోనే భారీ ఎత్తున వైద్య సిబ్బంది నియామకాలను ప్రభుత్వం చేపట్టింది. 

ఏపీలో అందరికీ ఆరోగ్య భరోసా
దేశంలో మధ్య తరగతి వర్గాలకు ఆరోగ్యబీమా దక్కడం లేదని ‘హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఫర్‌ ఇండియాస్‌ మిస్సింగ్‌ మిడిల్‌ క్లాస్‌’ పేరుతో రూపొందించిన తాజా నివేదికలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్‌ వెల్లడించింది. అయితే అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మధ్య తరగతి వర్గాలను కూడా ఆరోగ్య బీమా రక్షణ ఛత్రం కాపాడుతోందని ఆ నివేదికలో వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మధ్య తరగతి వర్గాలకు పూర్తి ఆరోగ్య బీమా రక్షణ కల్పిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రశ్రేణిలో నిలవడం గమనార్హం. దూరదృష్టితో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం పరిధిని విస్తరించి మధ్యతరగతి వర్గాలకు కూడా ప్రయోజనం చేకూర్చడంతోనే ఇది సాధ్యపడిందన్నది సుస్పష్టం.

దేశంలో మిస్సింగ్‌ ‘మిడిల్‌’…
దేశంలో 30 శాతం మంది ఉన్న మధ్యతరగతి వర్గాలకు ఆరోగ్య బీమా అందని ద్రాక్షగానే ఉందని నీతి ఆయోగ్‌ నివేదిక వెల్లడించింది. సమాజంలో దారిద్రరేఖకు దిగువన ఉన్న 50 శాతం మంది ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత ఆరోగ్య బీమా పథకాలను అమలు పరుస్తున్నాయి. ధనిక వర్గాలకు చెందిన 20 శాతం మంది ప్రైవేట్‌  కంపెనీల ఆరోగ్య బీమా పాలసీలను తీసుకుంటున్నారు. మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత ఆరోగ్య బీమా కల్పించకపోవడం, ఇటు ప్రైవేట్‌ కంపెనీలు అత్యధిక ప్రీమియంతో అందించే ఆరోగ్య బీమా పాలసీలను కొనుగోలు చేయలేక అనారోగ్యం బారినపడితే దేవుడిపైనే భారం వేస్తున్నారు.

రక్షణ కవచంలా..
మధ్య తరగతి ప్రజలకు కూడా ఆరోగ్య బీమా కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రక్షణ కవచంలా నిలుస్తోందని నీతి ఆయోగ్‌ నివేదిక ప్రశంసించింది. నివేదిక ప్రకారం మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యబీమా కల్పిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రశ్రేణిలో నిలిచింది. కర్ణాటక ముందు వరుసలో ఉంది. మిగులు బడ్జెట్‌ ఉన్న తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ లాంటి రాష్ట్రాలు కూడా మధ్యతరగతి వర్గాలకు ఆరోగ్య భద్రత  కల్పించలేకపోతున్నాయని నీతి ఆయోగ్‌ నివేదిక పేర్కొంది.  

ఆరోగ్యశ్రీలోకి 95 % కుటుంబాలు
రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఆరోగ్య బీమా కల్పించేందుకు ముఖ్యమంత్రి జగన్‌ వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టారు. మొదట వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరించారు. అప్పటివరకు తెల్లరేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలకే ఆరోగ్యశ్రీ పథకం వర్తించేది. ఏడాదికి రూ.2 లక్షల లోపు ఆదాయం ఉన్న కుటుంబాలకే ఈ పథకం కింద ప్రయోజనం కలిగేది. అయితే తెల్లరేషన్‌ కార్డుతో నిమిత్తం లేకుండా వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. వార్షిక ఆదాయం రూ.5 లక్షలు వరకు ఉన్న కుటుంబాలను సైతం వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తేవడంతో రాష్ట్ర ప్రజలకు గరిష్టంగా లబ్ధి చేకూరుతోంది.

రాష్ట్రంలో దాదాపు 95 శాతం కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకంతో ప్రయోజనం దక్కుతోంది. పేదలతోపాటు మధ్యతరగతి వర్గాలకు సంపూర్ణంగా వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకంతో భరోసా లభించింది. స్వయం ఉపాధిపై ఆధారపడ్డవారు, అసంఘటిత రంగ కార్మికులు, చిరు వ్యాపారులు, ప్రైవేట్‌ ఉద్యోగులు… ఇలా అందరికీ ఉచితంగా వైద్య బీమా కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే గుర్తింపు సాధించింది. 

మరింత మెరుగ్గా పథకం విస్తరణ…
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో దాదాపు అన్ని రకాల వ్యాధులను వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి చేర్చారు. 2019 వరకు 1,059 చికిత్సలకే పథకం కింద ఉచితంగా వైద్య సాయం అందుతుండగా ఇప్పుడు 2,436 చికిత్సలను ఆరోగ్యశ్రీలోకి చేర్చారు. చికిత్స వ్యయం రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకురావడంతో పేద, మధ్యతరగతి వర్గాలకు ఎంతో ఊరట లభిస్తోంది. అత్యధిక వ్యయం అయ్యే కాక్లియర్‌ ఇంప్లాంటేషన్, వివిధ రకాల క్యాన్సర్‌ వ్యాధులను కూడా ఈ పథకం పరిధిలోకి చేర్చారు.

కరోనాను ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి చేర్చిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ కావడం గమనార్హం. బ్లాక్‌ ఫంగస్‌ను కూడా ఆరోగ్యశ్రీలోకి చేర్చి బాధితులకు సాంత్వన కలిగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు 92 శాతం ప్రైవేట్‌ ఆసుపత్రులు వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద లబ్ధిదారులకు ఉచితంగా వైద్య సాయం అందిస్తున్నాయి. రాష్ట్రంలోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చికిత్సలను వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేశారు. 

ఆ ఏడు రాష్ట్రాల్లో తెలంగాణ
దేశంలో ప్రధానంగా ఏడు రాష్ట్రాల్లో మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్య బీమా వర్తించడం లేదని, అందులో తెలంగాణ రాష్ట్రం ఒకటని నీతి ఆయోగ్‌ నివేదిక వెల్లడించింది. తెలంగాణలో దారిద్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నారు. తెలంగాణలో 30 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా లేదని నీతిఅయోగ్‌ నివేదిక వెల్లడిస్తోంది. కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.5 లక్షలు లోపు ఉన్నవారికే పథకం వరిస్తుంది. ఇక పథకం కింద అందించే చికిత్స గరిష్ట పరిమితి రూ.1.5 లక్షలు మాత్రమే. 949 రకాల చికిత్సలను నిర్దేశించిన ప్యాకేజీ ప్రకారం అందిస్తారు. స్వయం ఉపాధిపై ఆధారపడ్డ వారు, అసంఘటిత రంగం, వలస కార్మికులు తదితరులకు ఎలాంటి బీమా పథకాలు లేవు. దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తితే ఆ కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి.

ఆ రాష్ట్రాలివే…
ఆరోగ్య బీమా పథకాలు మధ్యతరగతి ప్రజలకు అందడం లేదని నీతి ఆయోగ్‌ ప్రస్తావించిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణతో పాటు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌ ఉన్నాయి. అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్‌లో కూడా పూర్తి స్థాయిలో ఆరోగ్య బీమా పథకాలు అమలు కావడం లేదని నీతి ఆయోగ్‌ వెల్లడించింది.   

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/95-percent-families-under-ysr-aarogyasri-andhra-pradesh-says-niti-aayog