మూడు ప్రతిష్టాత్మక ఆక్వా ప్రాజెక్టులకు శ్రీకారం

  • రూ.36.55 కోట్లతో ఆక్వాటిక్‌ క్వారంటైన్‌ కేంద్రం
  • మార్చి–2023 నాటికి అందుబాటులోకి తెచ్చేలా రాష్ట ప్రభుత్వం చర్యలు

ఆక్వా రైతులకు నాణ్యమైన సీడ్‌ అందుబాటులోకి వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం 3 ప్రతిష్టాత్మక ఆక్వా ప్రాజెక్టుల ఏర్పాటుకు శ్రీకారం చుడుతోంది. రొయ్య పిల్లల ఉత్పత్తి కోసం ఉపయోగించే బ్రూడర్స్‌ (తల్లి రొయ్యలు) నాణ్యతను కాపాడేందుకు, వాటినుంచి ఎలాంటి రోగాలు లేని సీడ్‌ను ఉత్పత్తి చేసేందుకు ఉపయోగపడే ఆక్వాటిక్‌ క్వారంటైన్‌ కేంద్రాన్ని రూ.36.55 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పనుంది. ఇలాంటి కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం దేశంలో ఇదే ప్రథమం. మరోవైపు పండుగప్ప పిల్లల ఉత్పత్తికి రూ.23.78 కోట్లతో హేచరీ, పసుపు పీత పిల్లల ఉత్పత్తి కోసం రూ.14.20 కోట్లతో మరో హేచరీ రాష్ట్రంలో ఏర్పాటు కాబోతున్నాయి. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పిలిచిన అధికారులు 2023 మార్చి నాటికి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేవిధంగా చర్యలు చేపట్టారు. ఈ ప్రాజెక్టుల నిర్వహణకు  సిబ్బంది నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 

బంగారమ్మపేట వద్ద ఆక్వాటిక్‌ క్వారంటైన్‌
విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారమ్మపేట వద్ద ఆక్వాటిక్‌ క్వారంటైన్‌ ఫెసిలిటీ సెంటర్‌ (ఏక్యూఎఫ్‌సీ) ఏర్పాటు కాబోతుంది. ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ ఎపిడ్యూజిస్‌ (ఓఐఈ) గుర్తించిన 8 రకాల వ్యాధులు సంక్రమించని బ్రూడర్స్‌ నుంచి మాత్రమే సీడ్‌ ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. వాటికి వ్యాధులు లేవని నిర్ధారించే పరీక్షలు నిర్వహించే కేంద్రమే ఆక్వాటిక్‌ క్వారంటైన్‌ ఫెసిలిటీ సెంటర్‌. ప్రస్తుతం దేశంలో చెన్నైలో మాత్రమే ఈ కేంద్రం ఉంది. దేశవ్యాప్తంగా రొయ్య పిల్లల్ని ఉత్పత్తి చేసే 560 హేచరీలుండగా.. వాటిలో 389 హేచరీలు ఏపీలోనే ఉన్నాయి. సీడ్‌ ఉత్పత్తి కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బ్రూడర్స్‌ను క్వారంటైన్‌ చేసేందుకు హేచరీలన్నీ చెన్నై కేంద్రం వద్ద నెలల తరబడి పడిగాపులు పడాల్సి వస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని బంగారమ్మ పేట వద్ద  30 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఏడాదికి 1.25 లక్షల బ్రూడర్స్‌ను పరీక్షించే సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఈ కేంద్రంలో 625 బ్రూడర్స్‌ను క్వారంటైన్‌ చేయ్యొచ్చు.

పరసావారిపాలెం వద్ద రెండు హేచరీలు
ఏపీలో ప్రస్తుతం 12వేల హెక్టార్లలో సాగవుతున్న పండుగప్ప (సీబాస్‌), పసుపు పీత (మడ్‌ క్రాబ్‌) సాగు విస్తీర్ణాన్ని రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి సీడ్‌ కోసం మన రైతులు తమిళనాడుపై ఆధారపడాల్సి వస్తోంది.  ఈ పరిíస్థితిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం పరసావారిపాలెంలో రూ.14.20 కోట్లతో పసుపు పీతల హేచరీ, రూ.23.78 కోట్లతో పండుగప్ప హేచరీ ఏర్పాటు చేస్తోంది. 

ఆక్వారంగ విస్తరణకు ఊతం
బ్రూడర్స్‌ సకాలంలో క్వారంటైన్‌ కాకపోవడంతో సీజన్‌లో డిమాండ్‌కు తగిన స్థాయిలో రొయ్యల సీడ్‌ను హేచరీలు ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏర్పాటు చేయబోతున్న ఆక్వాటిక్‌ క్వారంటైన్‌ ఫెసిలిటీ సెంటర్‌ ఆక్వారంగ విస్తరణకు దోహదపడుతుంది. 
– ఐపీఆర్‌ మోహన్‌రాజు, అధ్యక్షుడు, జాతీయ రొయ్య రైతుల సమాఖ్య

ప్రతిష్టాత్మక ప్రాజెక్టులివి
ఆక్వా ఉత్పత్తుల్లో దేశంలోనే నంబర్‌ వన్‌గా ఏపీలో ఆక్వా రంగ సుస్థిరతకు ఈ ప్రాజెక్టులు ఎంతగానో దోహదపడతాయి. అక్వాటిక్‌ క్వారంటైన్‌ ఫెసిలిటీ సెంటర్‌ చాలా కీలకమైనది. దేశంలో మరెక్కడా ఈ సెంటర్‌ లేదు. పసుపు పీత, పండుగప్ప హేచరీల ఏర్పాటుతో రాష్ట్రంలో ఆక్వారంగం మరింత విస్తరిస్తుంది.
– కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/commencement-three-ambitious-aqua-projects-andhra-pradesh-1408242