- వర్చువల్ విధానంలో ప్రసంగిస్తున్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్
- పోషకాహార లోపం నివారణకు అదే పరిష్కారం
- గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్
మెరుగైన వంగడాలను అభివృద్ధి చేయడంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. దేశంలో ఆహార కొరత తీర్చడానికి అదే పరిష్కారమన్నారు. తిరుపతిలో మంగళవారం నిర్వహించిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 50వ స్నాతకోత్సవ వేడుకల్లో విజయవాడ నుంచి వర్చువల్ విధానంలో ఆయన చాన్స్‌లర్ హోదాలో హాజరయ్యారు. గవర్నర్ మాట్లాడుతూ.. ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) తాజా గణాంకాల ప్రకారం దేశ జనాభాలో దాదాపు 14 శాతం మంది ఇంకా పోషకాహార లోపం, ఐదేళ్లలోపు పిల్లల్లో 20 శాతం మంది తక్కువ బరువు సమస్య, పునరుత్పత్తి వయసులో ఉన్న మహిళల్లో 51.4 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని వివరించారు.
పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు బయో–ఫోర్టిఫికేషన్‌పై పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సమీకృత వ్యవసాయ విధానాలు, యాంత్రీకరణ విధానాల్లో పరిశోధనల ద్వారానే సాగు ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని సాధించగలమని గవర్నర్ అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, సాగునీరు సమర్థ వినియోగ సాంకేతికత, దిగుబడులు పెంపొందించడం, వ్యవసాయ–వ్యవసాయేతర రంగాల మధ్య సమన్వయాన్ని పెంచడం తదితర అంశాలపై శాస్త్రవేత్తలు ప్రధానంగా దృష్టి సారించాలని కోరారు. పంటల ఉత్పత్తి, రక్షణకు సంబంధించిన సాంకేతికతలను అభివృద్ధి చేసి రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు. బోధన, పరిశోధనల్లో నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు.
తక్కువ ధరలకు వ్యవసాయ ఉపకరణాలు అందుబాటులోకి తేవడం ద్వారానే రైతుల జీవన స్థితిగతులను మెరుగుపర్చగలమన్నారు. వ్యవసాయ విద్యార్థులు తాము ఎంచుకున్న ప్రత్యేక అంశాల్లో నిరంతర పరిశోధనలతో విజ్ఞానాన్ని పెంపొందించుకుని నవ కల్పనలను ఆవిష్కరించాలని గవర్నర్ హరిచందన్ ఆకాంక్షించారు. స్నాతకోత్సవంలో తిరుపతి నుంచి విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి, రాజ్‌భవన్ నుంచి గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్‌మీనా, విశ్వ విద్యాలయ ప్రతినిధులు డాక్టర్ వి.చెంగారెడ్డి, డాక్టర్ చెరుకూరి శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ గిరిధర్‌కృష్ణ పాల్గొన్నారు
Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/biswabhusan-harichandan-comments-about-prevention-malnutrition-1386508